ఇంటర్నెట్ : నేపాల్ వరదల్లో కైలాస మానసరోవర యాత్రకు వెళ్లిన తల్లిదండ్రులు గల్లంతవడంతో తీవ్ర ఆందోళనకు గురైన ఓ యువతి.. వారి కలను నెరవేర్చాలనే పట్టుదలతో కన్నీళ్ల మధ్యే నీట్ పీజీ పరీక్ష రాసింది. మూడు గంటల పరీక్షలో దాదాపు సగం సమయం కన్నీళ్లతోనే గడిచిందని తన్వి అనే యువతి సోషల్ మీడియాలో వెల్లడించింది.
తన తల్లిదండ్రులు వెంకట్రామ్ అన్నందేవర, అనఘ 67 మందితో కూడిన బృందంతో కలిసి కైలాస మానసరోవర యాత్రకు వెళ్లారని ఆమె తెలిపింది. నేపాల్‌లోని ఇమిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్నప్పుడు చివరిసారిగా వారితో మాట్లాడినట్లు పేర్కొంది. వరదల అనంతరం వారితో సంబంధాలు తెగిపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లోనూ తల్లిదండ్రుల కోరిక మేరకు నీట్ పీజీ 2026 పరీక్ష రాసినట్లు తన్వి తెలిపింది. ‘‘నా అడ్మిట్ కార్డుపై ఉన్న ఫొటోను నాన్నే తీశారు. పరీక్ష సమయంలో ఆ ఫొటో కనిపించినప్పుడల్లా ఆయన గుర్తుకొచ్చి భావోద్వేగానికి గురయ్యాను. మానసికంగా ఎంతో సంఘర్షణ ఎదుర్కొన్నప్పటికీ అమ్మానాన్నల కల కోసం పరీక్ష రాయాలని నిర్ణయించుకున్నాను’’ అని ఆమె పేర్కొంది. తాను ఏ పరీక్షకు వెళ్లినా మంచి మార్కులు సాధించాలని తల్లిదండ్రులు కోరుకునేవారని తన్వి గుర్తుచేసుకున్నారు. పరీక్షకు వెళ్లే ముందు అమ్మ పెరుగులో పంచదార కలిపి తినిపించేదని, ఇప్పుడు ఆమె తన పక్కన లేకపోవడం మరింత బాధ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే, తన తల్లిదండ్రులు సురక్షితంగా తిరిగి వస్తారనే ఆశను మాత్రం ఆమె వదులుకోలేదు. వారి రాక కోసం ఎదురుచూస్తూనే, వారు కన్న కలలను నిజం చేసేందుకు కన్నీళ్లను అదిమిపెట్టి పరీక్ష రాసిన తన్వి ఘటన హృదయాలను కలచివేస్తోంది.







కామెంట్‌లు (0)