ఆదివారం, 12 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇక ప్రయివేటు క్షిపణులు

1 గంట క్రితం

defence
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 12, 2026, 08:37 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

- కేంద్రం పన్నాగాలు - తొలి దశలో అస్త్ర మార్క్-2 క్షిపణుల

- ఉత్పత్తి లక్ష్యాల భారం పేరిట బిడిఎల్‌ ‌నిర్వీర్యం

- బరిలో ఐకామ్, అదానీ, ఫోర్జ్, టాటా, మహీంద్రా

న్యూఢిల్లీ : రక్షణ రంగంలో ప్రయివేటు రంగం పట్టు క్రమేపి పెరుగుతోంది. దేశ భద్రతకు అత్యంత ప్రధానమైన క్షిపణి తయారీ రంగంలోనూ ప్రయివేటు పెట్టుబడులకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తలుపులు బార్లా తెరిచేస్తోంది. ఇప్పటివరకు ప్రభుత్వ రంగ సంస్థలకే పరిమితమైన క్షిపణుల తయారీలో ఇకపై ప్రైవేట్ సంస్థలకు కూడా అవకాశం కల్పించేందుకు సిద్ధమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా భారత రక్షణ ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్, దేశ సాయుధ బలగాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వంలోని సంబంధిత అధికారులు చెబుతున్నారు. జాతీయ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం.. క్షిపణి తయారీలో ప్రయివేటు సంస్థలకు అనుమతులు ఇవ్వడం వల్ల స్వదేశీ రక్షణ తయారీ సామర్థ్యం పెరగడంతో పాటు రక్షణ ఎగుమతులు కూడా మరింత వేగం పుంజుకునే అవకాశముందని సదరు అధికారుల వాదన. అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం.. రక్షణ రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని క్రమంగా పెంచుతూవస్తోంది. యుద్ధ విమానాలు, డ్రోన్లు, నౌకాదళానికి అవసరమైన పరికరాల తయారీలో ప్రైవేట్ సంస్థలకు తలుపులు తెరిచింది. ఇప్పుడు అత్యంత వ్యూహాత్మకంగా భావించే క్షిపణుల తయారీలోనూ ప్రైవేట్ రంగాన్ని భాగస్వామ్యం చేయాలని కేంద్రం ప్రయత్నించడం దేశ భద్రతకు అంత ఆరోగ్యకరం కాబోదని రక్షణ రంగ విశ్లేషకులు వాపోతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బిడిఎల్‌)‌ను నిర్వర్యం చేసే ఇలాంటి ప్రయత్నాలను కేంద్రం విరమించుకోవాలని సూచిస్తున్నారు.

ప్రస్తుతం భారత సాయుధ బలగాలతో పాటు మిత్రదేశాల నుంచి కూడా స్వదేశీ రక్షణ ఉత్పత్తులకు భారీ స్థాయిలో డిమాండ్ పెరుగుతోంది. అయితే ఆ అవసరాలన్నింటినీ ఒక్క బిడిఎల్‌ మాత్రమే తీర్చడం కష్టంగా మారుతోం‌దని కేంద్రం సాకులు చెబుతోంది. బిడిఎల్‌‌కు తగిన బడ్జెట్‌ ‌కేటాయింపులు, నియామకాలు చేస్తే ఉత్పత్తి లక్ష్యాలు అందుకోవడం పెద్ద కష్టమేమీ కాబోదని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. అంతేకాని దీనిని సాకుగా చూపి క్షిపణి తయారీ వంటి కీలక విభాగాలను ప్రయివేటు రంగ సంస్థలకు కట్టబెట్టేస్తే అవి లాభాల వేటలో దేశ భద్రతను సైతం పణంగా పెట్టే దుస్థితి వచ్చే ప్రమాదముందని హెచ్చరించారు.

