మంగళవారం, 21 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Students Protest: ఉక్కుపాదం

11 గంటల క్రితం

cjp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 21, 2026, 12:38 పూర్వాహ్నం | 6 నిమిషాల చదవడం

- పార్లమెంట్‌ ‌మార్చ్‌‌పై విరుచుకుపడిన పోలీసులు లాఠీఛార్జి, టియర్‌ ‌గ్యాస్‌, వాటర్‌ ‌కెనాన్ల ప్రయోగం

- మెట్రో రైల్వే స్టేష‌న్లు మూసివేత, ఇంటర్ నెట్ సేవ‌లు, మొబైల్ నెట్‌వ‌ర్క్‌ నిలిపివేత

- నిర్బంధాన్ని లెక్క చేయని యువత పార్లమెంట్‌ ‌గేటు వద్దకు పలువురు సిజెపి నేతలతో మంత్రుల చర్చలు

- పోలీస్‌ ‌జులుంకు నిరసనగా దీక్ష కొనసాగిస్తా : వాంగ్‌‌చుక్‌ ‌ప్రకటన ఆగని ఆందోళనలు

ప్ర‌జాశ‌క్తి - న్యూఢిల్లీ బ్యూరో : నీట్ పేపర్ లీక్‌‌కు బాధ్యత వహించి కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల‌ని డిమాండ్‌ ‌చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) చేపట్టిన పార్లమెంట్‌ ‌మార్చ్‌‌పై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. న్యాయం చేయాలంటూ దేశ రాజధానికి చేరుకున్న విద్యార్థులు, యువతపై పోలీసులు సోమవారం విరుచుకుపడ్డారు. విచక్షణా రహితంగా లాఠీఛార్జి చేశారు. టియర్‌ ‌గ్యాస్‌, వాటర్‌ ‌కెనాన్‌లను ప్రయో గించారు. జంతర్‌‌మంతర్‌ ‌నుండి ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా విద్యార్థులను కట్టడి చేయడానికి ప్రయత్నించారు. రెండు, మూడు బ్యారికేడ్లను కలిపి వెల్డింగ్‌ ‌చేసి రోడ్లపై అడ్డంగా పెట్టారు. ఢిల్లీ నగరంలోని పలు మెట్రో రైల్వేస్టేషన్లను మూసివేశారు. ఆందోళన కారుల మధ్య సమాచార మార్పిడి లేకుండా చేయడానికి మొబైల్‌‌ ఫోన్ల నెట్‌‌వర్క్‌‌ను నిలిపివేశారు. దీనికోసం ఎక్కడికక్కడ జామర్లను పెట్టారు. ఇంటర్‌‌నెట్‌‌ను ఆపివేశారు. అయితే, ఈ నిర్బంధ కాండ విద్యార్థులను, యువతను ఏ మాత్రం ఆపలేకపోయింది. జంతర్‌‌మంతర్‌‌తో పాటు, ఢిల్లీ నగరంలోని వివిధ ప్రాంతాల నుండి ఆందోళనకారులు ఒక్కసారిగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పార్లమెంట్‌ ‌వైపు కదిలారు.

సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ, సీనియర్‌నేత బృందాకరత్‌ తదితరులతో పాటు ఎస్‌ఎఫ్‌ఐ నేతలు ఆందోళనకారులతో కలిసి నడిచారు. పార్లమెంట్‌ వైపు దూసుకెళ్తున్న నిరసనకారులపై ఎక్కడికక్కడ పోలీసులు విరుచుకుపడటంతో ఢిల్లీ వీధులు రణరంగంగా మారిపోయాయి. పడిపోతున్న తమ సహచరులను ఆస్పత్రులకు తరలించే దృశ్యాలు అనేకచోట్ల కనిపించాయి. ఇంత నిర్బంధాన్ని అధిగమించి పలువురు ఆందోళనకారులు పార్లమెంటు గేటు వద్దకు చేరుకున్నారు. అనూహ్యంగా చోటుచేసుకున్న ఈ సంఘటనతో భద్రతా దళాలు గేట్లను మూసివేయడానికి హుటాహుటిన పరుగులుతీశారు. తీవ్ర స్థాయిలో చోటుచేసుకున్న ఉద్రిక్తతల నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం సిజెపి నేతలతోచర్చలకు అంగీకరించింది. సిజెపి ప్రతినిధులు అశుతోష్ రంగ, సౌరవ్ దాస్ తో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డా చర్చలు జరిపారు. కీలకమైన డిమాండ్లపై చర్చల్లో ఎటువంటి పురోగతి కనిపించలేదు. పోలీసుల హింసాకాండకు నిరసనగా దీక్షను కొనసాగిస్తానని వాంగ్‌‌చుక్‌ ‌ప్రకటించారు. మరోవైపు సోమవారం రాత్రి కూడా ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగాయి. మంగళవారం నాడు శాంతియుతంగా పోరాటాన్ని కొనసాగిసామని ఆందోళన కారులు ప్రకటించారు.

