- మరో ప్రభుత్వ రంగ సంస్థ బిబ్కాల్కు తాళాలు
న్యూ ఢిల్లీ : మోడీ ప్రభుత్వ హయాంలో మరో ప్రభుత్వ రంగ కంపెనీ మూతపడింది. దేశవ్యాప్తంగా పోలియో వ్యాధిని నివారించడానికి వాక్సిన్లను తయారు చేసిన భారత్ ఇమ్యూనోలాజికల్స్ అండ్ బయోలాజికల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (బిబ్కాల్) పిఎస్ యు మూతపడింది. దీంతో వందలాది మంది కార్మికులు రోడ్డునపడ్డారు. ఏళ్ల తరబడి కార్మికులు ఆందోళన చేసినా.. కోర్టుల్ని ఆశ్రయించినా ఫలితం లేదు. ముందస్తు సమాచారం లేకుండా కంపెనీ మూతపడడంతో కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.
1989లో ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ లో బిబ్కాల్ను స్థాపించారు. ఈ కంపెనీ పోలియో వాక్సిన్ లను, రోగనిరోధక మందుల్ని తయారుచేస్తుంది. ఈ కంపెనీ నష్టాల్లో నడుస్తుందని కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 2022 నుంచి వాక్సిన్ల ఉత్పత్తని నిలిపివేసింది. కార్మికులకు జీతాలు చెల్లించలేదు. సుమారు వందమందిని ఉద్యోగం నుంచి తొలగించింది. వీరంతా తమ జీతాల చెల్లింపు కోసం కోర్టుల్లో పిటిషన్లు వేశారు. సిబిఐ, లోక్ పాల్ జోక్యం చేసుకోవాలని ప్రభుత్వ అధికారులకు లేఖలు రాశారు. నిరసనలు చేశారు. అయినాసరే కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థను మూసివేయడానికే మొగ్గుచూపింది. ఈ ఏడాది సెప్టెంబర్ 17న బిబ్కాల్ ను మూసివేయడానికి పూర్తిగా ఆమోదం తెలిపింది. ఈ కంపెనీని మూసివేస్తే కార్మికులివ్వాల్సిన వేతనాలు, ఇతర ప్రయోజనాల విషయంలో, ఉద్యోగం పోయిన కార్మికుల్ని వేరే సంస్థల్లో సర్దుబాటు చేస్తారా? లేదా అన్న విషయాలపై అందులో పనిచేసిన వారెవరికీ ఎలాంటి స్పష్టత లేకపోవడం గమనార్హం.
ఉద్యోగం పోయిన తర్వాత తన ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉందని ఓ ఉద్యోగి విజయ్ ప్రకాశ్ నాగ్ ఆవేదన వ్యక్తం చేశారు. 2015లో బిబ్కాల్ లో ఉద్యోగంలో చేరాను. ఈ ఉద్యోగం రాకముందు ప్రయివేట్ కంపెనీలో పనిచేసినప్పుడు నాకు ఐదువేలు జీతం. బిబ్కాల్ లో నా జీతం రూ.15 వేలకు పెరిగింది. 17 ఏళ్లపాటు నాకు ఉద్యోగ భద్రతతోపాటు, ఆర్థిక భద్రతను కల్పించింది. నా కుమార్తెను ప్రయివేటు ఇంగ్లీషు మీడియం స్కూల్ లో చేర్పించాను. ఈ కంపెనీ మూసివేసే సమయానికి నాకు 55 వేల జీతం వచ్చేది. కంపెనీ మూతపడడంతో నా జీవితం తలకిందులైంది. నా కూతురిని చదివించుకోవడానికి నా దగ్గర డబ్బు లేదు. తన స్కూల్ ఫీజు కట్టలేదని నా కూతురు నాతో రోజూ గొడవపడుతోంది. నాకిప్పుడు 47 ఏళ్లు. ఇంకా సర్వీసు 17 ఏళ్లు మిగిలి ఉంది. ఈ వయసులో ఉద్యోగం కోసం వెళితే ప్రయివేటు సంస్థలు తిరస్కరిస్తున్నాయి. ఖర్చులన్నీ పెరిగిపోయాయి. అద్దె చెల్లించడంలో కొంచెం ఆలస్యమైనా ఇంటి యజమాని అవమానిస్తారు. ప్రభుత్వం ఈ కంపెనీని మూసివేస్తే.. మమ్మల్ని వేరే కంపెనీలో సర్దుబాటు చేయాలని మాత్రమే నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా మార్చడంలో మా పాత్ర ఉంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోకపోవడంతో నా రెండు కాళ్లకు పోలియో సోకినట్లుగా ఉంది”అని ఆయన ఆవేదన చెందారు.
