శనివారం, 10 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తమిళనాడు : వందమందికి పైగా ఎఐఎస్‌ఎఫ్‌, ఎఐవైఎఫ్‌ కార్యకర్తల అరెస్ట్‌

1 గంట క్రితం

chennai
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026, 01:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

చెన్నై : సిఇసి జ్ఞానేష్‌ కుమార్‌కు వ్యతిరేకంగా నిరసన చేపడుతున్న సుమారు 100మందికి పైగా ఆల్‌ ఇండియా స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ (ఎఐఎస్‌ఎఫ్‌), ఆల్‌ ఇండియా యూత్‌ ఫెడరేషన్‌ (ఎఐవైఎఫ్‌) కార్యకర్తలను చెన్నై పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ‘‘ఓట్ల దొంగతనానికి’’ సిఇసి జ్ఞానేష్‌ కుమార్‌ సూత్రధారిగా వ్యవహరిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై క్రిమినల్ విచారణ, ఇతర చర్యలు తీసుకోవాలని, పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఓట్ల దొంగతనానికి పాల్పడిన వారికి ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం మద్దతు ఇస్తోందని మండిపడ్డారు. ఖండిస్తూ వారు నినాదాలు చేశారు. "మా ఓటు, మా హక్కు!", "మా ఓటు హక్కును దొంగిలించవద్దు!" అంటూ నినాదాలను చేశారు. ఎఐవైఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి కె.భారతి, ఎఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష‍ుడు కె. ఇబ్రహీం నేతృత్వంలో కార్యకర్తలు తమిళనాడులోని ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయాన్ని ముట్టడించేందుకు సచివాలయం వైపు ర్యాలీగా వెళ్లాలని నిర్ణయించారు. అన్నా సాలైలోని పెరియార్‌ విగ్రహం నుండి శివానం సాలై మీదుగా ముందుకు సాగుతున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకారులు ప్రతిఘటించినా, తీవ్ర వాగ్వాదానికి దిగినా పోలీసులు వారిని బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించారు. వారిని ఒక కమ్యూనిటీ హాల్‌లో నిర్బంధించారు. ఈ ఘర్షణలో మైలాపూర్‌కు చెందిన నిరసనకారుడు కవిన్‌కు తలకు గాయం కావడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 'కాక్రోచ్ జనతా పార్టీ' (సిజెపి), ఇతర వామపక్ష సంఘాలు పిలుపునిచ్చిన ఆందోళనలో భాగంగానే తమిళనాడులో ఈ నిరసన చేపట్టారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్