శుక్రవారం, 04 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సంఘ్‌ పరివార్‌ ఉన్మాది స్వతంత్ర భరద్వాజ్‌ అరెస్టు

1 గంట క్రితం

bjp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 04, 2026, 10:52 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- సిజెపి ఆందోళనలతో దిగొచ్చిన ఢిల్లీ పోలీసులు

- హత్యాయత్నం కేసు, ఎస్‌సి, ఎస్‌టి చట్టం సెక్షన్లు నమోదు

ప్ర‌జాశ‌క్తి-న్యూఢిల్లీ బ్యూరో : జంతర్‌‌మంతర్‌ ‌వద్ద విద్యార్ధుల ఆందోళన సమయంలో సిజెపి కార్యకర్త తండ్రిపై దారుణంగా దాడికి పాల్పడ్డ సంఘ్‌ ‌పరివార్‌ ఉన్మాది స్వతంత్ర భరద్వాజ్‌‌ను ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. భరద్వాజ్‌ అరెస్టు కోసం సిజెపి నాయకులు, కార్యకర్తలు శుక్రవారం పార్లమెంట్‌ స్ట్రీట్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళ‌న‌కు దిగడంతో ఢిల్లీ పోలీసులు దిగిరాక తప్పలేదు. ఉత్తరప్రదేశ్‌లో భరద్వాజ్‌‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు శుక్రవారం తెలిపారు. అలాగే, భరద్వాజ్‌‌పై హత్యయత్నం కేసు నమోదు చేస్తున్నట్లు చెప్పారు. దాడికి గురైన బాధితుడు ఎస్‌‌సి కావడంతో ఎస్‌‌సి, ఎస్‌‌టి చట్టంలోని సెక్షన్లను కూడా ఎఫ్‌ఐఆర్‌లోకి చేర్చుతామని మీడియాకు పోలీసులు తెలిపారు. కాగా, భరద్వాజ్‌ అరెస్టు ఘటనతో జంతర్‌‌మంతర్‌ ‌వద్ద విద్యార్థుల ఆందోళనలను అణిచివేయడానికి, వారిపై దేశవ్యతిరేకులు అనే ముద్ర వేయడానికి సంఘ్‌‌పరివార్‌ ‌గూండాలు, ప్రైవేటు వ్యక్తులు కుట్రలు, దాడులకు పాల్పడ్డారనే విషయం మరోసారి తేటతెల్లమయింది.

జూలైలో జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళన సమయంలో సిజెపి కార్యకర్త నిషు ఆజాద్ తండ్రి సంజయ్‌‌కుమార్‌పై భరద్వాజ్‌ ‌దారుణంగా దాడికి దిగాడు. పైగా ఈ దాడి గురించి గొప్పగా ప్రచారం చేసుకున్నాడు. సంజయ్ కుమార్ 'పుర్రె పగలగొట్టానని' భరద్వాజ్‌ చెప్పుకున్న ఒక ఇంటర్వ్యూ వీడియో ఇటీవల వైరల్‌‌గా మారడంతో మళ్లీ వివాదంగా మారింది. ఈ వీడియోలో ‘ నేరం తీవ్రమైనప్పటికీ.. బిజెపి నాయకులు కపిల్ మిశ్రా, బిజెపి మిత్రపక్షం ఎల్‌జెపికి చెందిన కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌ల ప్రత్యక్ష అండతోనే జైలు శిక్ష నుండి తప్పించుకున్నానని’ తెలిపాడు. ‘గాయపడ్డ వ్యక్తికి 60 కుట్లు పడ్డాయి. ఆ వ్యక్తిని తీవ్రమైన పరిస్థితిలో అంబులెన్స్‌లో తీసుకువెళ్తున్నారు. ఆయన కుమార్తె పోలీస్ స్టేషన్ బయట నిలబడి, తన తండ్రికి న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని చెబుతోంది. కానీ నన్ను కనీసం జైలుకు కూడా పంపలేరు’ అని కూడా భరద్వాజ్‌ ‌ఈ వీడియోలో తెలిపాడు.

ఈ నేపథ్యంలో సిజెపి సహ కన్వీనర్లు సౌరవ్‌ దాస్‌, అశుతోష్‌ రాంకాతో పాటు ఆజాద్‌ సమాజ్‌ పార్టీ (కాన్షీరామ్‌) అధినేత, ఎంపి చంద్రశేఖర్‌ ఆజాద్‌, సిజెపి కార్య‌కర్త‌లు పటేల్‌చౌక్‌ నుంచి పోలీస్‌స్టేషన్‌ వరకు ర్యాలీగా వెళ్లి, అక్క‌డ ఆందోళ‌న చేప‌ట్టారు. ఢిల్లీ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భరద్వాజ్‌పై కఠిన చర్యలు తీసుకోవడంలో ఢిల్లీ పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు. సంజయ్‌కుమార్‌పై దాడి జరిగినప్పటి నుంచి న్యాయం కోసం పోరాడుతున్నామని తెలిపారు. దాడి గురించి బహిరంగంగా మాట్లాడుతున్న వ్యక్తి ఇంకా బయట ఎలా తిరుగుతున్నారని ప్రశ్నించారు. ఢిల్లీ పోలీసులు అధికార బిజెపి ఒత్తిడికి లొంగి చర్యలు తీసుకోవడం లేదని, దళిత కుటుంబానికి చెందిన సంజయ్‌, ఆయన కుమార్తెపై జరిగిన దాడిని తక్కువ చేసి చూపుతున్నారని విమర్శించారు. పోలీసుల వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిషు ఆజాద్‌ ‌మాట్లాడుతూ ‘కొంతమంది నాకు అత్యాచార బెదిరింపులు పంపుతున్నారు, నన్ను దూషిస్తున్నారు, నాపై చాలా అసహ్యకరమైన స్టిక్కర్లను తయారు చేసి షేర్‌ ‌చేస్తున్నారు. ఈ సంఘటన తర్వాత, నేను రెండు నాలుగు వారాల పాటు పాఠశాలకు వెళ్లలేకపోయాను’ అని తెలిపారు. ఈ ఆందోళన తరువాత సిజెపి ప్రతినిధులతో ఢిల్లీ పోలీసులు చర్చలు జరిపారు. 72 గంటల్లో భరద్వాజ్‌‌ను అరెస్టు చేస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్