న్యూఢిల్లీ : '' సరైన నాయకత్వం అవసరం.. రెండో స్వాతంత్ర్య పోరాటానికి సిద్ధమా ? `` అని సోనమ్ వాంగ్ చుక్ ప్రశ్నించారు. దేశాన్ని అర్థవంతమైన మార్పు దిశగా నడిపించగల నాయకులను గుర్తించడంలో తనకు సహకరించాలని పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ ప్రజలను కోరారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ వీడియోను పోస్టు చేశారు. ప్రస్తుత ఎంపీల్లో దాదాపు సగం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, వారిలో పలువురిపై హత్య, అత్యాచారం వంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగలేదని, ప్రపంచ మార్కెట్‌లో గౌరవంగా నిలబడలేదని అన్నారు. 2047 నాటికి భారత్ గౌరవప్రదమైన దేశంగా నిలవాలంటే కనీసం నాయకులను ఎన్నుకునే విధానంలోనైనా శాంతియుత విప్లవం రావాల్సిన అవసరం ఉందని వాంగ్‌చుక్ పేర్కొన్నారు. దేశాభివృద్ధిని ఆకాంక్షిస్తూ నిజాయతీ, ధైర్యం, విలువలు కలిగిన వ్యక్తులు తమ చుట్టుపక్కల ఉంటే వారి వివరాలను తనకు తెలియజేయాలని ప్రజలను కోరారు.
దేశ భవిష్యత్తు పై ఆలోచించా : వాంగ్ చుక్
కొద్ది రోజులుగా తాను అనారోగ్యంతో ఉన్నానని, ఆ సమయంలో దేశ భవిష్యత్తుపై ఆలోచించానని తెలిపారు. తలసరి జిడిపి పరంగా 50 ఏళ్ల క్రితం భారత్ కంటే వెనుకబడి ఉన్న పలు దేశాలు ఇప్పుడు ఎంతో ముందుకు వెళ్లాయని చెప్పారు. థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా, శ్రీలంక, బంగ్లాదేశ్‌లను ఇందుకు ఉదాహరణలుగా పేర్కొన్నారు. పొరుగు దేశాలతో పోలిస్తే భారత్ పురోగతి పట్ల తాను నిరాశ చెందుతున్నానని అన్నారు.
సరైన రాజకీయ నాయకత్వం అవసరం : వాంగ్ చుక్
దేశాభివృద్ధికి మెరుగైన విద్యా విధానంతో పాటు సరైన రాజకీయ నాయకత్వం అవసరమని వాంగ్‌చుక్ పేర్కొన్నారు. కేంద్ర విద్యాశాఖలో ఇటీవల చోటుచేసుకున్న మార్పులను ప్రస్తావిస్తూ.. విద్యార్థుల నిరసనల అనంతరం విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం స్వాగతించదగిన పరిణామమన్నారు. అయితే కొత్త మంత్రి వచ్చినంత మాత్రాన విద్యారంగంలో అద్భుతమైన మార్పులు చోటుచేసుకుంటాయని భావించలేమన్నారు. విద్యారంగం వెనుకబడి ఉన్నంతకాలం దేశ భవిష్యత్తు కూడా వెనుకబడే ఉంటుందని పేర్కొన్నారు.
రెండో స్వాతంత్ర్య పోరాటానికి సిద్ధమా ? : వాంగ్ చుక్
ప్రభుత్వ చర్యలపై భిన్నాభిప్రాయాలు, నిరసనలు వ్యక్తం చేయడాన్ని అణచివేయడం సరైన పద్ధతి కాదని వాంగ్‌చుక్ అన్నారు. కేంద్రంలోనే కాకుండా వివిధ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ ఇలాంటి ధోరణులు కనిపిస్తున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. 2012-13లో జరిగిన అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో సరైన నాయకత్వాన్ని ఎన్నుకోవడం కూడా ఒకటని అన్నారు. నాయకులు సరైనవారు కాకపోతే దేశం మొత్తం తప్పుదారి పట్టే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రజలు రెండో స్వాతంత్ర్య పోరాటానికి సిద్ధమా ? అని వాంగ్ చుక్ ప్రశ్నించారు.








కామెంట్‌లు (0)