న్యూఢిల్లీ బ్యూరో : సిజెపి పిలుపుతో ​పోలీసుల ఆంక్షలు, భారీ వర్షాన్ని లెక్క చేయకుండా సోమవారం ఉదయాన్నే దేశ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు, యువ‌త‌, మద్దతుదారులు జంతర్ మంతర్ చేరుకున్నారు. వీరితో పాటు పలువురు సినీ నటులు, రాజకీయ నేతలు, ప్రజాస్వామ్యవాదులు, హక్కుల కార్యకర్తలు ఈ మార్చ్ లో పాల్గొన్నారు. దీంతో జంతర్ మంతర్ వెళ్లే దారులన్నీ ఆందోళనకారులతోనే నిండిపోయాయి. ఒక డ్రోన్‌ వీడియాలో జంతర్ మంతర్ తో పాటు... కిలోమీటర్ పొడవున ఆందోళన కారులు వీజువల్స్ కనిపించాయి. కాగా... జంతర్ మంతర్ తో పాటు పక్కనే ఉన్న పార్లమెంట్ స్ట్రీట్, రెసినా హిల్స్, ఇండియా గేట్, రాజేంద్ర ప్రసాద్ రోడ్, సెంట్రల్ ఢిల్లీ మొత్తం విద్యార్థుల‌తో నిండిపోయాయి. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులు జంత‌ర్‌మంత‌ర్ వ‌ద్దకు వెళ్ల‌కుండా ఎక్క‌డికక్క‌డే పోలీసులు, కేంద్ర బ‌ల‌గాలు అడ్డుకున్నాయి. అభిజీత్ దీప్కే కు మద్దతు తెలిపేందుకు వచ్చిన పార్ల‌మెంట్ స‌భ్యుల‌ను, రాజ‌కీయ నేత‌ల‌ను, ఇత‌ర ప్ర‌ముఖుల‌ను కూడా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు పోలీసులతో వాగ్వాదం దిగడంతో కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చివరకు నేతలు దీప్కే నిరాహార దీక్ష చేపట్టిన వేదిక వద్దకు చేరుకొని సంఘీభావం తెలిపారు.

జాతీయ జెండాలతో ముందుకు...

మధ్యాహ్నం తరువాత‌ జంతర్ మంతర్ నుంచి కిలో మీటర్ దూరంలో ఉన్న పార్లమెంట్ వైపునకు కదిలారు. జాతీయ జెండాలు, అంబేడ్కర్, భ‌గత్ సింగ్, మహాత్మా గాంధీ త‌దిత‌ర ప్ర‌ముఖుల‌ చిత్ర పటాన్ని చేతిలో పట్టుకొని...నినాదాలతో శాంతియుతంగా ముందుకు సాగారు. కొందరు సంసద్ మార్గ్ వైపు నుంచి పార్లమెంట్ చేరుకునేందుకు ప్రయత్నించారు. వారిని సంసద్ మార్గ్ పోలీస్ స్టేషన్ ఎదురుగా భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. నిరసన కారులపై పోలీసులు లాఠీలు ఝులిపించగా... పలువురికి గాయాలయ్యాయి. వీరికి అక్కడికడ్కకే ప్రథమ చికిత్స అందించారు. మరోవైపు జంతర్ మంతర్ సర్కిల్ వద్ద‌ నుంచి మరికొంత మంది పార్లమెంట్ వైపు కదం తొక్కారు. వీరిని పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. అయితే వేలాది సంఖ్యలో ఉన్న ఆందోళనకారులను అడ్డుకోవడం సాధ్యపడలేదు. ఆదే మార్గంలో ముందుకు సాగుతూ... రైసినా హిల్స్ మీదుగా పార్లమెంట్ వైపుకు వెళ్లారు. రైల్ భవన్, పార్లమెంట్ సమీపాన ఉన్న ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా దగ్గర విద్యార్థులు, యువ‌త‌పై ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ భాష్ఫ వాయువు(టియర్ గ్యాస్)ను ప్రయోగించింది. అనంతరం లాఠీ చార్జ్ చేసి విద్యార్థుల‌ను, యువ‌త‌ను చెళ్లాచెదురు చేసింది.

