- ఐద్వా రౌండ్ టేబుల్ సమావేశం పిలుపు
- మహిళలపై దాడులు ఆపాలి
– బాలికలకు భద్రత కల్పించాలి
ప్రజాశక్తి-ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి : అనంతపురం జిల్లా రాప్తాడులో పదో తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలికపై 21 ఏళ్ల యువకుడు రంపంతో దాడికి పాల్పడిన ఘటన అత్యంత దారుణం, హేయమైన చర్యాని ఐద్వా నేతలు పేర్కొన్నారు. స్నేహితురాలిని రక్షించేందుకు ప్రయత్నించిన మరో బాలికను కూడా గాయపరచడం మరింత బాధాకరమని తెలిపారు. విజయవాడ మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో యుటిఫ్ నాయకులు పద్మ అధ్యక్షతన శుక్రవారం 'రాప్తాడు ఘటనపై' రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఐద్వా రాష్ట్ర కార్యదర్శి వి. సావిత్రి మాట్లాడుతూ... అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన ఘటనలో నిందితుడిని తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత బాలికలకు మెరుగైన వైద్య చికిత్స అందించడంతో పాటు, వారికి తగిన న్యాయం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. మహిళలు, బాలికలపై రోజురోజుకూ పెరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం కఠినమైన చర్యలు చేపట్టాలని, బాలికల భద్రత, స్వేచ్ఛ, ఆత్మగౌరవానికి పూర్తి భరోసా కల్పించాలని అన్నారు. మహిళలపై హింసకు, పురుషాధిక్య భావజాలానికి వ్యతిరేకంగా సమాజంలోని అన్ని వర్గాలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఐద్వా నాయకులు కె. స్వరూపారాణి మాట్లాడుతూ... ప్రేమ, పెళ్లి పేరుతో బాలికలపై దాడులకు పాల్పడటం అత్యంత తీవ్రమైన నేరమని అన్నారు. మహిళలు, బాలికల స్వేచ్ఛను, ఆత్మగౌరవాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలను కేవలం వ్యక్తిగత నేరాలుగా మాత్రమే చూడకుండా, సమాజంలో వేళ్లూనుకున్న పురుషాధిక్య భావజాలాన్ని ప్రశ్నించాలని అన్నారు. బాలికలకు భద్రత, స్వేచ్ఛ, సమానత్వం కల్పించే సామాజిక వాతావరణాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. బాలికలపై హింసకు తావులేని సమాజ నిర్మాణం కోసం ప్రజలందరూ బాధ్యతగా నిలవాలని పిలుపునిచ్చారు. రాప్తాడు ఘటనలో నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత బాలికలకు మెరుగైన వైద్యం అందించి, న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పి. విజయ, శ్రామిక మహిళ రాష్ట్ర కో కన్వీనర్ కె. సుబ్బరావమ్మ, పెద్ద సంఖ్యలో మహిళాలు, మహిళా సంఘ నేతలు పాల్గొన్నారు.







కామెంట్లు (0)