ప్రపంచవ్యాప్తంగా చాలా మంది మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. యువతుల నుంచి పెద్దవారిదాకా ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తున్న వ్యాధి ఇది. బ్రెస్ట్ క్యాన్సర్, చికిత్సపై ప్రజలలో ఇప్పటికీ అనేక అపోహలు, భయాలు ఉన్నాయి. బ్రెస్ట్ క్యాన్సర్‌కు నివారణ సాధ్యమే. చికిత్స ఉంది. కానీ ఇందుకోసం కచ్చితమైన సమాచారంతో పాటు లక్షణాలను గుర్తించడం, నివారణ మార్గాలను తెలుసుకోవడం చాలా అవసరం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 1 -31 వరకు బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన నెలగా పాటిస్తారు. ఈ ప్రచారాన్ని "పింక్ అక్టోబర్" (Pink October) అనీ పిలుస్తారు. దీని ముఖ్య ఉద్దేశం బ్రెస్ట్ క్యాన్సర్ గురించిన ముందస్తు సంకేతాలను గుర్తించడం, స్క్రీనింగ్ పరీక్షల ప్రాధాన్యతను వివరించడం.. సకాలంలో వైద్య చికిత్స అందించడాన్ని ప్రోత్సహించడం. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం.
బ్రెస్ట్ క్యాన్సర్ అంటే రొమ్మును తొలగించాలని అర్థం కాదు. ఈ రోజుల్లో ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్-కన్జర్వింగ్ సర్జరీ అనే ఆధునిక శస్త్రచికిత్స చేస్తున్నారు. రోగులు ప్రారంభ దశలోనే వైద్యుల వద్దకు వచ్చినప్పుడు కణితిని మాత్రమే తొలగించి, మిగిలిన బ్రెస్ట్ పరిమాణాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తారు. ఒక మహిళకు బ్రెస్ట్ పరిమాణం పెద్దగా ఉన్నప్పటికీ, దాని పరిమాణాన్ని తగ్గించి, సరైన ఆకృతిని ఇవ్వడం సాధ్యమే.
లక్షణాలు..
బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలను ప్రారంభంలోనే గుర్తించడం చాలా ముఖ్యం. నొప్పి లేని గడ్డ, చనుమొన నుంచి ద్రవం కారడం, లేదా చనుమొన లోపలికి ముడుచుకుపోవడం, చర్మం గట్టిపడటం లేదా ఎర్రబడటం, రొమ్ము ఆకృతిలో మార్పు రావడం వంటివన్నీ బ్రెస్ట్ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు.
కారణాలు...
కొన్ని అలవాట్లు, శారీరక మార్పులు బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. చిన్న వయసులోనే రుతుస్రావం మొదలుకావడం, ఊబకాయం. అలాగే రుతుస్రావం ఆలస్యంగా ఆగిపోవడం, పిల్లలు లేకపోవడం, తల్లిపాలు ఇవ్వకపోవడం. అసలు వ్యాయామం చేయకపోవడం, మద్యం, సిగరెట్లు, పొగాకుకు బానిసవడం వంటివన్నీ ప్రమాద సంకేతాలే. కుటుంబంలో ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ ఉండి ఉంటే, జన్యుపరంగా సంక్రమించే ప్రమదమూ ఉంటుంది. ఈ కారణాలన్నీ కలిస్తే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఇంకా ఎక్కువ.

నివారణా మార్గాలు..
ఊబకాయం ఉంటే, దాన్ని తగ్గించుకోవాలి. ముఖ్యంగా నెలసరి ఆగిపోయిన తర్వాత, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోకుండా చూసుకోవాలి. 30 ఏళ్లలోపు బిడ్డను కనడం ప్రయోజనకరం. అలాగే బిడ్డకు కనీసం ఏడాది పాటు తల్లిపాలు ఇవ్వడం చాలా అవసరం. ఆహారంపై శ్రద్ధ వహించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇలాంటి దైనందిన అలవాట్లు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించగలవు.
గుర్తించడానికి పరీక్షలు..