​పార్లమెంట్ గేట్ మూసివేత

సిజెపి మార్చ్ పార్లమెంట్ సమీపానికి రావడంతో పార్లమెంట్ భద్రతా బలగాలు ఒక్క సారిగా అలర్ట్ అయ్యాయి. విజయ్ చౌక్ నుంచి పార్లమెంట్‌కు ఉపరాష్ట్రపతి, ప్రధాని, హోం మంత్రి, ఇతర మంత్రులు, ఎంపిలు వెళ్లే మెయిన్ గేట్‌కు పార్లమెంట్ భద్రతా సిబ్బంది తాళం వేశారు. ఈ గేటును దాటుకొని వస్తే అడ్డుకునేలా ఫైర్ ఇంజన్ పైపులను పోలే వాటర్ పైపులను సిద్ధం చేసుకున్నారు. అదికాకుండా... ఒకవేళ పరిస్థితులు చేయి దాటితే తుపాకి కాల్పులు చేసేలా సిఐఎస్ఎఫ్ సిబ్బంది పొజిషన్ తీసుకున్నారు. కాగా... ప్రెస్ క్లబ్ దగ్గర ఉద్రిక్తత పరిస్థితితో ఆ సమీపంలోని కేంద్ర ప్రభుత్వ ఆఫీసులను మూసి వేశారు. ఎవ‌రినీ లోనికి రాకుండా భద్రతను పెంచారు.

​లాఠీ దెబ్బలను లెక్క చేయని విద్యార్థులు

ఇండియా గేట్, పార్లమెంట్‌కు వెళ్లే రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. కానీ ప్రజలు వీటన్నింటినీ దాటుకుని ఢిల్లీకి తరలిరావడంతో కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలు వృధా అయ్యాయి. పార్లమెంట్ స‌మీప ప్రాంతం 'బొద్దింకల'తో నిండిపోయింది. ‘పార్లమెంట్ మార్చ్‌’ లో పాల్గొన్న నిరసనకారులపై పలు చోట్ల పోలీసులు క్రూరంగా వ్యవహరించారు. ఒక్కొక్కరినీ టార్గెట్ చేసుకొని... రౌండప్ చేసుకొని మరీ లాఠీలతో చితకబాదారు. ఒక ఆందోళన కారుడిని ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్(చుట్టు ముట్టి) ఐదుగురు కలిసి చావ బాదారు. ఈ దెబ్బలను తట్టుకొని అలాగే నిలిచిపోయిన నిరసనకారుడు ఎంతైనా కొట్టండి అంటూ నినదిస్తున్న వీడియో వైరల్ అయింది. మరికొన్ని చోట్ల ఇలాంటి పరిస్థితే కనిపించింది. ఒక యువకుడికి చాఠీఛార్జీలో కాలికి తీవ్రగాయమైంది. అయినప్పటికీ, నినాదాలు చేస్తూనే ఉన్న తీరు అందరినీ కదిలించింది. నటులు ప్రకాష్ రాజ్, షబానా అజ్మీలపై కూడా భద్రతా దళాలు దాడి చేశాయి. గీతాంజలి ఆంగ్మోపై దారుణంగా దాడి జరిగింది. జంతర్ మంతర్ వద్ద నిరసన వేదికలను ధ్వంసం చేశారు.

​నేతల దీక్షల విరమణ

సిజెపి వ్య‌వ‌స్థాప‌కుడు అభిజీత్ దీప్కే, ఎస్ఎఫ్ఐ నేత‌లు ఆద‌ర్శ ఎం.సాజీ, ఐషీ ఘోష్‌, ఎఐఎస్ఎ నాయకులు నేహా, మనీష్, అమీన్ తన నిర‌వ‌ధిక‌ నిరాహార దీక్షను విరమించారు. వీరితో బాలివుడ్ సీనియర్ నటి షబానా అజ్మీ, నటుడు ప్రకాశ్ రాజ్, ఆర్‌జెడి ఎంపి మనోజ్ కుమార్ ఝా, ఆర్‌జెడి నేత రాజా రామ్ పాల్, సిపిఎం ఎంపి అమ్రారామ్, సామాజిక కార్యకర్త యోగేంద్ర యాద‌వ్‌, నీట్ ప్రశ్నపత్రం లీక్ నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లో ఆత్మహత్య చేసుకున్న రియా థాపా తండ్రి, మాజీ సైనికుడు రాజేష్ థాపాలు నిమ్మ రసాలు ఇచ్చి దీక్షలు విరమింపజేశారు. ఎస్ఎఫ్ఐ నేత‌లు ఆద‌ర్శ ఎం.సాజీ, ఐషీ ఘోష్‌లు సిపిఎం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎంఎ బేబీ, సీనియ‌ర్ నాయ‌కురాలు బృందా క‌ర‌త్, పొలిట్ బ్యూరో స‌భ్యులు ఆర్‌. అరుణ్ కుమార్‌, విజూ కృష్ణ‌న్‌, నిలోత్ప‌ల్ బ‌సు, కేంద్ర క‌మిటీ స‌భ్యులు క‌నికా ఘోష్‌, ఎఐఎడ‌బ్ల్యుయు ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బి.వెంక‌ట్ స‌మ‌క్షంలో దీక్ష విర‌మించారు. అయితే.. నిరాహార దీక్షలు ముగిసినా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు సిజెపి పోరాటం కొనసాగుతుందని నేత‌లు ప్రకటించారు.

