- సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఏ.బేబీ
న్యూఢిల్లీ :ఢిల్లీలో నిరసనలను హింస, గూండాయిజంతో ఆపలేరని సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఏ.బేబీ పేర్కొన్నారు. గత రెండు రోజులుగా నిరసనకారులపై ఢిల్లీ పోలీసులు నిర్భయంగా హింసను ప్రయోగిస్తున్నారని మండిపడ్డారు.పేరు ట్యాగ్‌లు లేని సిబ్బందితో బలప్రయోగం చేయడంతో పాటు పౌరులను గుర్తు తెలియని వాహనాల్లో తరలిస్తున్నారని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. దేశ రాజధానిలో చట్టబద్ధమైన పాలన పట్ల అధికార పక్షానికి,హోం మంత్రి అమిత్ షాకు ఉన్న నిర్లక్ష్యాన్ని ఇవి స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. ఒక మహిళా జర్నలిస్టుపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరించడం, మహిళా నిరసనకారులను,వారి నిరసనలను కవర్ చేస్తున్న జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని భయపెట్టడానికి లైంగిక దాడిని ఒక సాధనంగా ఉపయోగిస్తున్నారని ఆగ్రహించారు. ఎన్నికల సంఘాన్ని ప్రజాస్వామ్య వధశాలగా మార్చిన ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను రక్షించడానికే ఇదంతా జరుగుతోందని పేర్కొన్నారు.ప్రజలు తమ తీర్పును ఇచ్చారని, జ్ఞానేష్ కుమార్ పదవి నుంచి వైదొలగాలని,మన ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి పోరాడుతున్న నిరసనకారులను హింస, గూండాయిజం నిరోధించలేవని అమిత్ షా, ఢిల్లీ పోలీసులు గ్రహించాలని తెలిపారు.







కామెంట్‌లు (0)