- తిరువనంతపురం ర్యాలీలో ప్రకాష్ రాజ్
తిరువనంతపురం : రానున్న రోజుల్లో దేశంమంతా జంతర్ మంతర్గా మారబోతోందని విలక్షణ నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాశ్ రాజ్ అన్నారు. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సిఇసి) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని, ఎన్నికల వ్యవస్థను ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తూ తిరువనంతపురంలోని మానవీయ వీధిలో ‘స్టూడెంట్స్ కలెక్టివ్’ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. తొలుత ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా..విద్యార్థులు తీవ్రస్థాయిలో ప్రతిఘటించడంతో అక్కడి నుంచి ఖాకీలు వెళ్లిపోయారు. అనంతరం జరిగిన సభలో ప్రకాష్ రాజ్ ప్రసంగించారు. సిఇసి జ్ఞానేష్ కుమార్ ఎంపిక ప్రక్రియ, ఆ నిర్ణయం వెనుక ఉన్న దుర్మార్గపు విధానాన్ని సమాజం అర్థం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిందని తెలిపారు. దేశంలో పెరుగుతున్న అసంతృప్తిపై ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ.. ఇవాళ దేశంలో విద్యార్థులు ఉద్యమించడం మొదలుపెట్టారని తెలిపారు. వారి నిరసనలకు రైతులు, పౌర సమాజం గొంతు కలిపిందని పేర్కొన్నారు. ఈ పరిస్థితి చూస్తుంటే.. దేశంలోని ప్రతీ ప్రాంతం, ప్రతీ నగరం ఓ ‘జంతర్ మంతర్’లా మారిపోతోందని తెలిపారు.
‘హర్ ఘర్గా తిరంగా’ పిలుపునిచ్చినవారే..
ప్రతి ఇంటా మువ్వన్నెల జెండా ఎగురవేయాలని ‘హర్ ఘర్గా తిరంగా’ అంటూ గతంలో పిలుపునిచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పుడు ఢిల్లీ వీధుల్లో యువత చేతుల్లో జాతీయ పతాకం చూసి భయపడుతున్నారని ప్రకాష్రాజ్ అన్నారు. ‘ఈ దేశ విద్యార్థులను, యువతను చూసి..మోడీ భయపడుతున్నారు. ఆయన అహంకారాన్ని దేశ యువత దించుతోంది. ప్రజాస్వామ్య సమస్యలకు భయపడి పోలీసులు, పారామిలటరీ బలగాలను మోహరించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రయత్నిస్తోంది. అక్రమ నిర్బంధాలతో బెదిరింపులకు దిగుతోంది. కానీ ఈ దేశ యువత ఇసుమంతైనా జంకకుండా పోరాడుతోంది’ అని ఆయన అన్నారు. చిన్నతనంలో మొసళ్లను పట్టుకునేవాడినంటూ మోడీ గొప్పలు చెప్పుకున్నారని, ఇప్పుడు ‘బొద్దింకల’ను భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. సిజెపి, విద్యార్థి యువజన సంఘాల నేతలు దీప్కే, సౌరవ్, అశుతోష్, నేహా బోరాలను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని ప్రకాష్ రాజ్ తీవ్రంగా ఖండించారు.
మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా భయపడినప్పుడల్లా పెద్ద సంఖ్యలో పోలీసులను, వారితో పాటు సంఘ్ పరివార్ గూండాలను నిరసన స్థలాలకు పంపి దాడులు చేయిస్తున్నారని, ఇలాంటి దాడులకు తాము అదరం బెదరం అని ఆయన స్పష్టం చేశారు. మోడీ సర్కార్కు ధైర్యముంటే సిఇసి జ్ఞానేష్ కుమార్ను ప్రజాక్షేత్రంలోకి తీసుకొచ్చి తాము అడిగే ప్రశ్నలకు బదలిప్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.







కామెంట్లు (0)