విద్య, ఉద్యోగాలే నేటి యువత ఎదుర్కొనే సంక్షోభం
యువతను విభజించేందుకు బిజెపి కుట్రలు
‘లెఫ్ట్ లెన్స్’ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆనంద్ తెల్తుంబ్డే
న్యూఢిల్లీ : ఆశలన్నీ సన్నగిల్లిన తరుణంలో ఉదయించిన సిజెపి ఉద్యమం విద్యా వ్యవస్థలోని విధ్వంసాన్ని ప్రజల ముందు ఉంచిందని ప్రముఖ విద్యావేత్త, ఐఐటి టెక్నోక్రాట్, ప్రొఫెసర్ ఆనంద్ తెల్తుంబ్డే అభిప్రాయపడ్డారు. శనివారం లెఫ్ట్ లెన్స్‌కు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన మాట్లాడారు. విద్య ఏ సమాజ అభివృద్ధికైనా మూలాధారమని, చరిత్రలో విద్య లేకుండా ఏ దేశమూ అభివృద్ధి చెందలేదన్నారు. అలాగే, 1947లో స్వాతంత్య్రం వచ్చే నాటికి పరిస్థితి ఇప్పటికన్నా దారుణంగా ఉండేదని తెల్తుంబ్డే వివరించారు. అప్పట్లో అక్షరాస్యత రేటు దాదాపు 18 శాతమే ఉండేదని, పురుషుల్లో 27 శాతం, మహిళల్లో కేవలం 9 శాతం మాత్రమే అక్షరాస్యులు ఉండేవారని తెలిపారు. సగటు ఆయుఃప్రమాణం 32 సంవత్సరాలు మాత్రమేనని, వ్యవసాయ రంగంలో తీవ్రమైన అసమానతలు ఉండేవని పేర్కొన్నారు. దేశ నిర్మాతల ముందు అభివృద్ధి, విద్య, ఆరోగ్యం, భూమి, ఉపాధికి సంబంధించిన ప్రశ్నలు ఉన్నప్పటికీ, కులం అనే అంశాన్ని వారు ప్రత్యేకంగా ప్రస్తావించనే లేదని, అది సమాజంలో అప్పటికే ఇమిడిపోయిన అంశంగా భావించారని ఆనంద్ తెల్తుంబ్డే తెలిపారు.
బాంబే ప్లాన్ అమలుకే ప్రాధాన్యతనిచ్చారు...
జాతీయాదాయంలో మొదటి వాటా విద్యకే కేటాయించాల్సి ఉన్నప్పటికీ, దానికి పూర్తి విరుద్ధంగా వ్యవహరించారని ఆనంద్ తెల్తుంబ్డే అన్నారు. 1944-45లో దేశంలోని ఎనిమిది మంది పారిశ్రామికవేత్తలు కలిసి రూపొందించిన ‘బాంబే ప్లాన్’ పారిశ్రామికీకరణపై దృష్టి పెట్టాలని సూచించిందని, నెహ్రూ దీన్ని అధికారికంగా ఆమోదించలేదని చెప్పినా, వాస్తవానికి పంచవర్ష ప్రణాళికల్లో అదే అమలైందని ఆయన పేర్కొన్నారు. ఐఐటిల వంటి సంస్థలు స్థాపించినా, ప్రాధాన్యతల విషయంలో పొరపాటు జరిగిందని, పాఠశాల విద్యా వ్యవస్థ మొదటి నుంచీ అసమానంగానే ఉండేదని ఆయన గుర్తుచేశారు.
పశువులను మేపిన తరువాతే తరగతి గదిలోకి అనుమతి..
