- బిజెపి జాతీయ అధ్యక్షుడికి లేఖ
న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ (బిజెపి) మాజీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా పార్టీకి రాజీనామా చేశారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌కు రాసిన లేఖలో పార్టీతో తనకున్న అన్ని పదవులతో పాటు ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తన నిర్ణయానికి “అత్యవసర ఆర్థిక, వ్యక్తిగత పరిస్థితులు” కారణమని పూనావాలా పేర్కొన్నారు. తన ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రైవేట్ రంగంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. జూలై 30న కూడా పూనావాలా రాజీనామా లేఖ సమర్పించినప్పటికీ, బిజెపి నాయకత్వం దానిని అంగీకరించలేదు. తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని నాయకత్వం కోరింది. అయితే, సుదీర్ఘంగా, తీవ్రంగా ఆలోచించిన అనంతరం పార్టీ నుంచి వైదొలగాలనే తుది నిర్ణయానికి వచ్చినట్లు ఆయన తాజా లేఖలో తెలిపారు. అయితే, బీజేపీ నుంచి తప్పుకున్నప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, బిజెపి దార్శనికతకు, పార్టీ చేపట్టే కార్యక్రమాలకు తన మద్దతు కొనసాగుతుందని పూనావాలా స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, జూలై 31న తన ఎక్స్ ఖాతా బయో నుంచి బిజెపి ప్రస్తావనను తొలగించడంతోనే ఆయన పార్టీని వీడనున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. తాజాగా ఆయన రాజీనామాతో ఆ ఊహాగానాలకు తెరపడింది.








కామెంట్‌లు (0)