- జనాభాలో 5 శాతంగా ఉన్నవారికి 40 శాతం ప్రాతినిధ్యం
- అణగారిన తరగతులకు, మైనార్టీలకు, మహిళలకు దక్కని ప్రాధాన్యత
- సామాజిక వైవిద్యం, ప్రతిభ, సమగ్రత కొరవడిన నియామకాలు
- రాష్ట్రపతికి మాజీ సిజెఐ జస్టిస్ గవాయ్ లేఖ : జోక్యం చేసుకోవాలని వినతి
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశ న్యాయవ్యవస్థల్లో న్యాయమూర్తుల నియామకాల్లోనూ, బదిలీల్లోనూ సామాజిక వైవిద్యం, ప్రతిభ, సమగ్ర కొరవడినట్లు భారత మాజీ ప్రధానమంత్రి జస్టిస్ బిఆర్ గవాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయ నియామకాలు, బదిలీల్లో ఒకే సామాజిక తరగతికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. అదే సమయంలో అణగారిన తరగతులకు, మైనార్టీలకు, మహిళలకు ప్రాధాన్యత తగ్గుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకోవాల్సిందిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆయన శుక్రవారం నాడు ఒక లేఖ రాశారు. ఈ లేఖ ప్రతులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్‌కు కూడా పంపారు. దేశ జనాభాలో ఐదు శాతం కంటే తక్కువగా ఉన్న ఒక సామాజిక తరగతికి ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో 40 శాతానికి పైగా ప్రాతినిధ్యం లభించిందని గవాయ్ పేర్కొన్నారు. మరోవైపు ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి, మైనార్టీ వర్గాలు, మహిళలకు ఉన్నత న్యాయవ్యవస్థలో తగిన ప్రాతినిధ్యం లభించడం లేదని తెలిపారు.
2018 నుంచి హైకోర్టులకు నియమితులైన 715 మంది న్యాయమూర్తుల్లో ఎస్‌సిల నుంచి 22 మంది, ఎస్‌టిల నుంచి 16 మంది, ఒబిసిల నుంచి 89 మంది, మైనార్టీల నుంచి 37 మంది మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. ఈ గణాంకాలను 2025 మార్చిలో రాజ్యసభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి వెల్లడించిన సమాచారాన్ని ఆధారంగా ప్రస్తావించారు. నియామకాల్లో దాదాపు మూడొంతుల మంది జనరల్ కేటగిరీకి చెందినవారేనని పేర్కొన్నారు. 2021 జనవరి నుంచి 2026 జనవరి వరకు జరిగిన నియామకాల్లో పెత్తందారి సామాజిక తరగతుల ప్రాతినిధ్యం దాదాపు 80 శాతానికి చేరగా, దేశ జనాభాలో 40 నుంచి 50 శాతం వరకు ఉన్న ఒబిసిల ప్రాతినిధ్యం 14 శాతం కంటే తక్కువగా ఉందని తెలిపారు. తాను కొలీజియంలో సభ్యునిగా, అనంతరం దాని అధ్యక్షునిగా పనిచేసిన సమయంలో అన్ని సామాజిక తరగతులకు సముచిత ప్రాతినిధ్యం కల్పించేందుకు కృషి చేసినట్లు గవాయ్ పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఒకే సామాజిక తరగతిని సంతృప్తిపరిచి, ప్రోత్సహించే విధంగా నియామకాలు జరుగుతున్నాయనే అభిప్రాయానికి బలమైన కారణాలు కనిపిస్తున్నాయని లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు.
న్యాయమూర్తుల బదిలీలు, పదోన్నతుల్లోనూ ప్రతిభకు బదులుగా ఇతర అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. కొన్ని సందర్భాల్లో చిన్న హైకోర్టులకు బదిలీ అయిన న్యాయమూర్తులకు అనంతరం ప్రముఖ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులుగా పదోన్నతులు కల్పిస్తున్నారని, ప్రతిభావంతులైన ఇతర న్యాయమూర్తులకు అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 124(2) ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామక అధికారం రాష్ట్రపతికి ఉందని గవాయ్ గుర్తుచేశారు. కొలీజియం వ్యవస్థ ఉన్నంత మాత్రాన దాని సిఫార్సులు జవాబుదారీతనానికి అతీతం కావని స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థతో పాటు కార్యనిర్వాహక వ్యవస్థ, పార్లమెంటుకు కూడా న్యాయమూర్తుల నియామకాల్లో సామాజిక వైవిధ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా అన్ని సామాజాకి తరగతులకు సమాన ప్రాతినిధ్యం కల్పించేలా సంబంధిత వ్యవస్థలకు రాష్ట్రపతి తగిన సూచనలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.







కామెంట్‌లు (0)