20 ఏళ్లు దాటిన ప్రతి మహిళ నెలకొకసారి స్వీయ పరీక్ష చేసుకోవాలి. దీనివల్ల మీ శరీరం సాధారణ స్థితి గురించి తెలియడంతోపాటు, ఏవైనా అసాధారణత ఉంటే వాటిని త్వరగా గుర్తించడంలో కూడా ఇది సాయపడుతుంది. మార్పులను ఎంత త్వరగా గుర్తిస్తే, చికిత్స అంత సులభం అవుతుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించండి. ఇంకో పద్ధతి ఏంటంటే ఏడాదికోసారి మీ డాక్టర్‌తో పరీక్ష చేయించుకోవడం. దీన్ని క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామ్ అంటారు. ఈ పరీక్షలో అంతా సవ్యంగా ఉందో లేదో మీ డాక్టర్ చేతితో పరీక్షిస్తారు. మూడవ, కచ్చితమైన పద్ధతి మామోగ్రఫీ. ఈ పరీక్ష ఎంత కచ్చితమైనదంటే రొమ్ములో ఉండే అతి చిన్న గడ్డను కూడా గుర్తించవచ్చు. 40 ఏళ్లు దాటినవారు ప్రతి ఏడాది మామోగ్రామ్ చేయించుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని 40 శాతం వరకు తగ్గించవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి.
పాలివ్వని తల్లులకు ప్రమాదం ఎక్కువా?
బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం బ్రెస్ట్ క్యాన్సర్‌ను నివారించడానికి ఒక ప్రభావవంతమైన మార్గం. ఏడాదిపాటు బిడ్డకు పాలు ఇచ్చే తల్లులకు క్యాన్సర్ ప్రమాదాన్ని 2 నుంచి 4 శాతం వరకు తగ్గుతుంది. ఎంత ఎక్కువ కాలం తల్లిపాలు ఇస్తే, అన్ని ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. ఉదాహరణకు ఒక మహిళ రెండేళ్లపాటు బిడ్డకు పాలిస్తే, బ్రెస్ట్ కాన్సర్ సోకే ప్రమాదం 8 నుంచి 12 శాతం వరకు తగ్గుతుంది. వాస్తవానికి పాలిచ్చే సమయంలో శరీరంలో ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ తక్కువ చురుకుగా ఉంటుంది. ఇది రొమ్ము కణాలు వేగంగా పరిపక్వం చెందడానికి, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి సాయపడుతుంది.
ఏ వయసువారికైనా వస్తుందా?
బ్రెస్ట్ క్యాన్సర్ ఏ వయసులోనైనా రావచ్చు. ఓ 20 ఏళ్ల యువతికి రొమ్ములో ఒక కణితి వచ్చి, దాన్నుంచి రక్తస్రావం అవుతోంది. దాన్ని వైద్యులు పరీక్షించినప్పుడు, అది బ్రెస్ట్ క్యాన్సర్ అని రిపోర్టులో నిర్ధారణ అయింది. ఎందుకింత ఆలస్యం చేశారని వాళ్లమ్మను వైద్యులు అడిగినప్పుడు.. 20 ఏళ్ల అమ్మాయి ఛాతీలోని చిన్నగడ్డ క్యాన్సర్ అవుతుందని అనుకోలేదని ఆమె చెప్పారు. ఇలాంటి ఆలోచనతోనే వారు ఐదారునెలలు గడిపేయడంతో ఆ గడ్డ క్యాన్సర్‌గా మారి, శరీరం అంతటా వ్యాపించింది. నెలల తరబడి చికిత్స చేసినా ఆమెను కాపాడలేకపోయారు. ఈ విషాద గాథ మనందరికీ నేర్పేదేంటంటే.. ఆలస్యం చేయకుండా గడ్డ కనిపిస్తే వెంటనే డాక్టరు దగ్గరికి వెళ్లాలని.

పురుషుల్లోనూ వస్తుందా?
