- ‘అయోధ్య’ విరాళాలు, నీట్ ప్రశ్నాపత్రం లీక్‌పై నిలదీసిన ప్రతిపక్షం
- ఆరుసార్లు ఉభయ సభలు వాయిదా
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజే నీట్ పేపర్ లీక్, అయోధ్యలోని రామ మందిరంలో విరాళాల కుంభకోణం వంటి అంశాలపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుపట్టాయి. దీనికి ప్రభుత్వం విముఖతం వ్యక్తం చేయడంతో ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. దీంతో పార్లమెంటు ఉభయ సభలు ఆరు సార్లు వాయిదా పడి, చివరికి మంగళవారానికి వాయిదా పడ్డాయి. సోమవారం లోక్‌సభను స్పీకరు ఓం బిర్లా ప్రారంభిస్తూ ప్రశ్నోత్తరాలు నిర్వహణకు సిద్ధపడ్డారు. ప్రతిపక్షాలు నీట్ పేపర్ లీక్, అయోధ్య రామ మందిరంలోని విరాళాల దొంగతనంపై చర్చకు డిమాండ్ చేశాయి. ప్రతిపక్ష సభ్యులు తమ స్థానాల్లో లేచి నినాదాలు హోరెత్తించారు. సభ్యులు సంయమనం పాటించాలని స్పీకరు ఓం బిర్లా విజ్ఞప్తి చేస్తూ, నినాదాలతో సభ పనిచేయలేదని, సభా కార్యకలాపాలు కొనసాగేలా చూడాలని కోరారు. నిరసనలు కొనసాగుతుండటంతో, ఆయన సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. సభ ప్రారంభమైన 13 నిమిషాల్లోనే వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన సభలో గందరగోళం మధ్య, న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ సుప్రీంకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. అయినప్పటికీ సభలో ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది. దీంతో సభను ప్రారంభమైన ఆరు నిమిషాల్లోనే ప్యానెల్ స్పీకరు దిలీప్ సైకియా మధ్యాహ్నం 12.30 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో ప్రతిపక్షాల ఆందోళన కొనసాగడంతో ఐదు నిమిషాల్లోనే మధ్యాహ్నం ఒంటి గంటకు వాయిదా పడింది. మళ్లీ ప్రారంభమైన సభలో అదే పరిస్థితి కొనసాగడంతో దిలీప్ సైకియా.. రెండు నిమిషానల్లోనే మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు. అనంతరం ప్రారంభమైన సభలో ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది. దీంతో సభను ప్యానెల్ స్పీకరు జగదాంబికా పాల్ మూడు నిమిషాల్లోనే మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో మూడు నిమిషాల్లోనే మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో కూడా అదే పరిస్థితి నెలకొనడంతో సభను రెండు నిమిషాల్లోనే మంగళవారానికి వాయిదా వేశారు.
రాజ్యసభలో కూడా అదే తంతు కొనసాగింది. రాజ్యసభను ఛైర్మన్ సిపి రాధాకృష్ణన్ ప్రారంభించారు. ఇటీవల కొత్తగా ఎన్నికైన తొమ్మిది మంది సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ప్రతిపక్ష సభ్యులు నీట్ ప్రశ్నాపత్రం లీక్, అయోధ్య రామ మందిరంలో విరాళాల దొంగతనం అంశాలను లేవనెత్తారు. ఛైర్మన్ వారించినప్పటికీ, ప్రతిపక్ష సభ్యులు చర్చించాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీచార్జిని ఖండించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జవాబుదారీతనం వహించాలని డిమాండ్ చేశారు. ‘నేను లక్షలాది విద్యార్థుల భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాను. దాని కోసమే వేలాది మంది పిల్లలు జంతర్ మంతర్‌కు వచ్చారు. లాఠీచార్జి జరిగింది. ప్రభుత్వం వారిని గాయపరచాలని చూస్తోంది. వారిని అణచివేయాలని ప్రయత్నిస్తోంది’ అని నినాదాల మధ్య ఖర్గే అన్నారు. దీంతో ఛైర్మన్ రాధాకృష్ణన్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో కూడా ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది. దీంతో సభను ఒక్క నిమిషంలోనే మధ్యాహ్నం 12.30 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో ప్రతిపక్షాల ఆందోళన కొనసాగడంతో సభ ఒక్క నిమిషంలోనే మధ్యాహ్నం 12.50 గంటలకు వాయిదా పడింది. అనంతరం ప్రారంభమైన సభలో అదే సీన్ కొనసాగింది. దీంతో సభను 50 సెకెన్లలోనే మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో ప్రతిపక్షాల ఆందోళన కొనసాగడంతో డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ సభను రెండు నిమిషాల్లోనే మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేశారు. అనంతరం ప్రారంభమైన సభలో అదే సీను కనిపించడంతో సభను డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ఒకే నిమిషంలో మంగళవారానికి వాయిదా వేశారు.
ప్రతిపక్షాల భేటీ
అంతకుముందు ప్రతిపక్షాలన్నీ సమావేశమయ్యాయి. రామ మందిర విరాళాల అక్రమాలు, విద్యా వ్యవస్థ ‘కుప్పకూలడం’ వంటి పలు అంశాలపై ప్రభుత్వం నుంచి జవాబుదారీతనం కోరాలని ఇండియా బ్లాక్ నేతలు నిర్ణయించారు. ఈ సమావేశానికి ముందు, తమ వ్యూహాన్ని చర్చించేందుకు ప్రతిపక్ష నాయకులు రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే ఛాంబర్‌లో సమావేశమయ్యారు. ‘2015 నుంచి 152 సార్లు ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయి. 25 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ధర్మేంద్ర ప్రధాన్‌ను తప్పక తొలగించాలి’ అని ఖర్గే అన్నారు. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, గౌరవ్ గొగోయ్, జైరాం రమేష్, సుప్రియా సూలే, సాగరికా ఘోష్, సంజయ్ రౌత్, జాన్ బ్రిట్టాస్‌తో పాటు ఇండియా బ్లాక్ పార్టీల నాయకులు హాజరయ్యారు.








కామెంట్‌లు (0)