- శ్రమదోపిడీ లేని సముచిత పథకమని వ్యాఖ్య
న్యూఢిల్లీ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రద్దు చేసిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ)పై సుప్రీం కోర్టు శుక్రవారం ప్రశంసలు కురిపించింది. అదొక ‘ఉపయుక్తమైన పథకం’ అని వ్యాఖ్యానించింది. ఇదేదో ఉచితంగా పంచిపెట్టే తాయిలం కాదని, అదే సమయంలో గ్రామీణ కార్మికుల శ్రమదోపిడీ చేసేదీ కూడా కాదని పేర్కొంది. ‘‘ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ మంచి, సమర్ధవంతమైన పథకం. గ్రామీణ ప్రాంతాల్లో ఇది అద్భుతమైన ఫలితాలు కనబరిచింది. దేశవ్యాప్తంగా అమలైంది.ఇదేమీ ఉచిత తాయిలాల పథకం కాదు, లేదా కార్మిక శక్తిని దోపిడీ చేసేదీ కాదు.’’ అని త్రిసభ ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ మౌఖికంగా వ్యాఖ్యానించారు.
ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ బదులు ఆ స్థానంలో తీసుకువచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ (విబి గ్రామ్ జి ) వల్ల ఉపాధి ఉత్పత్తి 50 శాతం క్షీణించిందని పౌర హక్కుల గ్రూపులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కోర్టు పై వ్యాఖ్యలు చేసింది. ఏడాదికి 125 పని దినాలు కల్పిస్తామని విబి గ్రామ్ జి లో చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పని దినాల సంఖ్య బాగా క్షీణించిన సంగతి తెలిసిందే. డిమాండ్ ఆధారిత, హక్కుల ప్రాతిపదికగా వుండే ఎంజిఎన్‌ఆర్‌ఇజి విధానాన్ని పూర్తిగా మార్చివేసి కేంద్రం నియంత్రణలో వుండే నమూనాగా మార్చివేశారు. దీంతో పాటు కొత్తగా తీసుకొచ్చిన విబి గ్రామ్ జి వల్ల రాష్ట్రాలపై నిధుల భారం మూడు రెట్లు పెరిగింది. 90:10 నిష్పత్తి నుండి 60:40కి మారింది.
ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ కింద చెల్లించడంలో ఆలస్యమైన వేతనాలను, నష్టపరిహారంతో పాటూ తక్షణమే చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హక్కుల కార్యకర్త అరుణా రాయ్ దాఖలు చేసిన పిటిషన్‌ను బెంచ్ విచారించింది. పిటిషనర్ తరపున న్యాయవాదులు ప్రశాంత్ భూషణ్, చెరియల్ డిసౌజా, నేహా రాఠిలు వాదిస్తూ, సంబంధిత రాష్ట్రం నిర్దేశించిన పరిమితి కంటే తక్కువగా కనీస వేతనాలను ఒక చట్టం నిర్దేశించగలదా లేదా అని పరిశీలించాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరారు. గ్రామీణ ఉపాధికి సంబంధించిన చట్టపరమైన హామీకి రాజ్యాంగంలోని 21వ అధికరణ (జీవించే హక్కు) కింద ప్రాధమిక హక్కు హోదాను కల్పించాలని కూడా పిటిషన్ కోరింది.
‘‘పనిచేసే హక్కును రాజ్యాంగం ప్రాధమిక హక్కుగా చేయలేదు. పార్ట్ 4 (ప్రభుత్వ విధాన ఆదేశిక సూత్రాలు) కింద ప్రజాస్వామ్య కాంక్ష మాత్రమే...ఆ ఆకాంక్షను సాధించేందుకు ప్రభుత్వం ఒక విధానాన్ని రూపొందిస్తుంది, దాని ద్వారా పని కల్పించబడుతుంది, అది కూడా గ్రేడ్‌ల వారీగా, తగిన ప్రతిఫలం లభించే స్థాయిలో. దీన్ని మనం 21వ అధికరణతో సమానంగా పరిగణించాలా?’’ అని జస్టిస్ జోమాల్యా బాగ్చి, ప్రశాంత్ భూషణ్‌ను ప్రశ్నించారు. దానిపై భూషణ్ స్పందిస్తూ, గౌరవ ప్రదమైన జీవితాన్ని గడపడమనే హక్కు 21వ అధికరణలో భాగమేనని అన్నారు. ‘‘గౌరవంగా జీవించాలంటే కనీస వేతనంతో కూడిన ఉపాధి అవసరం. కనీస వేతనానికి తక్కువగా వుండే ఏదైనా కూడా కట్టుబానిసగా పనిచేయడం కిందకే వస్తుంది.’’ అని ఆయన వాదించారు.
కనీస వేతన పరిమితి ఉపాధి అవకాశాలను ముప్పులో పడేయగలదని జస్టిస్ బాగ్చి అన్నారు. సాధారణంగా ఈ వేతనాలు స్థానికంగా నెలకొన్న పరిస్థితులతో ముడిపడి వుంటాయని చీఫ్‌జస్టిస్ పేర్కొన్నారు. భూషణ్ లేవదీసిన అంశాలను ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ కింద కన్నా కొత్త చట్టం నేపథ్యంలో తాజాగా పరిశీలించాలని జస్టిస్ వి. మోహన పేర్కొన్నారు. ‘‘తాజా వివరాలను, తాజా గణాంకాలను పరిశీలించాల్సి వుంది.’’ అని ఆయన అన్నారు.
కొత్త చట్టం కింద దాదాపు సగం నిధులను రాష్ట్రాలు అందచేయాల్సిన అవసరం వుందని భూషణ్ పేర్కొన్నారు. ‘‘ఉద్యోగా సంఖ్య సగానికి సగం పడిపోయింది. రాష్ట్రాల వద్ద డబ్బు లేదు.’’ అని అన్నారు. ప్రస్తుతమున్న పిటిషన్‌ను పరిష్కరిస్తూ కొత్త పిటిషన్‌ను దాఖలు చేయాల్సిందిగా కోర్టు ఆయనను కోరింది.








కామెంట్‌లు (0)