ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చిన్న వయస్సులోనే వృద్ధాప్య ఆరోగ్య సమస్యలు

02 అక్టోబర్, 2026

చిన్న వయస్సులోనే వృద్ధాప్య ఆరోగ్య సమస్యలు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 02, 2026, 11:30 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

​- 30 ఏళ్లకే రక్తంలో పెరుగుతున్న షుగర్‌ లెవల్స్‌

- ప్రతి ముగ్గురు ఉద్యోగుల్లో ఒకరికి ముప్పు

- విటమిన్‌ డి, బి12 లోపాలు.. ఒత్తిడి, నిద్రలేమి కూడా అధికమే

- ‘వర్క్‌ఫోర్స్‌ హెల్త్‌ ఇండెక్స్‌–2026’లో కీలక విషయాలు

న్యూఢిల్లీ : దేశంలోని ఉద్యోగుల్లో చిన్న వయసులోనే వృద్ధాప్యానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. కార్పొరేట్‌ బీమా, ఆరోగ్య సేవల సంస్థ లూప్‌ రూపొందించిన ‘వర్క్‌ఫోర్స్‌ హెల్త్‌ ఇండెక్స్‌–2026’ నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. 30 ఏండ్ల వయస్సులోనే ప్రతి ముగ్గురు ఉద్యోగుల్లో ఒకరికి రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉన్నట్టు నివేదిక గుర్తించింది. విటమిన్‌ డి, బి12 లోపాలు, అధిక ఒత్తిడి, నిద్రలేమి కూడా ఉద్యోగుల్లో విస్తృతంగా ఉన్నట్టు పేర్కొంది. భారత్‌లోని ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితిపై సేకరించిన 11,427 ఆరోగ్య నివేదికలు, 9,097 సర్వే సమాధానాలు, 8,16,003 బయోమార్కర్‌ ఫలితాలను ఈ అధ్యయనంలో పరిశీలించారు.

30 ఏళ్లకే బయటపడుతున్న వ్యాధులు..

సాధారణంగా వయస్సు పెరిగిన తర్వాత కనిపించే కొన్ని వ్యాధులు ఇప్పుడు 30 ఏండ్ల వయస్సులోనే బయటపడుతున్నాయని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా రక్తంలో చక్కెర నియంత్రణ లోపాలు, విటమిన్‌ లోపాలు, ఒత్తిడి వంటి సమస్యలు చిన్న వయస్సులోనే కనిపిస్తున్నాయని వివరించింది. అయితే ఈ గణాంకాలను మొత్తం భారత జనాభాకు వర్తింపజేయలేమని లూప్‌ స్పష్టం చేసింది. ఈ నివేదికలో ఉపయోగించిన సమాచారం ఆరోగ్య నివేదికలు, సర్వే సమాధానాలు, బీమా క్లెయిమ్‌ల ఆధారంగా ఉండటంతో దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరి ఆరోగ్య పరిస్థితిని ఇది ప్రతిబింబించకపోవచ్చని వివరించింది.

​ముంబయిలో అధికం..

ఇక 20 ఏండ్ల వయస్సులో మహిళల హిమోగ్లోబిన్‌ పరీక్షల్లో 30.6 శాతం సాధారణ స్థాయికి దిగువన ఉన్నట్టు నివేదిక పేర్కొంది. పురుషుల్లో ఈ వాటా 4 శాతంగా ఉంది. 60 ఏండ్లు పైబడిన వారిలో మహిళల్లో 42 శాతం, పురుషుల్లో 32.2 శాతం హిమోగ్లోబిన్‌ స్థాయిలు నిర్దేశిత ప్రమాణాల కంటే తక్కువగా ఉన్నట్టు వెల్లడించింది. అలాగే 30 ఏండ్ల వయస్సులో డయాబెటిస్‌ స్థాయికి చేరిన హెచ్‌బీఏ1సీ పరీక్ష ఫలితాలు పురుషుల్లో 10.3 శాతం, మహిళల్లో 4.3 శాతంగా ఉన్నట్టు నివేదిక వివరించింది. దేశంలోని ఐదు ప్రధాన మెట్రో నగరాలను పరిశీలించగా.. ముంబయిలో రక్తంలో చక్కెర అధికంగా ఉన్న ఉద్యోగుల వాటా అత్యధికంగా 46.8 శాతంగా నమోదైంది. పూణేలో ఇది 43.2 శాతంగా ఉండగా, బెంగళూరులో 30.7 శాతంగా నమోదైంది.

ప్రారంభ దశలోనే చికిత్స ముఖ్యం..

వ్యాధులు చిన్న వయస్సులోనే వస్తున్నందున వాటిని త్వరగా గుర్తించి, ప్రారంభ దశలోనే చికిత్స అందించాల్సిన అవసరం ఉందని లూప్‌ హెల్త్‌ కుటుంబ వైద్యుడు మిహిర్‌ షా సూచించారు. మధుమేహాన్ని కేవలం మందులు, ఆహార నియమాలతో నియంత్రించడం సరిపోదనీ, వయస్సు, జీవనశైలి, వ్యాయామం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని చికిత్స అందించాల్సి ఉంటుందని వివరించారు. మొత్తంగా... భారత ఉద్యోగుల్లో ఆరోగ్య సమస్యలు వృద్ధాప్యంలోనే వస్తాయనే భావన మారుతోందని ఈ నివేదిక వెల్లడిస్తోంది. చిన్న వయస్సులోనే కనిపిస్తున్న రక్తంలో చక్కెర సమస్యలు, విటమిన్‌ లోపాలు, ఒత్తిడి, నిద్రలేమిపై ముందుగానే దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ఇది వెల్లడిస్తోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్