బుధవారం, 11 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

స్వచ్ఛ భారత్‌ ప్రచారం.. 'అపరిశుభ్ర' వాస్తవం!

13 గంటల క్రితం

swach
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 11, 2026, 05:15 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

- మోడీ సర్కార్‌ గొప్పలకు భిన్నంగా పాఠశాలల దుస్థితి

- 61 వేలకుపైగా స్కూళ్లలో బాలికలకు సౌకర్యాల కొరత

స్వచ్ఛ భారత్‌ పేరుతో దేశవ్యాప్తంగా మరుగుదొడ్లు నిర్మించామని మోడీ ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటోంది. పాఠశాలల్లో దాదాపు అన్నిచోట్లా మరుగుదొడ్లు ఉన్నాయని గణాంకాలు కూడా చెప్తున్నాయి. కానీ మరుగుదొడ్ల పని తీరు మాత్రం భిన్నంగా ఉంది. క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను చూస్తే ఈ విషయం అర్థమవుతోంది. అసలు అవి పనిచేస్తున్నాయా? నీరు వస్తుందా? శుభ్రంగా ఉన్నాయా? బాలికలు సురక్షితంగా ఉపయోగించగలుగుతున్నారా? అనే ప్రశ్నలకు మాత్రం సమాధానాలు లేవనే చెప్పాలి. మోడీ ప్రభుత్వం నిర్మాణాలపై ప్రచారం చేసినంతగా వాటి నిర్వహణపై దృష్టి పెట్టలేదన్న విమర్శలకు తాజా గణాంకాలు బలం చేకూరుస్తున్నాయి.

న్యూఢిల్లీ : కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో మోడీ ప్రభుత్వం స్వచ్ఛ భారత్‌ మిషన్‌ను భారీ ప్రచారంతో ప్రారంభించింది. పాఠశాలల్లో బాలురు, బాలికలకు వేర్వేరు మరుగుదొడ్లు నిర్మించడం ‘స్వచ్ఛ విద్యాలయ’ కార్యక్రమంలో భాగమైంది. 12 ఏళ్ల తర్వాత చూస్తే వాటిని ఉపయోగించుకునే స్థితిలో ఉంచడంలో మాత్రం ప్రభుత్వ వ్యవస్థలు ఇంకా వెనుకబడే ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ – యునిసెఫ్‌ సంయుక్త పర్యవేక్షణ కార్యక్రమం ప్రకారం... 2015లో దేశంలోని పాఠశాలల్లో ప్రాథమిక తాగునీటి సదుపాయం 55 శాతం ఉండగా.. 2025 నాటికి 97 శాతానికి పెరిగింది. ప్రాథమిక పారిశుధ్య సదుపాయం 62 నుంచి 81 శాతానికి చేరింది. మరుగుదొడ్లు లేని పాఠశాలల శాతం 27 నుంచి 14కు తగ్గింది. ఇవి పురోగతిని సూచిస్తున్నప్పటికీ.. పాఠశాలల్లో నిర్మించిన సదుపాయాలు వాస్తవంగా ఎంతవరకు పనిచేస్తున్నాయన్నదే ఇప్పుడు అసలు ప్రశ్నగా మిగిలింది.

కోట్లాది మంది బాలికల సమస్య

కేంద్ర విద్యాశాఖకు చెందిన యూడైస్‌ ప్లస్‌ 2025–26 గణాంకాల ప్రకారం... దేశంలోని 14.56 లక్షల బాలికల, బాలబాలికలు కలిసి చదివే పాఠశాలల్లో 98.5 శాతంలో బాలికల మరుగుదొడ్లు ఉన్నాయి. 38,994 పాఠశాలల్లో బాలికల మరుగుదొడ్లు ఉన్నప్పటికీ అవి పనిచేయడం లేదు. మరో 22,366 పాఠశాలల్లో బాలికలకు మరుగుదొడ్లే లేవు. అంటే మొత్తంగా 61 వేలకు పైగా పాఠశాలల్లో బాలికలకు సరైన మరుగుదొడ్డి సదుపాయం లేదన్నమాట.

