సోమవారం, 20 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

నేటి నుంచి పార్ల‌మెంట్

12 గంటల క్రితం

parliament
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 20, 2026, 06:15 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

  • సహకరించండి : కేంద్రం

  • ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చ‌కు అనుమతించండి

  • అఖిలప‌క్ష స‌మావేశంలో ప్ర‌తిప‌క్షాలు

  • టిఎంసి రెబ‌ల్ ఎంపిల‌కు ఆహ్వానాన్ని వ్యతిరేకిస్తూ వాకౌట్‌

ప్ర‌జాశ‌క్తి-న్యూఢిల్లీ బ్యూరో : నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 20 నుంచి ఆగస్టు 13 వరకు 19 సిట్టింగ్‌లు (సమావేశ దినాలను) జ‌రుగుతాయని కేంద్రం తెలిపింది. ఢిల్లీలోని పార్ల‌మెంట్ ఎనెక్స్ భ‌వ‌న్‌లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి 40 రాజకీయ పార్టీలకు చెందిన 58 మంది నాయకులు హాజరయ్యారు. పార్లమెంటు సజావుగా సాగేందుకు సహకరించాలని, అనుమతించిన ముఖ్యమైన అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని రాజ్‌నాథ్ సింగ్‌ తెలిపారు. సహకరించేందుకు తామూ సిద్ధంగా ఉన్నామని, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చ‌కు అనుమ‌తించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని ప్ర‌తిప‌క్ష పార్టీలు కోరాయి. పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతుండగా.. అయోధ్య చోరీ, పేపర్ లీకేజీలు, నిరుద్యోగం, పెట్రో ధ‌ర‌ల పెరుగుద‌ల‌, ఇ-20 (ఇథ‌నాల్‌), రైతులు, మణిపూర్‌, పశ్చిమ ఆసియా సంక్షోభం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఇతర ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. నాయకులు లేవనెత్తిన అంశాలన్నింటినీ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ ‌రిజిజు నమోదు చేసుకున్నారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు జెపి నడ్డా, అర్జున్ రామ్ మేఘవాల్, ఎల్‌. మురుగ‌న్‌, అనుప్రియా పటేల్, రాందాస్ అథ్వాలే తదితరులు హాజరయ్యారు. జైరాం ర‌మేష్, గౌర‌వ్ గొగోయ్‌, ప్ర‌మోద్ తివారీ (కాంగ్రెస్‌), టిఆర్ బాలు, తిరుచ్చి శివ (డిఎంకె), మ‌హువా మొయిత్రా, సౌగ‌త్ రాయ్‌ (టిఎంసి), ధ‌ర్మేంద్ర యాద‌వ్ (ఎస్‌పి), జాన్ బ్రిట్టాస్ (సిపిఎం), పి. సంతోష్ కుమార్ (సిపిఐ), సుప్రియా సులే (ఎస్‌పి), అరవింద్ సావంత్ (శివ‌సేన), మ‌హువా మాంఝీ (జెఎంఎం), ఎన్‌డి గుప్తా (ఆప్‌), ఈటి మ‌హ్మ‌ద్ బ‌షీర్ (ఐయుఎంఎల్‌), ఎన్‌కె ప్రేమ్ చంద్ర‌న్ (ఆర్ఎస్‌పి), సంజ‌య్ ఝా (జెడియు), తంబిదురై (అన్నాడిఎంకె), కాకోలి ఘోష్ దస్తీదార్, సుదీప్ బందోపాధ్యాయ (టిఎంసి రెబ‌ల్‌), టిడిపి ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయలు, వైసిపి ఎంపిలు మిథున్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, జనసేన ఎంపి బాలశౌరి, బిఆర్ఎస్ ఎంపి వద్దిరాజు రవిచంద్ర పాల్గొన్నారు.

​స్నేహపూర్వక వాతావరణంలో భేటీ : కిరణ్ రిజిజు

​ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ లోక్‌సభ, రాజ్యసభ సచివాలయాలు జారీ చేసిన బులెటిన్ ప్ర‌కారం ఎనిమిది బిల్లులను జాబితా చేశామన్నారు. ఒకవేళ మరిన్ని బిల్లులను ప్రవేశపెట్టాలని నిర్ణయిస్తే, ముందుగా బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బిఎసి)లో వాటి గురించి చర్చిస్తామని తెలిపారు. ఆ తరువాతే బిల్లులను ప్రవేశపెడతామన్నారు. ​

అయోద్య నుంచి ఇథ‌నాల్ వ‌ర‌కు స‌మ‌స్య‌ల‌ను లేవ‌నెత్తాం : గౌర‌వ్ గొగోయ్‌

​ కాంగ్రెస్ ఎంపి గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ అయోధ్య, ఇథనాల్, విద్యార్థులు, రైతులు, మణిపూర్‌కు సంబంధించిన సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందా లేదా అని దేశం గమనిస్తోందని అన్నారు. ఈ విషయాల నుండి కేంద్రం వెనకడుగు వేస్తే, దాని పర్యవసానాలను ప్రభుత్వమే అనుభవించాల్సి ఉంటుందని అన్నారు. ఎస్‌పి ఎంపి ధర్మేంద్ర యాదవ్ మాట్లాడుతూ అయోధ్య రామ‌మందిరంలో కుంభకోణంలో వాస్తవాలన్నీ ప్రజల ముందుంచాలని అన్నారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, 'ఒకే దేశం, ఒకే ఎన్నిక', 130వ రాజ్యాంగ సవరణ బిల్లు లాంటివన్నీ దేశ ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేసి, రాజ్యాంగబద్ధమైన నియంతృత్వాన్ని తీసుకురావడానికి పన్నిన కుట్రలేనని చెప్పారు..