కేంద్ర ప్రభుత్వం ప్రయివేటీకరణ ప్రణాళికలో భాగంగా మొదటి దశలో గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే అస్త్ర మార్క్-2 క్షిపణుల తయారీకి ప్రైవేట్ సంస్థలను ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియలో ఐకామ్, అదానీ గ్రూప్, భారత్ ఫోర్జ్, టాటా గ్రూప్, మహీంద్రా గ్రూప్ వంటి ప్రముఖ సంస్థలు పాల్గొనే అవకాశం ఉందని సమాచారం.

అస్త్ర మార్క్-2 క్షిపణిని డిఆర్‌‌డిఒ అభివృద్ధి చేసింది. ఇది దృశ్య పరిధికి అవతల ఉన్న లక్ష్యాలను కూడా సమర్థంగా ఛేదించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. చైనా అభివృద్ధి చేసి పాకిస్థాన్‌కు అందించిన పిఎల్‌-15ఇ దీర్ఘశ్రేణి క్షిపణికి దీటుగా ఈ క్షిపణిని రూపొందించారు. భారత వైమానిక దళంలోని తేజస్ మార్క్-1ఏ, మిగ్-29, సుఖోయ్-30 ఎంకేఐ, రఫేల్ యుద్ధ విమానాలకు ఈ క్షిపణిని అనుసంధానించనున్నారు. భారత్ అభివృద్ధి చేసిన అస్త్ర క్షిపణిపై విదేశీ దేశాలు కూడా ఆసక్తి చూపుతున్నాయి. ఇండోనేసియా ఇప్పటికే ఈ క్షిపణిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో భవిష్యత్తులో రక్షణ ఎగుమతులు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అస్త్ర మార్క్-2తో ప్రారంభమయ్యే ఈ ప్రైవేట్ భాగస్వామ్యాన్ని తర్వాత మరింత విస్తరించాలని కేంద్రం యోచిస్తోంది. రెండో దశలో ప్రళయ్ వంటి శక్తిమంతమైన బాలిస్టిక్ క్షిపణుల తయారీలో కూడా ప్రైవేట్ రంగానికి అవకాశం కల్పించే దిశగా ఆలోచనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. డిఆర్‌‌డిఒ అభివృద్ధి చేసిన ప్రళయ్ క్షిపణి అత్యాధునిక సాంకేతికతతో రూపొందింది. డబుల్ ఇంజిన్ వ్యవస్థతో పనిచేసే ఈ క్షిపణి ధ్వని వేగానికి ఆరు రెట్లు అధిక వేగంతో ప్రయాణించి సుమారు 500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కచ్చితత్వంతో ధ్వంసం చేయగలదు.

ప్రస్తుతం దేశ రక్షణ వ్యవస్థలో దీర్ఘశ్రేణి భూతల లక్ష్యాలను ఛేదించే క్రూయిజ్ క్షిపణులు, నెక్స్ట్ జనరేషన్ బ్రహ్మోస్, 300 కిలోమీటర్ల పరిధి కలిగిన దీర్ఘశ్రేణి గైడెడ్ రాకెట్ పినాక వంటి అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను కూడా భారత్ అభివృద్ధి చేస్తోంది. వీటితో పాటు ప్రళయ్ క్షిపణి కూడా భారత రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయనుంది. ఈ క్రమంలో రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసిన ఐదు ఎస్‌-400 గగనతల రక్షణ వ్యవస్థల్లో ఐదో వ్యవస్థ ఈ ఏడాది నవంబర్‌లో భారత్‌కు చేరుకోనున్నట్లు తెలుస్తోంది. అలాగే దేశ భద్రతను మరింత పటిష్టం చేసేందుకు మరో ఐదు ఎస్-400 వ్యవస్థల కొనుగోలుకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థలను ఆత్మాహుతి డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణుల దాడుల నుంచి రక్షించేందుకు రష్యాకు చెందిన పాంట్‌సిర్ గగనతల రక్షణ వ్యవస్థను కూడా వినియోగించాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్