- ఫిక్కీలో మోడీ వ్యాఖ్యలపై సిఐటియు
- కార్పొరేట్ అనుకూల విధానాలను సమూలంగా మార్చాలని డిమాండ్
న్యూఢిల్లీ : కార్పొరేట్ అనుకూల ఆర్థిక విధానాలను సమూలంగా మార్చాల్సిన సమయం ఆసన్నమైందని సిఐటియు పేర్కొంది. ఇటీవల జరిగిన ఫిక్కీ సమావేశంలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు సిఐటియు వైఖరిని సమర్ధించేలా వున్నాయని తెలిపింది. వరుసగా పన్ను మినహాయింపులు, రాయితీలు ఇచ్చినా, పెట్టుబడులను పెంచడంలో, ఉపాధిని కల్పించడంలో, కార్మికుల వేతనాలను పెంచడంలో కార్పొరేట్ సంస్థలు విఫలమవడాన్ని ప్రధాని ప్రశ్నించడం చూస్తుంటే తన ప్రభుత్వ ఆర్థిక విధానాల వైఫల్యాన్ని ప్రధాని అంగీకరించినట్లే అయిందని సిఐటియు పేర్కొంది. ఫిక్కీ సమావేశంలో ప్రధాని అంగీకరించిన విషయాల ఆధారంగా స్పష్టమైన, నిర్దిష్టమైన విధాన మార్పులు చేపట్టాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు సిఐటియు ప్రధాన కార్యదర్శి ఎలమరం కరీమ్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కార్పొరేట్ పన్ను మినహాయింపులు, రాయితీలు వాటంతట అవే ఉత్పాదక పెట్టుబడిగా, ఉపాధి కల్పనగా మారవని లేదా కార్మికుల జీవన ప్రమాణాల్లో మెరుగుదల రాదని సిఐటియు చెబుతూనే వస్తోందని అన్నారు. ప్రభుత్వం యొక్క సరఫరా ఆధారిత, కార్పొరేట్ అనుకూల ఆర్థిక వ్యూహాన్ని సిఐటియు ఎల్లప్పడూ వ్యతిరేకిస్తూనే వచ్చింది. ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు పన్ను రాయితీలు, సబ్సిడీలు, ప్రోత్సాహకాలపై ఈ ఆర్థిక వ్యూహం ఆధారపడిందని, అదే సమయంలో ప్రజల కొనుగోలు శక్తిని నిర్లక్ష్యం చేస్తూ వచ్చిందని సిఐటియు పేర్కొంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో శుక్రవారం జరిగిన బడ్జెట్ ముందస్తు సంప్రదింపుల సమావేశంలో సిఐటియు ఈ వైఖరిని స్పష్టంగా పునరుద్ఘాటించింది. ఈ విధాన దిశా నిర్దేశాన్ని సమూలంగా మార్చాలని సిఐటియు డిమాండ్ చేసింది. కార్పొరేట్ పెట్టుబడులకు వరుసగా రాయితీలు ఇచ్చే వైఖరిని రాబోయే కేంద్ర బడ్జెట్‌లో విడనాడాలని దానికి బదులుగా ప్రగతిశీల పన్ను విధింపు ద్వారా వనరులను సమీకరించాలని సూచించింది. అత్యంత సంపన్నులపై సమర్ధవంతమైన రీతిలో సంపద పన్ను వేయాలని, పెద్ద మొత్తంలో సంపద బదిలీలపై వారసత్వపు/ఎస్టేట్ పన్ను వసూలు చేయాలని, అసాధారణరీతిలో కార్పొరేట్ లాభాలపై, పెద్ద మొత్తంలో సంపద పోగుపడడంపై అధికంగా పన్నులు వేయడం కీలకమని సిఐటియు పేర్కొంది. ప్రభుత్వ విధానాల వల్ల ఎవరైతే అపారంగా లబ్ది పొందుతారో వారు అదే రీతిలో జాతి అభివృద్ధి కోసం దోహదపడాలని స్పష్టం చేసింది. సాధారణ ప్రజలపై పరోక్ష పన్నుల భారానికి స్వస్తి చెప్పాలని డిమాండ్ చేసింది. నెలకు రూ.42వేలు కనీస వేతనాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయడం ద్వారా కార్మికుల కొనుగోలు శక్తిని పెంచేందుకు బడ్జెట్‌లో ప్రాధాన్యతనివ్వాలని సిఐటియు డిమాండ్ చేసింది. కార్మిక చట్టాల స్థానంలో తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, గ్రామీణ కుటుంబాలకు 200 రోజుల పనిదినాల హామీతో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని, పట్టణ ఉపాధి హామీని కూడా ప్రవేశపెట్టాలని కోరింది. కార్మికులందరికీ సార్వజనీన సామాజిక భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేసింది. అర్హత కలిగిన కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికులన క్రమబద్ధీకరించాలని కోరింది.







కామెంట్‌లు (0)