దళిత విద్యార్థుల పరిస్థితి మరీ దయనీయంగా ఉండేదని, తానే స్వయంగా అనుభవించానని చెబుతూ, పశువులను మేపిన తరువాతే తరగతి గదిలోకి అనుమతించే పరిస్థితులు ఉండేవని వివరించారు. స్వాతంత్య్రం వచ్చిన 15-16 ఏళ్ల తర్వాత ఏర్పాటైన కొఠారీ కమిషన్ నెబర్‌హుడ్ స్కూల్, కామన్ స్కూల్ విధానాన్ని, జిడిపిలో 6 శాతం విద్యకు వెచ్చించాలని సిఫారసు చేసిందని తెల్తుంబ్డే గుర్తుచేశారు. తర్వాత వచ్చిన అనేక కమిషన్లు, విద్యా విధానాలు కూడా ఈ సిఫారసును సూత్రప్రాయంగా ఆమోదించాయని, కానీ ఇప్పటికీ వాస్తవ కేటాయింపులు జిడిపిలో 2.7-2.8 శాతానికే పరిమితమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. నేటి విద్యా విధానాలను బిర్లా, అంబానీ వంటి కార్పొరేట్ శక్తులే రూపొందిస్తున్నాయని, విద్యా రంగం బాహాటంగా కార్పొరేట్ చేతుల్లోకి వెళ్లిపోయిందని ఆయన విమర్శించారు. ఈ నేపథ్యంలోనే సిజెపి ఉద్యమం విద్యా సంక్షోభాన్ని ప్రజల ముందుకు తీసుకురావడం అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్న అంశమని పేర్కొన్నారు.
బిజెపి ప్రోత్సాహంతోనే రిజర్వేషన్ల వ్యతిరేక నిరసనలు
ప్రభుత్వ ఉద్యోగాలే లేని పరిస్థితుల్లో రిజర్వేషన్ తొలగించాలనే డిమాండ్‌కు అర్థమేమిటనే ప్రశ్నకు ఆనంద్ తెల్తుంబ్డే బదులిస్తూ, ఇది వాస్తవానికి బిజెపియే పరోక్షంగా ప్రోత్సహిస్తున్న ఉద్యమమని తెలిపారు. బిజెపి వద్ద ఇప్పుడు మరో ఎత్తుగడ లేదని, తన అనుభవాలను ఉదహరిస్తూ... బిహార్ పర్యటనలో తొలిసారి అగ్రవర్ణాల్లో మోడిపై అసంతృప్తి కనిపించిందని, సుప్రీంకోర్టు ఒత్తిడితో తీసుకొచ్చిన యూజిసి చట్టాన్ని ఉపసంహరించుకోవడం అందుకు కారణమని వివరించారు.
యువతను విభజించే వ్యూహం..
దేశ యువతను ఐక్యం కాకుండా చేసి, వారి మధ్య విద్వేషాలు రగిల్చి, సజాతీయ శక్తిగా కాకుండా విభిన్న స్వరాలున్న సమూహంగా చూపించి, విభజించే వ్యూహంలో భాగంగానే బిజెపి నేత జెపి నడ్డా ఆందోళనకారులను కలిసి పరోక్ష మద్దతు ప్రకటించారన్నారు. అయితే రిజర్వేషన్ల విషయాన్ని తాకబోమని పైకి చెబుతూనే, ఇడబ్ల్యూఎస్ కోటా వంటి చర్యల ద్వారా పరోక్షంగా దాన్ని బలపరిచే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. యువతను చీల్చడమే వారి అసలు లక్ష్యమని పేర్కొన్నారు. అలాగే, కులం, వర్గంపై దీర్ఘకాలంగా అధ్యయనం చేసిన తెల్తుంబ్డే, మార్క్స్ చెప్పిన వర్గ భావనను కేవలం ఆర్థిక కోణంలో మాత్రమే చూడటం సరికాదని, సమాజంలో దోపిడీకి అనేక కోణాలుంటాయని, ఒక ప్రధాన వైరుధ్యం ఇతర ఉప వైరుధ్యాలను తుడిచిపెట్టదని, పరిస్థితులను బట్టి ఉప వైరుధ్యాలే ప్రధాన వైరుధ్యాలుగా మారే అవకాశం ఉంటుందని వివరించారు. భారత్‌లో కులాన్ని వర్గంలో అంతర్భాగంగా చూడాలని, కుల వ్యతిరేక పోరాటం వర్గ పోరాటంలో అవిభాజ్య భాగమని ఆయన స్పష్టం చేశారు. ఈ ఇంటర్వ్యూని రాజేష్ హోస్ట్ చేశారు.








కామెంట్‌లు (0)