ఆదివారం, 09 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

నేడు జైల్‌ భరో, రాస్తారోకో, రైల్‌రోకో

1 గంట క్రితం

jail
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 10, 2026, 12:00 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

- ఎస్‌కెఎం, కేంద్ర కార్మిక సంఘాల పిలుపు

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ, కార్మిక విధానాలను నిరసిస్తూ సోమవారం జైల్‌ ‌భరో, రాస్తా రోకో, రైల్‌ ‌రోకో కార్యక్రమాలు సహా పెద్ద ఎత్తున నిరసన కార్యాచరణ దేశవ్యాప్తంగా చేపట్టాలని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం), కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. జులై 28న జరిగిన అఖిల భారత సదస్సులో సంయుక్త కిసాన్‌ ‌మోర్చా (ఎస్‌‌కెఎం) జాతీయ స్థాయి ఆందోళనకు పిలుపిచ్చింది. ఆ తర్వాత 29వ తేదీన ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి రైతులు, కార్మికుల సదస్సు, కేంద్ర కార్మిక సంఘాలు ఆ పిలుపును ధృవీకరించాయి.

2020-21లో జరిగిన రైతు ఉద్యమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ‘వ్యవసాయాన్ని, పరిశ్రమలను కాపాడండి, భారత్‌‌ను రక్షించండి’ అనే శీర్షికతో నవంబరు 26న ప్రారంభించనున్న సుదీర్ఘమైన, నిరంతరమైన ఆందోళనలకు రాబోయే కార్యాచరణ ఒక నాందిగా కొనసాగాలని ఎఐకెఎస్‌ ‌నాయకత్వం నిర్ణయించింది.

కార్పొరేట్ల ఆక్రమణకు, న్యాయమైన వేతనాలను తిరస్కరించడానికి వ్యతిరేకంగా కార్మికులు, రైతుల ఐక్యతను చాటడమే 10వ తేదీ నాటి కార్యాచరణ లక్ష్యమని రైతు సంఘం ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. అన్ని పంటలను రాష్ర్ట ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసేందుకు హామీ కల్పించడంతో పాటూ, సిటు ప్లస్‌ 50 ‌శాతం ఫార్ములాతో లెక్కించిన మేరకు పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌‌పి)ను ఇచ్చేందుకు చట్టబద్ధమైన హామీ కల్పించాలన్న డిమాండ్‌‌ సహా పలు కీలక డిమాండ్లను ఎఐకెఎస్‌ ‌ప్రముఖంగా ప్రస్తావించింది.

దీనికి తోడు, నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనాన్ని పెంచాలని, కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అలాగే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను పూర్తిగా తిరస్కరించాలని, ప్రతిపాదిత విత్తన బిల్లు, 2025ను ఉపసంహరించుకోవాలని, విద్యుత్‌ ‌ప్రైవేటీకరణ, ప్రీ పెయిడ్‌ ‌స్మార్ట్‌ ‌మీటర్ల ఏర్పాటును నిలిపివేయాలని డిమాండ్‌ ‌చేశాయి.

ప్రధాన డిమాండ్లు ఇవే

• నాలుగు లేబర్‌ కోడ్లను తక్ష‍ణమే రద్దు చేయాలి.

• కార్మికులందరికీ నెలకు రూ.31 వేలు చొప్పున కనీస వేతనం చెల్లించాలి

• మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ)ని పునరుద్ధరించి, 200 రోజుల పని దినాలు, రోజుకు రూ.700 దినసరి వేతనం అమల్జేయాలి.

• సార్వత్రిక సామాజిక భద్రత ఫించను నెలకు రూ.10 వేలు చొప్పున అందజేయాలి.

• ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌ ప్రతిపాదించిన సి2 ప్లస్‌ 50 శాతం ఫార్ములాతో అన్ని పంటలకు కనీస మద్దతు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి.

• దేశ వ్యవసాయ రంగాన్ని ప్రమాదంలోకి నెట్టేసేలా అమెరికాతో చేసుకున్న అన్ని స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను ఉపసంహరించుకోవాలి.

• వ్యవసాయ, ఆహార శుద్ధి, ఆహార ఎగుమతులు, అలాగే వ్యూహాత్మక ఎంఎస్‌ఎంఇ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష‍ పెట్టుబడులు (ఎఫ్‌డిఐ)లను అనుమతించరాదు.

• భారత ఆహార సంస్థ (ఎఫ్‌సిఎ)ని రక్ష‍ించి మరింత బలోపేతం చేయాలి.

• ఎఫ్‌సిఐ గోదాముల స్థానంలో అదానీ - లీప్‌ ఇండియా గుత్తాధిపత్యానికి తెర దించాలి.

• విద్యుత్‌ ప్రయివేటీకరణ బిల్లు 2025, విత్తన బిల్లు 2025, ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలి.

• సహకార సంస్థల్లో కార్పొరేట్‌ సంస్థల ఆక్రమణలను ఆపేయాలి. అన్నదాతల నేతృత్వంలో ప్రజాస్వామిక సహకార సంస్థలను బలోపేతం చేయాలి.

• సమగ్రమైన రుణ మాఫీ పథకాన్ని ప్రకటించి అప్పుల ఊబిలో నుంచి గ్రామీణ ప్రజలను గట్టెక్కించాలి.

• ఆత్మహత్యకు పాల్పడిన రైతుల కుటుంబాలకు రూ.25 లక్ష‍ల చొప్పున పరిహారం అందజేయాలి.

• బలవంతపు భూసేకరణను, కార్పొరేట్‌ భూసమీకరణను ఎటువంటి పరిస్థిత్లోనూ చేపట్టకూడదు.

• భూ సేకరణ చట్టం 2013, అటవీ హక్కుల చట్టం 2006, పీసా 1996 చట్టాల ప్రకారం భూ హక్కులను పరిరక్ష‍ించాలి.

• ఎరువులు, ఇంధనం, వంటగ్యాసు, పెట్రోలు, డీజిల్‌ ధరలను నియంత్రించాలి. సబ్సిడీలను పునరుద్ధరించాలి.

• రైతులందరికీ ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా పంటల బీమా, పశువుల బీమా కల్పించాలి.

• వాటర్‌షెడ్లను అభివృద్ధి చేసి ప్రతి పొలానికి నీటి సౌకర్యం కల్పించాలి.

• వరదలు, కరువు వంటి ప్రకృతి విపత్తుల సమయంలో పారదర్శకమైన సహాయాన్ని అందజేయాలి. ఇందుకోసం తగిన నిధులు కేటాయించాలి.

• విద్య కోసం స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో 6 శాతం నిధులు కేటాయించాలి.

• కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో 6 శాతం, అలాగే జిడిపిలో 3 శాతం నిధులను పరిశోధన, అభివృద్ది రంగానికి కేటాయించాలి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్