బిబ్కాల్ మూసివేసిన తర్వాత తన వైద్య ఖర్చులకు కూడా డబ్బుల్లేవని మరో ఉద్యోగి దినేష్ చంద్రపత్ అన్నారు. 'నేను 1993లో ఈ కంపెనీలో చేరాను. ఈ ప్లాంట్ లో ఎయిర్ కండిషనింగ్ యూనిట్లు, లేబరేటరీస్ నిర్వహించాను. దాదాపు 30 ఏళ్ల సర్వీస్ చేశాను. మూసివేసే సమయానికి రూ. 80 వేలు జీతం వచ్చింది. పిల్లల్ని ఢిల్లీలో చదివించాను. 2022లో ఈ కంపెనీలో ఉత్పత్తి నిలిచిపోయే కొన్ని నెలలముందు ఇల్లు కట్టుకోవడానికి గృహ రుణం పది లక్షలు తీసుకున్నాను. కంపెనీ మూసివేయడంతో ఆ అప్పుకి వడ్డీ పెరిగిపోతోంది. ఆ డబ్బును తిరిగి చెల్లించలేకపోతున్నాను. ఇల్లు గడవడం కూడా కష్టంగా ఉంది` అని ఆయన అన్నారు. తన భార్య రేఖా పంత్ మాట్లాడుతూ.. ‘రోజు వారీ ఇంటి, వైద్య ఖర్చులను తీర్చుకోవడానికి చెవిపోగులు, ముక్కుపుడక, గొలుసు, చివరికి నా మంగళసూత్రంతో సహా నా దగ్గరున్న నగలన్నింటినీ అమ్మేశాను’ అని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. ‘నాకు, నా భార్యకు ఆరోగ్యం బాగోదు. ఇటీవల నేను డాక్టర్ వద్దకు వెళితే రూ. 7 వేలు ఖర్చయింది. ఒక నెల తర్వాత మళ్లీ డాక్టరు రమ్మన్నారు. నా వద్ద డబ్బు లేక వెళ్లలేదు’ అని దినేష్ తన ఆర్థిక పరిస్థితిని తెలిపారు.
ఈ కంపెనీని మూసివేయకూడదని ఉద్యోగులు మూడేళ్లపాటు నిరసన దీక్షలు చేశారు. అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఈ విషయం రాహుల్ గాంధీ దృష్టికి చేరింది. 2025 డిసెంబర్ 11న తన పార్లమెంటు కార్యాలయంలో బాబ్కాల్ ఉద్యోగుల ప్రతినిధి బృందాన్ని కలిశారు. ఈ సందర్భంగా రాహుల్ కార్మికుల పరిస్థితిని తెలుసుకుని తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు. కార్మికులు తీసుకున్న అప్పులు తీర్చలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, ప్రస్తుతం కూడా వారికే ఆధారం లేక బతకడానికి మళ్లీ అప్పులు చేస్తున్నారని ఆయన వాట్సాప్ ఛానెల్లో ఒక పోస్టులో తెలిపారు.
1980ల చివరలో ప్రపంచవ్యాప్తంగా నమోదైన పోలీయో కేసులలో మూడింట రెండు వంతులు భారత్ లోనే నమోదయ్యాయి. అప్పుడు వాక్సిన్లను దిగుమతి చేసుకునే పరిస్థితి నెలకొంది. ఈ మశూచిని నిర్మూలించడానికి రాజీవ్ గాంధీ సోవియట్ యూనియన్ సహాయంతో 1989లో బిబ్కాల్ ను స్థాపించడంలో కీలక పాత్ర పోషించారు. 1996లో వాణిజ్యపరమైన ఉత్పత్తిని ప్రారంభించి, తర్వాతి కాలంలో దేశానికి అవసరమైన పోలియో వ్యాక్సిన్ లలో 60 శాతాన్ని ఇది సరఫరా చేసింది. దీనివల్లే 2012 జనవరి నాటికి దేశంలో కొత్త పోలియో కేసులు నమోదు కాలేదు. ఈ సంస్థ మూతపడినా కార్మికులకు జీతాలు చెల్లించలేదు. 2023 సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు మాత్రమే అంటే కేవలం మూడు నెలలకు జీతాల్ని 2026 ఫిబ్రవరిలో చెల్లించారు. మిగిలిన బకాయిల్ని ప్రభుత్వం చెల్లించలేదు. వారికెలాంటి ఆర్థిక సహాయం చేయలేదు. ఆర్థిక సమస్యల్ని తట్టుకోలేక మా స్నేహితుల్లో నలుగురు చనిపోయారు. మేము ఈ ప్రభుత్వానికి ఓటు వేశాం. కానీ ఇలాంటి సమయంలో వారు మమ్మల్ని ఆదుకోలేదు. మాకు దక్కాల్సింది మాకివ్వడం లేదు అని మరో ఉద్యోగి సునీల్ కుమార్ శర్మ అన్నారు. ప్రస్తుతం ఈ కంపెనీ కోతలుకు, జింక జాతికి చెందిన నీల్ గాయ్ లకు నిలయంగా మారింది. అసలు కంపెనీ మూసివేసే సంగతి అక్కడ పనిచేసే ఉద్యోగులకు న్యూఢిల్లీలోని మంతిత్రత్వ శాఖ అధికారులు ఇప్పటివరకు అధికారిక సమాచారమే అందించలేదు.








కామెంట్లు (0)