ఇబ్బంది పడుతున్న మహిళలు

మోడీ ప్రభుత్వం స్వచ్ఛ భారత్‌ ప్రచారంలో ‘ఎన్ని మరుగుదొడ్లు నిర్మించాం’ అనే లెక్కలను ముందుకు తెచ్చింది. కానీ ‘ఎన్ని పనిచేస్తున్నాయి’ అనే ప్రశ్నకు సమాధానం చెప్పడం లేదు. బాలికలకు మరుగుదొడ్డి అనేది కేవలం పరిశుభ్రతకు సంబంధించిన విషయం కాదు. అది వారి గౌరవం, భద్రత, ఆరోగ్యం, విద్యతో ముడిపడిన అంశం. రుతుక్రమ సమయంలో పాఠశాలలో నీరు, శుభ్రమైన మరుగుదొడ్డి లేకపోతే బాలికలు తరగతులకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది.

ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితి దారుణం

ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్‌, త్రిపుర, నాగాలాండ్‌లలో దాదాపు 20 శాతం నుంచి 28 శాతం మరుగుదొడ్లు సరిగ్గా లేవు. దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో కూడా మరుగుదొడ్ల సమస్య ఉంది. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. రాజస్తాన్‌లో 7,726, మధ్యప్రదేశ్‌లో 6,188 పాఠశాలల్లో బాలికల మరుగుదొడ్లకు మరమ్మతులు అవసరం.

ప్రభుత్వ గణాంకాల విశ్వసనీయత పైనా ప్రశ్నలు

ప్రభుత్వ గణాంకాల విశ్వసనీయతపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. యూడైస్‌ ప్లస్‌ ప్రకారం 97 శాతం పాఠశాలల్లో కనీసం ఒక పనిచేసే మరుగుదొడ్డి ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ – యునిసెఫ్‌ అంచనా ప్రకారం ప్రాథమిక పారిశుధ్య సదుపాయం 81 శాతమే. అంటే 16 శాతం పాయింట్ల తేడా ఉంది. చేతులు కడుక్కునే సదుపాయాల విషయంలో ఈ వ్యత్యాసం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. యూడైస్‌ ప్లస్‌ ప్రకారం 96.9 శాతం పాఠశాలల్లో చేతులు కడుక్కునే సదుపాయం ఉంది. కానీ నీరు, సబ్బు రెండూ అందుబాటులో ఉన్న పాఠశాలలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ – యునిసెఫ్‌ అంచనా ప్రకారం ప్రాథమిక పరిశుభ్రత సదుపాయం దాదాపు 53 శాతమే. పాఠశాలల్లో సదుపాయాలు ఉన్నాయా లేదా అనే విషయాన్ని ప్రధానోపాధ్యాయుల సమాధానాల ఆధారంగా యూడైస్‌ ప్లస్‌లో నమోదు చేస్తున్నారు. స్వతంత్రంగా క్షేత్రస్థాయి పరిశీలన లేకపోవడం వల్ల గణాంకాలు వాస్తవ పరిస్థితిని పూర్తిగా ప్రతిబింబిస్తున్నాయా అనే ప్రశ్న తలెత్తుతోంది.

ఇకనైనా మోడీ ప్రభుత్వం దృష్టి సారించాలి

మోడీ ప్రభుత్వం ఇకనైనా నిర్మాణాల ప్రచారం నుంచి నిర్వహణపై దృష్టి మళ్లించాలని సామాజిక కార్యకర్తలు సూచిస్తున్నారు. పాఠశాలలకు ఇచ్చే నిధుల్లో మరుగుదొడ్ల మరమ్మతులు, శుభ్రత, నీరు, సబ్బు కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని అంటున్నారు. తల్లిదండ్రులు, పాఠశాల నిర్వహణ కమిటీలను పర్యవేక్షణలో భాగస్వామ్యం చేయాలని చెప్తున్నారు. కొండ ప్రాంతాలకు ప్రత్యేక నమూనాలు రూపొందించాలనీ, రుతుక్రమ నిర్వహణకు అవసరమైన సదుపాయాలను ప్రతి పాఠశాలలో అందుబాటులోకి తేవాలని సూచిస్తున్నారు. '' దేశంలో స్వచ్ఛ భారత్‌ పేరుతో మరుగుదొడ్ల నిర్మాణాన్ని రాజకీయ ప్రచారానికి ఉపయోగించడం సులభం. కానీ వాటిని ప్రతి రోజు పనిచేసేలా ఉంచడం ప్రభుత్వానికి అసలైన పరీక్ష. మరుగుదొడ్డి నిర్మించామని చెప్పడం కాదు.. అది బాలికకు నిజంగా ఉపయోగపడుతోందా లేదా అన్నదే ప్రభుత్వ పనితీరుకు కొలమానం'' అని సామాజిక కార్యకర్తలు చెప్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్