శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో అధికార నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ)లో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. శ్రీనగర్ లోక్‌సభ సభ్యుడు అగా సయ్యద్ రుహుల్లా మెహదీ పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సంచలన ప్రకటన చేశారు. నవంబర్ 3న తన ఎంపీ పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్లు శనివారం ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో, కనీసం వాటి అమలుకు చర్యలు చేపట్టడంలోనూ పార్టీ విఫలమైందని విమర్శించారు. నవంబర్ 3న బుద్గామ్‌లోని బెహ్‌షిత్-ఎ-జెహ్రా పార్కులో అగా సయ్యద్ మెహదీ వర్థంతి కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం రాజీనామా చేస్తానని అన్నారు. పార్టీలో జరుగుతున్న రాజకీయ బేరసారాలతో తనను ముడిపెట్టవద్దని స్పష్టం చేశారు. ఎన్నికల హామీలను అమలు చేయకపోవడమే తన అసంతృప్తికి కారణమని చెప్పారు. తనకు ఎలాంటి పదవి దక్కలేదని బాధపడటం లేదని అన్నారు. ఎన్‌సీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. జమ్మూకశ్మీర్‌ను ఒక కుటుంబానికి చెందిన వారసత్వ ఆస్తిగా పార్టీ నాయకత్వం భావిస్తోందని అన్నారు. అధికారంలోకి రావడానికి ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని మండిపడ్డారు. ఆర్టికల్ 370 పునరుద్ధరణ, ఖైదీల విడుదల, ప్రజల హక్కుల పరిరక్షణ వంటి హామీలతోనే పార్టీ అధికారంలోకి వచ్చిందని, వాటిని అమలు చేయాలని కోరితే తమకే రాజకీయాలపై అవగాహన లేదన్నట్లుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులను పార్టీలో ఉండి సరిదిద్దడం సాధ్యం కాదని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీతోనే ఎంపీగా గెలిచానని, ఆ హామీలకు ద్రోహం చేయడంలో భాగస్వామి కావడం ఇష్టం లేకే పదవిని వదులుకోవాలని నిర్ణయించుకున్నానని అన్నారు.
పార్టీకి నష్టం లేదు : మంత్రి జావేద్ రాణా
మెహదీ ప్రకటనపై జమ్మూకశ్మీర్ మంత్రి జావేద్ రాణా స్పందించారు. ఆయన పార్టీని వీడినంత మాత్రాన ఎన్‌సీకి ఎలాంటి నష్టం ఉండదని అన్నారు. పార్టీ నాయకత్వం కింద ఎన్‌సీ ఐక్యంగా, బలంగా ఉందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నాయకత్వంలోని ప్రభుత్వం, ఫరూక్ అబ్దుల్లా నాయకత్వంలో పార్టీ పటిష్టంగా ఉన్నాయని పేర్కొన్నారు. మంత్రి పదవులు పరిమితంగా ఉండటంతో కొందరు ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర హోదా పునరుద్ధరణ జరిగితే మరిన్ని మంత్రి పదవులు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.
మంత్రివర్గ విస్తరణతో అసంతృప్తి
ఇటీవల జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన మంత్రివర్గాన్ని విస్తరించారు. కుప్వారా జిల్లా ట్రెహ్‌గామ్ ఎమ్మెల్యే మీర్ సైఫుల్లా, శ్రీనగర్ ఖన్యార్ ఎమ్మెల్యే అలీ మహమ్మద్ సాగర్, హబ్బా కడల్ ఎమ్మెల్యే షమీమా ఫిర్దౌస్, పహల్గామ్ ఎమ్మెల్యే అల్తాఫ్ అహ్మద్ వానీలను మంత్రులుగా తన కేబినెట్‌లోకి తీసుకున్నారు. ఈ విస్తరణ అనంతరం కొందరు నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారని ఎన్‌సీ కశ్మీర్ ప్రావిన్షియల్ అధ్యక్షుడు షౌకత్ అహ్మద్ మీర్ తెలిపారు. అయితే ఇది పార్టీ అంతర్గత వ్యవహారంలో భాగమేనని అన్నారు. కొందరు ఎమ్మెల్యేలు తమతో మాట్లాడినప్పుడు 'దర్బార్ మూవ్' అంశంపై చర్చించినట్లు వెల్లడించారు. ఈ వ్యవహారంలో 27 మంది ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారంటూ వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. ఇలాంటి పుకార్లకు బిజెపి ఆజ్యం పోస్తోందని అన్నారు. జమ్మూ ప్రజలకు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చిన బిజెపి, ఆ విషయంలో విఫలమైందని విమర్శించారు.
ఎన్‌సీలో భగ్గుమన్న విభేదాలు.. ఎంపీ రుహుల్లా మెహదీ రాజీనామా ప్రకటన
31 అక్టోబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 31, 2026, 03:24 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)