బుధవారం, 16 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అరేబియా సముద్రంలో భారత్, పాక్ నావికాదళ నౌకల ఢీ

1 గంట క్రితం

Pakistan navy ship collides with Indian warship. File photo

Pakistan navy ship collides with Indian warship. File photo

వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 16, 2026, 04:04 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ:

అరేబియా సముద్రంలో ఉత్తర భాగంలో రొటీన్ గస్తీ నిర్వహిస్తున్న భారత నావికాదళ యుద్ధనౌకను పాకిస్తాన్ నావికాదళానికి చెందిన నౌక అత్యంత వేగంగా, ప్రమాదకర రీతిలో సమీపించి ఢీకొట్టింది. అంతర్జాతీయ జలాల్లో మంగళవారం జరిగిన ఈ ఘటనపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.


ఈ విషయమై న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ తాత్కాలిక రాయబారి (చార్జ్ డి ఎఫైర్స్)ని విదేశాంగ శాఖ బుధవారం సమన్లు చేసి, రాతపూర్వకంగా బలమైన నిరసన వ్యక్తం చేసింది. పాక్ నావికాదళ ప్రమాదకర, బాధ్యతారాహిత్య ప్రవర్తన వల్లే ఈ ఘర్షణ వాతావరణం ఏర్పడిందని భారత్ స్పష్టం చేసింది.


కాగా, అంతర్జాతీయ జలాల్లో విధులు నిర్వర్తిస్తున్న భారత యుద్ధనౌక వైపు పాకిస్తాన్ నౌక అత్యధిక వేగంతో దూసుకొచ్చి, అసురక్షిత రీతిలో విన్యాసాలు చేస్తూ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భారత నౌకకు ఎటువంటి తీవ్ర నష్టం వాటిల్లలేదు, అలాగే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. 1991 ఏప్రిల్‌లో సైనిక విన్యాసాలు, కదలికల ముందస్తు సమాచారంపై భారత్-పాకిస్తాన్ మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందంలోని ఆర్టికల్ 10ని పాక్ నౌక తీవ్రంగా ఉల్లంఘించిందని MEA పేర్కొంది.


ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తమ మిలటరీ యూనిట్లకు తగిన సూచనలు ఇవ్వాలని పాక్ దౌత్యవేత్తకు భారత్ స్పష్టం చేసింది. దీనితో పాటు, ఇస్లామాబాద్‌లోని భారత దౌత్య కార్యాలయం కూడా పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు ఈ వ్యవహారంపై అధికారికంగా నిరసన తెలిపింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్