హర్యానాలో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన మోడీ
జింద్ (హర్యానా) : చమురు సంక్షోభం నెలకొన్నా దేశాభివృద్ధి ఆగిపోలేదని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. పశ్చిమాసియా సంక్షోభం వంటి పరిస్థితులు 2014కు ముందు వస్తే బహుశా భారతీయ రైల్వేలు స్తంభించిపోయేవని, ఎందుకంటే ఆనాడు చాలావరకు రైళ్లు డీజిల్‌పై నడిచేవని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 12 ఏళ్లలో దాదాపు 99 శాతం నెట్‌వర్క్‌ను విద్యుదీకరించామని చెప్పారు. హర్యానాలోని జింద్ నుండి సోనీపట్‌కు తొలి హైడ్రోజన్ రైలును జెండా వూపి ప్రారంభించిన అనంతరం ప్రధాని మాట్లాడారు. హైడ్రోజన్ రైలుతో హరిత రవాణా (గ్రీన్ మొబిలిటీ) దిశగా దేశం అతిపెద్ద ముందడుగు వేసిందని ఆయన వ్యాఖ్యానించారు. అనేక మాసాలుగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధంతో అంతర్జాతీయ వాణిజ్య రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ కూడా కదనరంగంగా మారిందని అన్నారు. భారత్‌కు రావాల్సిన పెట్రో ఉత్పత్తులు ఈ మార్గం గుండానే రావాలని అన్నారు. 2014కు ముందు ఇటువంటి పరిస్థితి ఏర్పడితే ఏం జరిగి వుండేందని ఆయన ప్రశ్నించారు. "మిగతా దేశాల హైడ్రోజన్ రైళ్ల కంటే ఈ రైలుకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. మా ప్రభుత్వం రూ.14 వేల కోట్లతో రైల్వే, రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టింది. భవిష్యత్తులో మరిన్ని హైడ్రోజన్ రైళ్లు వస్తాయి. 2014 వరకు రైల్వేలో విద్యుదీకరణ 30 శాతం మాత్రమే ఉంది. మేం వచ్చాక 12 ఏళ్లలో రైల్వేలో విద్యుదీకరణ 99 శాతానికి పెంచాం’ అని మోడీ చెప్పారు. ఇటీవల ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల్లో జరిపిన పర్యటన గురించి మోడీ మాట్లా డారు. రాబోయే కాలం లో, క్రీడలకు సంబం ధించిన పలు రంగాలపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ప్రభుత్వాలతో దీనిపై మాట్లాడానని చెప్పారు. 2030లో కామన్వెల్త్ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇస్తోందని, 2036లో ఒలింపిక్స్ మన దేశంలో జరిగేలా చూసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
దేశంలో తొలి హైడ్రోజన్ రైలు
పర్యావరణానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసేందుకు భారతీయ రైల్వే దేశంలో తొలిసారి హైడ్రోజన్‌తో నడిచే రైలును ప్రవేశపెట్టింది. 10 కోచ్‌లతో అందుబాటులోకి తెచ్చిన ఈ హైడ్రోజన్ రైలు రెండు గంటల్లోనే హర్యానాలోని జింద్ - సోనిపట్ స్టేషన్ల మధ్య నడుస్తుంది. ఈ రైలు ఆదివారం మినహా ఆరు రోజులు నడవనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రతి ఆదివారం షెడ్యూల్డ్ నిర్వహణ, సాంకేతిక తనిఖీల కోసం దీనిని ఢిల్లీలోని షకుర్‌బస్తి వర్క్‌షాప్‌నకు పంపుతారని తెలిపారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న ఈ హైడ్రోజన్ రైలు మన ఇంజినీరింగ్ నైపుణ్యానికి మచ్చుతునకగా నిలిచింది. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో ఈ రైలు నడుస్తుంది. అంటే హైడ్రోజన్‌ను విద్యుత్‌గా మార్చుకుని ఇంజిన్‌ను నడిపిస్తుంది. ఈ ప్రక్రియలో నీటి ఆవిరిని ఉద్గారంగా వెలువరిస్తుంది. నీటి ఆవిరి బయటకు వెలువడడం వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు. డీజిల్ ఇంజన్లతో పోలిస్తే హైడ్రోజన్ రైలు ఇంజిన్ తక్కువ శబ్దం చేస్తుంది.







కామెంట్‌లు (0)