నీట్ పేప‌ర్ లీక్‌పై చర్చ జ‌ర‌గాలి : జాన్ బ్రిట్టాస్‌

​ "ఇంతటి ముఖ్యమైన, వివాదాస్పద బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టే ముందు తమతో అర్థవంతమైన చర్చ జరగాలని ప్రతిపక్ష పార్టీలు కోరినట్లు సిపిఎం రాజ్యసభ ఎంపి జాన్ బ్రిట్టాస్ తెలిపారు. డీలిమిటేషన్ బిల్లు, 'ఒకే దేశం - ఒకే ఎన్నిక', ఎఫ్‌సిఆర్ఎ వంటి బిల్లులను ప్రతిపక్షాలతో చర్చించిన తర్వాతే తీసుకురావాలని ప్రత్యేకంగా ప్రస్తావించాం. అయోధ్య అంశం, నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై చర్చ జరగాలని కోరాం" అని అన్నారు. సిపిఐ రాజ్యసభ ఎంపి పి. సంతోష్ కుమార్ మాట్లాడుతూ నీట్‌ ‌పేపర్‌ ‌లీకేజికి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ ‌రాజీనామా చేయాలని డిమాండ్‌ ‌చేశారు. అయోధ్య రామమందిర కుంభకోణంపై ప్రత్యేక చర్చ జరపాలని కోరారు. ఆర్‌ఎస్‌పి ఎంపి ఎన్. కె. ప్రేమచంద్రన్ మాట్లాడుతూ పెట్రోల్ ధరల పెంపుపై కేంద్రం చ‌ర్చ‌కు ముందుకు రావాల‌ని అన్నారు. టిఎంసి ఎంపి సౌగతా రాయ్ మాట్లాడుతూ నీట్ పేపర్ లీక్, బెంగాల్‌లో ప్రతిపక్ష పార్టీలపై అరాచకాలు వంటి అనేక ఇతర అంశాలను లేవనెత్తామ‌ని అన్నారు.

అఖిలపక్ష సమావేశంలో ప్ర‌తిపక్షాల వాకౌట్

'నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్‌సిపిఐ)లో చేరిన టిఎంసి నుంచి చేరిన 20 మంది ఎంపిలను సమావేశానికి ఆహ్వానించడంపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు నిర్ణయాన్ని నిరసిస్తూ సమావేశం నుంచి వాకౌట్ చేశాయి. స్పీకర్ వద్ద అనర్హత పిటిషన్లు ఇంకా పెండింగ్‌లో ఉండగానే వారికి ప్రత్యేక సీటింగ్‌ ఇవ్వడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించాయి. శివసేన(ఠాక్రే) తిరుగుబాటు ఎంపిల విలీన అంశాన్నీ ప్ర‌తిపక్షాల నేతలు ప్రస్తావించారు.

​ అఖిలపక్ష సమావేశంలో డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు లభించినట్లు కొన్ని టివి ఛానెళ్లు ప్రసారం చేస్తున్న వార్తలు కావాలని సృష్టించిన తప్పుడు వార్తలని కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జైరాం రమేష్ పేర్కొన్నారు. "మా పార్టీకి చెందిన ఆరుగురు ఎంపిలకు 'అఫిలియేషన్' (అనుబంధ గుర్తింపు) కల్పించినట్లు స్పీకర్ పేర్కొన్నారు. ఇలా గుర్తించడానికి రాజ్యాంగంలో గానీ, 10వ షెడ్యూల్‌లో గానీ ఎటువంటి నిబంధన లేదు. ఇది చట్టవిరుద్ధం. దీనిని నిరసిస్తూ బయటకు వచ్చాం" అని శివసేన (ఠాక్రే) ఎంపి అరవింద్ సావంత్ అన్నారు. ఆప్ ఎంపి ఎన్‌డి గుప్తా మాట్లాడుతూ రాజ్యసభలోని 10 మంది ఆప్‌ ఎంపిలలో ఏడుగురిని హైజాక్‌ ‌చేశారని, చెల్లుబాటవుతుందో లేదో తేల్చాలన్న తమ పిటిషన్ పెండింగ్‌లో ఉండగానే రాజ్యసభలో ప్రత్యేక సీట్లను కేటాయించడం ప్రజాస్వామ్యాన్ని హైజాక్ చేసి, హత్య చేయడమేనని అన్నారు. సిపిఎం ఎంపి జాన్ బ్రిట్టాస్ మాట్లాడుతూ టిఎంసి తిరుగుబాటు ఎంపిలకు ఆహ్వానం ఇవ్వడాన్ని తప్పుపట్టారు. ఇది ప్రజాస్వామ్యానికి జరిగిన అన్యాయంగా అభివర్ణించారు. "అసమ్మతి ఎంపిలను ఆహ్వానించడం అఖిలపక్ష సమావేశం పవిత్రతకు విరుద్ధం. దీనిని నిరసిస్తున్నాం" అని జాన్ బ్రిట్టాస్ అన్నారు. నిబంధనలకు అనుగుణంగా ఉంది కాబట్టే టిఎంసి చీలిక ఎంపిలను ఆహ్వానించానంటూ కిరణ్‌ ‌రిజిజు సమర్ధించుకున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్