శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్లో ఈ ఏడాది శీతాకాలం ప్రారంభమైంది. దీంతో ఎత్తైన పర్వత ప్రాంతాల్లో తొలిసారిగా హిమపాతం నమోదైంది. దోడా జిల్లా ఎగువ ప్రాంతాలతోపాటు ఉత్తర కాశ్మీర్‌లోని గురేజ్ లోయ, పీర్ పంజాల్ పర్వత శ్రేణుల్లో మంచు కురవడంతో పర్వతాలు తెల్లటి మంచు దుప్పటి కప్పుకున్నాయి. దోడా జిల్లాలో గురువారం కురిసిన మంచు, మేఘావృతమైన వాతావరణంతో ఎగువ ప్రాంతాలన్నీ తెల్లగా మారిపోయాయి. ఉత్తర కాశ్మీర్‌లోని బందిపోరా జిల్లాలో ఉన్న గురేజ్ లోయలోనూ మంచు కురిసింది. లోయలోని మైదాన ప్రాంతాల్లో సుమారు రెండు అంగుళాలు, ఎత్తైన ప్రాంతాల్లో నాలుగు నుంచి ఐదు అంగుళాల మేర మంచు పేరుకుపోయింది. దావర్, తులైల్, బాగ్టోర్, ట్రాగ్బల్, రజ్దాన్ టాప్ ప్రాంతాలు మంచు అందాలతో కొత్త రూపును సంతరించుకున్నాయి. రజ్దాన్ టాప్‌తోపాటు ఎత్తైన ప్రాంతాల్లో మంచు కురవడంతో 85 కిలోమీటర్ల పొడవైన బందిపోరా–గురేజ్ రహదారిని అధికారులు మూసివేశారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఉష్ణోగ్రతలు పడిపోవడం, రహదారులు జారుడుగా మారడంతో ప్రయాణికుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. రాకపోకలను పునరుద్ధరించినట్లు అధికారులు ధ్రువీకరించే వరకు ఈ మార్గంలో ప్రయాణించవద్దని సూచించారు. వాతావరణ, ట్రాఫిక్ శాఖల అధికారిక సూచనలు పాటించాలని ప్రయాణికులకు తెలిపారు. పీర్ పంజాల్లో పూంచ్–కాశ్మీర్ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా అధికారులు చర్యలు చేపట్టారు. బిఆర్ఒకు చెందిన 79వ రోడ్ కన్స్ట్రక్షన్ కంపెనీ (ఆర్సీసీ) పీర్ కి గలి వద్ద మంచును తొలగింపు చర్యలు చేపట్టింది. మరోవైపు హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలోనూ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ధౌలాధర్ పర్వత శ్రేణిలో మంచు కురవడం, ధర్మశాలలో నిరంతర వర్షాలు కురుస్తుండటంతో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. అక్కడ కనిష్ట ఉష్ణోగ్రత 6 డిగ్రీల సెల్సియస్‌గా, గరిష్ట ఉష్ణోగ్రత సుమారు 11 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. దీంతో పలు ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది.









కామెంట్లు (0)