మంగళవారం, 10 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బిజెపి సైద్ధాంతిక, రాజకీయ విధానాలను ఎండగట్టిన ‘‘బిలాంగింగ్‌ : ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌’’

4 గంటల క్రితం

Sonia Gandhi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 10, 2026, 04:41 అపరాహ్నం | 4 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి భారత ప్రజాస్వామ్య సంస్థలను ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేస్తోందని, అసమ్మతిని అణచివేస్తోందని, రాజకీయ, ఆర్థిక అధికారాన్ని కేంద్రీకరిస్తోందని కాంగ్రెస్‌ పార్టీ చైర్‌పర్సన్‌ సోనియగాంధీ విమర్శించారు. దేశంలోని చాలా విద్యా సంస్థలను ఆర్‌ఎస్‌ఎస్‌ తన భావజాల నియంత్రణలోకి తీసుకుందని మండిపడ్డారు. మంగళవారం విడుదలైన ‘బిలాంగింగ్‌ : ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌’ అనే తన ఆత్మకథలో సోనియాగాంధీ బిజెపి రాజకీయ, సైద్ధాంతిక విధానాలను సమగ్రంగా ఎండగట్టారు. అలాగే రాజ్యాంగ సంస్థల పనితీరు, ప్రధాన స్రవంతి మీడియా, కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఎన్నికల ప్రక్రియలు, సంక్షేమ పథకాలు, మత, రాజకీయ మైనారిటీల పట్ల వ్యవహరించే తీరు వంటి అంశాలను కూడా ప్రస్తావించారు. 2016లో రూ.1,000, రూ.500 వంటి పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటనను కూడా ఆ పుస్తకంలో ప్రస్తావించారు. ఈ నోట్ల రద్దు మోడీ అనుసరించే ‘‘నిరంకుశ విధానాలకు’’ స్పష్టమైన ఉదాహరణగా పేర్కొన్నారు. నోట్ల రద్దుతో లక్ష‍లాది మంది ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు, జిఎస్‌టి పన్ను విధింపుతో మరింత తీవ్రతరమయ్యాయని మండిపడ్డారు. రూ. 1,000, రూ. 500 నోట్లన్నీ ఒక్క రాత్రిలోనే చెల్లనివిగా మోడీ ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు. ఈ ప్రక్రియ అత్యంత రహస్యంగా జరగడంతో, నగదు మార్పిడి కోసం ఒక్కసారిగా భారీ డిమాండ్‌ పెరిగిందని, ఇందుకు బ్యాంకులు కూడా సిద్ధంగా లేవని అన్నారు. ఈ చర్య ద్వారా ఆశించిన లక్ష్యాలేవీ నెరవేరకపోగా, ఇది వాణిజ్య వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందని, ఆర్థిక వ్యవస్థలోని కీలక రంగాలను స్తంభింపజేసిందని, లక్షలాది మందిని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టిందని సోనియాగాంధీ తన పుస్తకంలో పేర్కొన్నారు. దాడులు, చట్టపరమైన కేసులు, జైలు శిక్షల ద్వారా రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టడానికి ఈడి, సిబిఐ సంస్థలను "స్వాధీనం చేసుకుని వాడుకుంటున్నారని" అన్నారు. బిజెపి ప్రజాస్వామ్య సంస్థలను ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేసిందని, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి కీలక పాత్ర ఉంటుందని అంగీకరించడానికి వారు సిద్ధంగా లేరని పేర్కొన్నారు. ప్రతిపక్ష ఎంపీలను బహిష్కరించడం ద్వారా లేదా ఎలాంటి చర్చ లేకుండా బిల్లులను బలవంతంగా ఆమోదింపజేయడం ద్వారా వారు పార్లమెంటులో కఠినమైన చట్టాలను తీసుకువచ్చారని అన్నారు.

వందల సంఖ్యలో ఉన్న ప్రత్యర్థులపై రాజకీయ కక్ష సాధింపు చర్యలు, వేధింపులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఒక సాధనంగా మారిపోయిందని ఆ పుస్తకంలో పేర్కొన్నారు. ఎన్నికల సంఘాన్ని బలహీనపరిచిందని, అధికారం కోసం చేస్తున్న ప్రయత్నంలో దానిని ఒక సన్నిహితునిగా మార్చిందని అన్నారు. విద్యాసంస్థలపై ఆర్‌ఎస్‌ఎస్ "భావజాల నియంత్రణ" పట్ల కూడా సోనియా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్ల నియామకాల" ద్వారా పాఠ్యపుస్తకాలను తిరగరాస్తున్నారని పేర్కొన్నారు. ప్రధాన స్రవంతి మీడియాలోని కొన్ని విభాగాలు తమ స్వాతంత్ర్యాన్ని వదులుకుని "ప్రభుత్వ ప్రచార సాధనాలుగా" పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించే వారిని లక్ష్యంగా చేసుకోవడంలో సోషల్‌ మీడియా ట్రోల్స్‌ పోషిస్తున్న పాత్రను కూడా ఆమె ఆ పుస్తకంలో ప్రస్తావించారు. అవినీతిని బయటపెట్టేవారిని, ప్రధానమంత్రి, ఆయన విధానాలను విమర్శించేవారిని చెల్లింపు ప్రాతిపదికన పనిచేసే ట్రోల్‌ బృందాలు ‘దేశద్రోహులు’, ‘జాతి వ్యతిరేకులు’ అంటూ ముద్ర వేస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. అనేక మంది అసమ్మతివాదులను తప్పుడు కేసుల్లో ఇరికించి, బెయిల్‌ లేదా విచారణకు అవకాశం ఇవ్వకుండా జైళ్లలో పెట్టారని అన్నారు.

