- ఎన్నికల సంఘం రాజీ పడిపోయింది
- సుప్రీంకోర్టులో సొలిసిటర్ జనరల్ వ్యాఖ్యలు అభ్యంతరం
- సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ
న్యూఢిల్లీ : ఎన్నికల ప్రధాన కమిషనర్ (సిఇసి) జ్ఞానేష్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ డిమాండ్ చేశారు. బుధవారం ఢిల్లీలోని ఎకెజి భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జ్ఞానేష్ కుమార్ ఆ పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు. కీలకమైన రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న సిఒసిగా కొనసాగడానికి తనకున్న అర్హతను ఆయనే నిరూపించుకోవాలని పేర్కొన్నారు.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనంపై ప్రశంసలు
రీతికా చోప్రా నేతృత్వంలోని జర్నలిస్టుల బృందం వెలువరించిన సంచలన కథనాలను ఆ నేత ప్రస్తావిస్తూ, పత్రికా స్వేచ్ఛకు, పరిశోధనాత్మక జర్నలిజానికి, జవాబుదారీతనాన్ని కోరుకునే భారత పౌర సమాజ చైతన్యానికి ఇది ఆశాజనకమైన రోజు అని అభివర్ణించారు. ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియకు సంబంధించి ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెలువరించిన వెల్లడింపులు కేవలం ప్రక్రియపైనే కాకుండా, ఎన్నికల సంఘం విశ్వసనీయతపైనే తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని పేర్కొన్నారు. సిపిఎంతో సహా ప్రతిపక్ష పార్టీలు, పౌర సమాజ ప్రముఖులు, మాజీ ఎన్నికల కమిషనర్లు ఇన్నాళ్లూ వ్యక్తం చేస్తూ వచ్చిన సందేహాలకు ఈ కథనాలు మరింత బలం చేకూర్చాయని తెలిపారు.
మెజారిటీ అభిప్రాయాన్ని సిఇసి పట్టించుకోలేదు..
ముగ్గురు ఎన్నికల కమిషనర్లలో ఇద్దరు, ఎన్నికల జాబితా సవరణ, ఎస్‌ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన నిర్ణయాలపై 14 సందర్భాల్లో అధికారికంగా అభ్యంతరాలు నమోదు చేసినట్టు వెల్లడైందని బేబీ తెలిపారు. చట్టం ప్రకారం ముగ్గురు ఎన్నికల కమిషనర్లు సమాన హోదా కలిగినవారని, ఏవైనా భేదాభిప్రాయాలను మెజారిటీ లేదా ఏకాభిప్రాయంతో పరిష్కరించుకోవాలని ఆయన గుర్తుచేశారు. అయితే మెజారిటీ అభిప్రాయాన్ని సిఇసి జ్ఞానేష్ కుమార్ బేఖాతరు చేశారని విమర్శించారు. మొత్తం ప్రక్రియ పారదర్శకంగా, వికేంద్రీకృతంగా ఉందని సిఒసి చేస్తూ వచ్చిన వాదన అబద్ధమని ఇప్పుడు స్పష్టమవుతోందని ఆయన పేర్కొన్నారు.
ఎన్నికల సంఘం విశ్వసనీయతకే ప్రమాదం
ఇద్దరు ఎన్నికల కమిషనర్లు లేవనెత్తిన అంశాలు కేవలం ఎస్‌ఐఆర్ ప్రక్రియకే పరిమితం కాదని, ఎన్నికల సంఘం సంస్థాగత సమగ్రత, ప్రజాస్వామ్య పనితీరు, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, అతి కేంద్రీకరణ, సార్వత్రిక వయోజన ఓటు హక్కు పరిరక్షణ వంటి కీలక అంశాలతో ముడిపడి ఉన్నాయన్నారు. రాజీపడిన ఎన్నికల సంఘంపై ప్రజలు నమ్మకం కోల్పోయారని, దీనికి సిఇసి జ్ఞానేష్ కుమారే బాధ్యత వహించాలని, ఆయన ఇకపై పదవిలో కొనసాగడానికి వీల్లేదని స్పష్టం చేశారు.
సొలిసిటర్ జనరల్ వ్యాఖ్యలపై అభ్యంతరం
ఇదే సందర్భంగా, మంగళవారం సుప్రీంకోర్టులో జరిగిన మరో విచారణను కూడా బేబీ ప్రస్తావించారు. ప్రముఖ సంగీత విద్వాంసుడు, ప్రజా మేధావి టిఎం కృష్ణకు సంబంధించిన ఒక కేసు విచారణలో, పిటిషనర్ తరపు న్యాయవాది డాక్టర్ మురళి వాదనలు వినిపిస్తుండగా, సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు. టిఎం కృష్ణను ఉద్దేశించి ‘‘నక్సల్ మైండ్’’ అన్న అర్థం వచ్చేలా సొలిసిటర్ జనరల్ వ్యాఖ్యానించారని, న్యాయ ప్రక్రియ అటువంటి భావజాలం ఉన్నవారికి అందుబాటులో ఉండకూడదన్న ధోరణిలో ఆయన మాట్లాడారని పేర్కొన్నారు. దీనిపై డాక్టర్ మురళి తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసి, ఆ వ్యాఖ్యను ఉపసంహరించుకోవాలని కోరినా, సొలిసిటర్ జనరల్ అదే వ్యాఖ్యను పునరుద్ఘాటించడం సరికాదన్నారు. అయితే, సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా ఆ వ్యాఖ్యను తోసిపుచ్చకుండా, ఇతర రాజ్యాంగపరమైన అంశాలవైపు చర్చను మళ్లించిందని, ఇది కూడా తీవ్ర ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు. టిఎం కృష్ణకు, డాక్టర్ మురళి తీసుకున్న వైఖరికి తమ సంఘీభావం ప్రకటిస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు.








కామెంట్‌లు (0)