న్యూఢిల్లీ : క్యాన్సర్ రోగులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే పలు రకాల మందుల ధరలను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. తగ్గించిన ధరలకే మందులను విక్రయించాలని మెడికల్ షాపులు, ఆసుపత్రులకు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా 137 క్యాన్సర్ మందులపై 30 శాతం గరిష్ఠ ట్రేడ్ మార్జిన్ (TMR) పరిమితిని కేంద్రం అమల్లోకి తీసుకొచ్చింది.
ఈ నిర్ణయంతో 679 బ్రాండ్ల మందుల ధరలు 50 శాతానికి పైగా తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. సవరించిన గరిష్ఠ చిల్లర ధరలు (MRP) సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చాయని తెలిపింది.
ఈ-యాప్ తో కొత్త ధరల వివరాలను తెలుసుకోవచ్చు
ఈ ధరల తగ్గింపుతో దేశవ్యాప్తంగా క్యాన్సర్ రోగులకు మందుల కొనుగోలుపై మొత్తం రూ.3,540 కోట్ల వరకు ఆదా కానుందని కేంద్రం అంచనా వేసింది. కొత్త ధరల వివరాలను 'ఫార్మా సహి దామ్' (Pharma Sahi Daam) యాప్‌లో తెలుసుకోవచ్చని సూచించింది. తగ్గించిన ధరలు అమల్లోకి వచ్చినప్పటికీ మెడికల్ షాపులు లేదా ఆసుపత్రులు పాత ధరలకు, అంతకంటే ఎక్కువ ధరలకు మందులు విక్రయిస్తే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అలాంటి సందర్భాల్లో 1800-111-255 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (NPPA) అధికారులు రోగులకు సూచించారు.







కామెంట్‌లు (0)