- ప్రొరోగ్ కాని పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
ప్రజాశక్తి - న్యూఢిల్లీ బ్యూరో : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడి వంద రోజులు గడిచినా ఇప్పటివరకు అధికారికంగా ముగియకపోవడం కొత్త రికార్డుగా నిలిచింది. మహిళా రిజర్వేషన్ చట్టం ముసుగులో వివాదాస్పద డీలిమిటేషన్ బిల్లును ఆమోదించుకునేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదింపజేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తుందా లేదా అన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. శనివారం వరకు లోక్‌సభ, రాజ్యసభలను మోడీ ప్రభుత్వం ప్రొరోగ్ చేయలేదు. ఆగస్టు 13న ఉభయ సభలను నిరవధికంగా వాయిదా వేశారు. సమావేశాలను అధికారికంగా ముగించే ప్రొరోగేషన్ ప్రక్రియ చేపట్టలేదు. గతంలో 2008లో పార్లమెంట్ సమావేశాలు 87 రోజులపాటు ప్రొరోగ్ కాకుండా కొనసాగాయి. ఇప్పుడు ఆ రికార్డును అధిగమించి 100 రోజులకు చేరాయి. ప్రత్యేక సమావేశాలపై స్పష్టత లేకపోవడంతో పార్లమెంట్ శీతాకాల సమావేశాల తేదీలపైనా అనిశ్చితి నెలకొంది. డిసెంబరు మొదటి వారంలో శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుత సమావేశాలను పొడిగించాలంటే కనీసం రెండు రోజుల ముందస్తు నోటీసు అవసరం కాగా, కొత్త సమావేశాలు ఏర్పాటు చేయాలంటే 14 రోజుల నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం 543గా ఉన్న లోక్‌సభ స్థానాలను డీలిమిటేషన్‌తో గరిష్ఠంగా 850 స్థానాలకు పెంచాలని కేంద్రం ప్రతిపాదిస్తోంది. 2029 పార్లమెంట్ ఎన్నికలకు ముందే ఈ బిల్లును ఆమోదించి, లోక్‌సభతోపాటు రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని కేంద్రం చెబుతోంది.
అఖిలపక్ష సమావేశానికి ప్రతిపక్షాలు డిమాండ్
డీలిమిటేషన్ ప్రక్రియపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. లోక్‌సభ స్థానాల సంఖ్యను ప్రస్తుతమున్న 543కే పరిమితం చేస్తూ మరో 25 ఏళ్లపాటు కొనసాగించాలని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ప్రతిపాదించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడి వంద రోజులు గడిచినా, లోక్‌సభలో డీలిమిటేషన్ బిల్లును ఆమోదింపజేసుకునేందుకు అవసరమైన మూడింట రెండొంతుల మెజార్టీ కోసం ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తప్పుడు మార్గాలను ఇంకా అన్వేషిస్తూనే ఉన్నారని అన్నారు.
పార్లమెంట్‌ను విశ్వాసంలోకి తీసుకోవాలి : సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ
న్యూఢిల్లీ : జనాభా లెక్కలకు సంబంధించిన నియోజకవర్గాల పునర్విభజనను మరో 25 ఏళ్ల పాటు నిలిపివేయాలని సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ డిమాండ్ చేశారు. పార్లమెంట్‌ను విశ్వాసంలోకి తీసుకోకపోవడం తీవ్ర అభ్యంతరకమని అన్నారు. "జనాభా లెక్కలకు సంబంధించిన నియోజకవర్గాల పునర్విభజనను మరో 25 ఏళ్ల పాటు నిలిపివేయాలి. సాధారణంగా శీతాకాల సమావేశాలు ఇప్పటికే ప్రారం భమై ఉండాలి... మోడీ, అమిత్ షా, మోహన్ భగవత్ తమ వ్యూహాలను గోప్యంగా ఉంచుతున్నారు. ఇది తీవ్ర అభ్యంతరకరం."
ప్రశ్నోత్తరాల సమయానికి ముప్పు
- సిపిఎం రాజ్యసభ పక్షనేత జాన్ బ్రిట్టాస్
పార్లమెంట్ శీతాకాల సమావేశాల నిర్వహణపై నెలకొన్న అనిశ్చితి ప్రజాస్వామ్యానికి కీలకమైన ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉందని సిపిఎం రాజ్యసభాపక్ష నేత జాన్ బ్రిట్టాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని జవాబుదారీగా నిలబెట్టేందుకు ప్రశ్నోత్తరాల సమయం సభ్యులకు ఉన్న ప్రాథమిక హక్కు అని ఆయన పేర్కొన్నారు. వంద రోజులుగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను ప్రొరోగ్ చేయలేదని, శీతాకాల సమావేశాల ప్రారంభ తేదీపై ఎలాంటి స్పష్టత కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని విమర్శించారు. పార్లమెంట్ సభ్యులు ప్రశ్నలు సమర్పించేందుకు కనీసం 15 రోజుల ముందస్తు నోటీసు అవసరమని ఆయన వివరించారు. కొత్త సమావేశాలకు కూడా 15 రోజుల ముందుగానే నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని, సమావేశాల తేదీలు ప్రకటించిన వెంటనే సభ్యులు ప్రశ్నలు సమర్పించే ప్రక్రియ ప్రారంభిస్తారని తెలిపారు. వర్షాకాల సమావేశాలను ప్రొరోగ్ చేయకపోవడంతో వాటి రెండో విడతగా పార్లమెంట్‌ను తిరిగి సమావేశపరిచే అవకాశం ఉందని, తద్వారా 15 రోజుల నోటీసు నిబంధనను పక్కనపెట్టే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
దాగుడుమూతలు ఎందుకు ?
శీతాకాల సమావేశాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు దాగుడుమూతలు ఆడుతోందని ఆయన ప్రశ్నించారు. సమావేశాల నిర్వహణపై ప్రతిపక్షాలతో పాటు దేశ ప్రజలను కూడా అయోమయంలో ఉంచడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో సమావేశాల తేదీల ప్రకటనలో జాప్యం జరిగినప్పుడు ప్రతిపక్షాలకు అధికారికంగా లేదా అనధికారికంగా సమాచారం ఇచ్చేవారని, ఈసారి పూర్తి గోప్యత పాటిస్తున్నారని విమర్శించారు. పార్లమెంట్ ప్రభుత్వ ప్రైవేటు ఆస్తి కాదని, దాని కార్యకలాపాలను దాగుడుమూతల ఆటగా మార్చకూడదని బ్రిట్టాస్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో పారదర్శకత కనీస అవసరమని, దీనిని పాటించాలని ఆయన డిమాండ్ చేశారు.








కామెంట్లు (0)