భారత్‌లో ప్రస్తుతం బహిరంగ నిరసనలు తెలిపేందుకు ఉన్న అవకాశాలను తీవ్రంగా కుదించివేశారని పేర్కొన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, రైతులు, మైనారిటీ వర్గాలు, మహిళలు చేపడుతున్న ఆందోళనలను అణచివేస్తున్నారని విమర్శించారు. గతంలో ప్రధానమంత్రులు తరచూ మీడియా సమావేశాలు నిర్వహించి, జర్నలిస్టులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేవారని, ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని అన్నారు. రాజీవ్‌గాంధీ, ఇతర ప్రధానమంత్రులు క్రమం తప్పకుండా పత్రికా సమావేశాలు నిర్వహించేవారని అన్నారు. కానీ ప్రధాని మోడీ తన పన్నెండేళ్ల పదవీకాలంలో ఒక్క పత్రికా సమావేశం కూడా నిర్వహించలేదని ఆమె పేర్కొన్నారు. బిజెపి "కాంగ్రెస్ రహిత భారత్" అజెండాను కూడా గాంధీ లక్ష్యంగా చేసుకున్నారు. ఈ అజెండా కేవలం కాంగ్రెస్‌నే కాకుండా, దాని విధానాలను, భావజాలాన్ని కూడా నిర్మూలించాలని చూస్తోందని పేర్కొన్నారు. ఈ వ్యతిరేకతకు ఆర్‌ఎస్‌ఎస్ ద్వారా ప్రధానమంత్రికి కలిగిన ప్రభావమే కారణమని తాను భావిస్తున్నానని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ తన కార్యకర్తలలో హిందూమతం పట్ల బహిష్కరించదగిన, కఠినమైన నిబద్ధతను నూరిపోసిందని, దానిని ఒక రాజకీయ అజెండాగా మలిచిందని ఆమె పుస్తకంలో రాశారు. తనకున్న అవగాహన ప్రకారం.. హిందూమతాన్ని విభిన్న నమ్మకాలు, మార్గాలను స్వీకరించే మతంగా వర్ణించారు. ఇది ఏ ఒక్క దైవం, సిద్ధాంతం, ప్రవక్త లేదా గ్రంథానికి కట్టుబడి ఉండదని ఆమె పేర్కొన్నారు. ఆమె 'ఏకం సత్ విప్ర బహుదా వదంతి' అనే వ్యాఖ్యాన్ని ఉటంకిస్తూ, "సత్యం ఒక్కటే, దానికి మార్గాలు అనేకం" అని అనువదించారు.

బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి దళితులతో సహా మత, రాజకీయ మైనారిటీలపై దాడులు పెరిగాయని పేర్కన్నారు. ఇలాంటి చాలా ఘటనలకు శిక్ష పడలేదని ఆమె పుస్తకంలో రాశారు. మైనారిటీలపై ద్వేషాన్ని, అనుమానాన్ని కలిగించేలా రూపొందించిన ప్రచార వీడియోలు, సోషల్ మీడియా కంటెంట్, సినిమాలకు అధికారికంగా అనుమతులు లభిస్తున్నాయని కూడా పేర్కొన్నారు. ‘‘ప్రజలను భయంలోనే మగ్గనివ్వండి. వాగ్దానం చేసిన 'అచ్చే దిన్' ('మంచి రోజులు'), నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, వారి దైనందిన పోరాటంలో వారిని పీడిస్తున్న అన్ని రుగ్మతల పట్ల, అలాగే వారి సమస్యలకు ప్రజా చర్చలో చోటు దక్కే అవకాశం లేకపోవడం పట్ల వారిలో ఉన్న అసంతృప్తిని ఆ భయమే అధిగమిస్తుంది" అని సోనియా రాశారు. మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం, ఉపాధి హామీ పథకం వంటి యుపిఎ హయాంలోని 30కి పైగా కార్యక్రమాలకు పేర్ల మార్చి, వాటి పరిధిని తగ్గించి సొంతం చేసుకుందని సోనియా గాంధీ పేర్కొన్నారు. ప్రభుత్వం డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను విస్తరించి లక్షలాది మంది పేదలను బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానించిందని, కానీ ఈ వ్యవస్థ పనితీరులో చాలా లోపాలు ఉన్నాయని అన్నారు. ఈ వ్యవస్థలో దుర్వినియోగం, అవినీతి, అమలులో వైఫల్యాలను కాగ్‌ వెల్లడించిందని తన ఆత్మకథలో పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్