- ఢిల్లీలో కాలుష్యంపై కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు
న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో కాలుష్యం కోరలు చాచడంపై కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై వ్యంగ్యాస్ర్తాలు సంధించింది. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గతంలో మోడీ ఇచ్చిన ‘అబ్ కీ బార్ 400-పార్’ (ఈ సారి 400 స్థానాలు దాటుతాం) అనే నినాదాన్ని ఉటంకిస్తూ విమర్శలు గుప్పించింది. ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక (ఎక్యూఐ) స్థాయిలు 400 దాటడాన్ని ప్రస్తావిస్తూ, ఆ నినాదం ఇప్పుడు నిజమైందని ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఎద్దేవా చేశారు. ‘అబ్ కీ బార్ ఎక్యూఐ 400-పార్ (ఈసారి ఎక్యూఐ 400 దాటింది). తరచుగా ఉపన్యాసాలు ఇచ్చే ప్రధాన మంత్రిని 'ప్రవచనమంత్రి' అని పిలవవచ్చు. ఆయన ఇచ్చిన నినాదం ఇప్పుడు ఎక్యూఐ విషయంలో నిజమైంది! 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎన్డిఎ కూటమికి లోక్సభలో 400కు పైగా స్థానాలు వచ్చేలా ఓటు వేయాలని కోరుతూ మోడీ గాలిలోకి నినాదాలు విసిరారు, ఇప్పుడు అదే గాలి విషపూరితంగా మారింది. ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్యంతో కూడిన నగరంగా మారింది. గాలి ఎంత విషపూరితంగా మారిందంటే, శ్వాస తీసుకోవడమే కష్టతరమైంది. దీనివల్ల పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్వాసకోశ ఇబ్బందులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఫలితంగా ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య కూడా అధికమవుతోంది’ అని జైరాం రమేశ్ తెలిపారు.








కామెంట్లు (0)