బ్రెస్ట్ క్యాన్సర్ పురుషులకు కూడా రావచ్చు. కానీ చాలా తక్కువ. మహిళల్లో నమోదయ్యే ప్రతి 100 కేసులకు, పురుషులలో కేవలం ఒక కేసు మాత్రమే వస్తుంది. పురుషులకు కూడా చనుమొన కింద బ్రెస్ట్ కణజాలం ఉంటుంది. అక్కడ క్యాన్సర్ పెరగవచ్చు. రొమ్ములో గడ్డ, చనుమొన నుంచి స్రావం, లేదా చనుమొన లోపలికి కుంచించుకుపోవడం వంటి లక్షణాలు మహిళల్లో ఉన్నట్లే ఉంటాయి.
చికిత్సతో దుష్ప్రభావాలా?
క్యాన్సర్ చికిత్స వల్ల దుష్ప్రభావాలు కలుగుతాయి. కానీ చికిత్స పూర్తయిన తర్వాత సాధారణంగా తగ్గిపోతాయి. మహిళల్లో కనిపించే దుష్ప్రభావం జుట్టు రాలడం, కనుబొమ్మల రోమాలు కూడా రాలిపోవడం. ఈ చికిత్సలో భాగంగా రోగి రొమ్మును తొలగిస్తారు. దీనివల్ల చాలా మానసిక, శారీరక మార్పులు కలుగుతాయి. అయితే చికిత్స తర్వాత రోగి బాగా కోలుకుంటారు. తలపై జుట్టు, కనుబొమ్మల రోమాలు తిరిగి పెరుగుతాయి. రొమ్మును దాని అసలు పరిమాణానికి పునరుద్ధరిస్తారు.
తిరగబెట్టే అవకాశం ఉందా?
కొన్ని సందర్భాల్లో చికిత్స తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ మళ్లీ వచ్చే అవకాశం ఉంది. మొదట్లోనే వ్యాధి ముదిరిన వారిలో, లేదా చికిత్స మధ్యలోనే ఆపేసిన వారిలో ఇలా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
కుటుంబ పాత్ర ఎలా ఉండాలి?
బ్రెస్ట్ క్యాన్సర్ తో పోరాటం కేవలం మహిళలది మాత్రమే కాదు. మొత్తం కుటుంబం బాధ్యత. ఈ సమయంలో మహిళకు భావోద్వేగ, మానసిక మద్దతు చాలా అవసరం. ఈ సమయంలో మహిళలు చాలా భయపడతారు. వారి మనస్సులో ప్రతికూల ఆలోచనలు వస్తాయి. నిద్రలేమి, ఆకలి లేకపోవడం, ఏడుపు రావడం వంటి వాటితో బాధపడతారు. ఈ సమయంలో వారికి అన్నింటికన్నా ఎక్కువగా మానసిక మద్దతు అవసరం. జీవిత భాగస్వామే ఆమెకు పెద్ద అండ.
ఏ దశలో నయం చేయవచ్చు?
బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్స ఎంత త్వరగా మొదలుపెడితే అంత మంచిది. మొదటి, రెండవ దశలో, 90 నుంచి 95 శాతం మంది రోగులను నయం చేయవచ్చు. మొదట శస్త్రచికిత్స చేస్తారు. ఆ తర్వాత కీమోథెరపీ, ఆపై రేడియేషన్ థెరపీ చేస్తారు. మూడవ దశలో క్యాన్సర్ కొద్దిగా వ్యాప్తి చెందుతుంది. అందువల్ల కణితిని తగ్గించి, ఆపరేషన్‌ను సులభతరం చేయడానికి మొదట కీమోథెరపీ ఇచ్చి, తర్వాత మిగిలిన చికిత్స కొనసాగిస్తారు. నాల్గవ దశలో క్యాన్సర్ శరీరంలోని ఇతర భాగాలకూ వ్యాపిస్తుంది. రోగి జీవితాన్ని మెరుగుపరచడానికి, పొడిగించడానికి టార్గెటెడ్ థెరపీ, ఇమ్యునోథెరపీ చేస్తారు. మంచి విషయమేంటంటే ఈ ఆధునిక చికిత్సలన్నీ అందుబాటులో ఉన్నాయి.








కామెంట్‌లు (0)