కేంద్ర మంత్రి జెపి నడ్డాతో సిజెపి నేత‌లు భేటీ

తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంచర్చలకు సిద్ధపడిండి. సిజెపి ప్రతినిధులు అశుతోష్ రంగ, సౌరవ్ దాస్ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డాను కలిశారు. ధ‌ర్మేంద్ర ప్రధాన్‌ను తక్షణమే రాజీనామా చేయాలని లేదా పదవి నుండి తొలగించాలని కోరుతూ, తమ డిమాండ్లతో కూడిన ఒక వినతిపత్రాన్ని వారు అందజేశారు. ఈ డిమాండ్లపై తగిన స్థాయిలో చర్చిస్తామని నడ్డా చెప్పారు. అయితే, చర్చల్లో ఎలాంటి హామీ లభించలేదని, తమ డిమాండ్లను అంగీకరించే వరకు శాంతియుత నిరసనలు ఆపబోమని సౌరవ్ దాస్ అన్నారు. మరోవైపు పార్లమెంట్ లోని తన ఛాంబర్ లో కేంద్ర హోమంత్రి అమిత్ షాతో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స‌మావేశం అయ్యారు.

ఈ ఉద్యమానికి ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ మద్దతుగా నిలిచాయి. ఎస్ఎఫ్ఐ నేతృత్వంలో వందలాది మంది విద్యార్థులను ఢిల్లీకి చేరుకున్నారు. ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు హరికిష‌న్ సింగ్‌ సుర్జిత్ భవన్‌తో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రదర్శనలు నిర్వహించారు. పోలీసుల అణచివేత ప్రయత్నాలను యువత ప్రతిఘటించింది. గోడి మీడియాను తిరస్కరించారు. కేంద్ర ప్రభుత్వ చర్యల కారణంగా సోమవారం ప్రారంభమైన పార్లమెంటులో గందరగోళం నెలకొంది. పోలీసుల క్రూరత్వాన్ని కాంగ్రెస్‌, సిపిఎం, టిఎంసి, డిఎంకె, ఆప్‌, ఎస్‌పి, ఎన్‌సిపితో పాటు దేశంలోని అన్ని ప్ర‌తిప‌క్ష పార్టీలు ఖండించాయి.

ఢిల్లీ పోలీసుల దాడిని ఖండించిన ఎఐకెఎస్‌

‌న్యూఢిల్లీ : సిజెపితో పాటు ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎ, ఎఐఎస్‌‌ఎఫ్‌ ‌వంటి విద్యార్థుల సంఘాలు జంతర్‌‌మంతర్‌ ‌వద్ద శాంతియుతంగా నిర్వహిస్తున్న ఆందోళనపై ఢిల్లీ పోలీసులు దారుణంగా దాడిని చేయడాన్ని ఎఐకెఎస్‌ ‌తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఎఐకెస్‌ అధ్యక్షులు అశోక్‌ ‌ధవలే, ప్రధాన కార్యదర్శి విజు కృష్ణన్‌ ‌సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నిరసన చేస్తున్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు క్రూరంగా లాఠీచార్జ్ చేశారని, విచక్షణారహితంగా బాష్పవాయువు ప్రయోగించారని ప్రకటన విమర్శించింది. విద్యార్థులపై దాడి విషయంలో పోలీసులు అన్ని ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘించారని ప్రకటన పేర్కొంది. పోలీసుల దాడిలో వేలాది మంది విద్యార్థులు, యువకులు గాయపడ్డారని తెలిపింది.

protestcjp

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్