శనివారం, 21 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Protest: కేరళంలో కదంతొక్కిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు

4 గంటల క్రితం

కేరళంలో కదంతొక్కిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు
రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడించిన వేలాదిమంది
సామూహిక బదిలీలపై ఆగ్రహం
ఉద్యోగులను శత్రువులుగా చూస్తున్న యుడిఎఫ్‌ : పినరయి విజయన్‌ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026, 09:30 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడించిన వేలాదిమంది

  • సామూహిక బదిలీలపై ఆగ్రహం

  • ఉద్యోగులను శత్రువులుగా చూస్తున్న యుడిఎఫ్‌ : పినరయి విజయన్‌

తిరువనంతపురం: 12వ వేతన సవరణ చేపట్టాలని, పాత పింఛను పథకం(ఒపిఎస్‌)ను పునరుద్ధరించాలని, సామూహిక బదిలీలను నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ కేరళం రాష్ట్ర సచివాలయాన్ని ఉద్యోగులు, ఉపాధ్యాయులు ముట్టడించారు. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యునైటెడ్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ (యుడిఎఫ్‌) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలను నిరసిస్తూ వేలాదిమంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు శనివారం ఆందోళన నిర్వహించారు. రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయుల కార్యాచరణ మండలి ఆధ్వర్యాన నిర్వహించిన ఈ నిరసనను మాజీ ముఖ్యమంత్రి, సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు పినరయి విజయన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయుల భారీ నిరసన యుడిఎఫ్‌ ప్రభుత్వానికి ఓ హెచ్చరిక అని అన్నారు. వారిని రాష్ట్ర ప్రభుత్వం శత్రువులుగా చూస్తోందని అన్నారు. వేతన సంస్కరణల కమిషన్ పదవీకాలాన్ని పొడిగించడంపై ప్రభుత్వం నెలల తరబడి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. గత ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం వేతన సవరణకు సంబంధించిన ప్రాథమిక చర్యలను ప్రారంభించిందని ఎన్నికల నోటిఫికేషన్‌ నేపథ్యంలో అమలు చేయలేకపోయిందని చెప్పారు. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెకె జయచంద్రన్‌ మాట్లాడుతూ గత ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం కోవిడ్‌ సమయంలో కూడా వేతన సవరణను క్రమపద్ధతిలో చేపట్టిందని గుర్తు చేశారు. ఎల్‌డిఎఫ్ పాలనలో ఆదర్శంగా నిలిచిన కేరళ ప్రభుత్వ విద్యా వ్యవస్థను యుడిఎఫ్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు.

సామూహిక బదిలీలతో ఆత్మహత్యలు : యాక్ష‍న్‌ కౌన్సిల్‌ ఆందోళన

ఈ సందర్భంగా యాక్ష‍న్‌ కౌన్సిల్‌ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల బదిలీకి పాటించాల్సిన నిబంధనలేవీ పాటించకుండా గత ఆరు నెలల్లో దాదాపు 25,000 మంది ఉద్యోగుల సామూహిక బదిలీలు చేశారని తెలిపారు. దీంతో, ఆందోళనకు గురైన కన్నూర్‌లోని చోక్లిలో ఉన్న కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో హెల్త్ ఇన్‌స్పెక్టర్‌ దీపాలేఖ, కాసరగోడ్ కలెక్టరేట్‌లో సీనియర్ క్లర్క్‌ ఆశాలత, కోజికోడ్‌లో సివిల్ పోలీస్ అధికారి సుబిన్ ఆత్మహత్య చేసుకున్నారని విమర్శించారు. ఆర్జిత సెలవుల సరెండర్‌ను యుడిఎఫ్‌ రద్దు చేసిందని, కరువు భత్యాన్ని (డిఎ) ఎనిమిది వాయిదాలలో చెల్లిస్తామన్న హామీని ఇప్పటివరకూ అమలు చేయలేదని చెప్పారు. జాతీయ పింఛను వ్యవస్థ (ఎన్‌పిఎస్‌)ను ఉపసంహరించుకోవాలని, పాత పింఛను పథకాన్ని పునరుద్ధరించాలని, పిఎఫ్‌ఆర్‌డిఎ చట్టాన్ని రద్దు చేయాలని కార్యాచరణ మండలి డిమాండ్‌ చేసింది.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్