ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మసీదుల్లో ఏకరీతి ప్రసంగాలు !

1 రోజు క్రితం

మసీదుల్లో ఏకరీతి ప్రసంగాలు !
- కాశ్మీర్‌ వక్ఫ్‌ బోర్డు వివాదస్పద ప్రతిపాదన
- తీవ్రంగా వ్యతిరేకించిన ముస్లిం మత పెద్దలు
- మత స్వేచ్ఛకు విఘాతమంటూ ఆగ్రహం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 16, 2026, 10:49 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- కాశ్మీర్‌ వక్ఫ్‌ బోర్డు వివాదస్పద ప్రతిపాదన

- తీవ్రంగా వ్యతిరేకించిన ముస్లిం మత పెద్దలు

- మత స్వేచ్ఛకు విఘాతమంటూ ఆగ్రహం

శ్రీనగర్‌ : శుక్రవారం నాటి ప్రార్ధనల అనంతరం మసీదుల్లో చేసే ప్రసంగాలు (సెర్మాన్‌) కాశ్మీర్‌ ‌వ్యాప్తంగా ఒకే రీతిన వుండాలంటూ కాశ్మీర్‌ ‌వక్ఫ్‌ ‌బోర్డు చేసిన ప్రతిపాదన మత స్వేచ్ఛ వివాదాన్ని రగిలించింది. శుక్రవారం రోజు జరిగే ఈ ప్రసంగాలు అన్ని మసీదుల వ్యాప్తంగా ఒకే రీతిగా వుండేలా చర్యలు తీసుకోవాలంటూ జమ్మూ కాశ్మీర్‌ ‌వక్ఫ్‌ ‌బోర్డు ప్రతిపాదించింది. దీనిపై ముస్లిం మత పెద్దలు, రాజకీయ నేతల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. మతపరమైన వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందని, వీటిపై నియంత్రణ కోసం ప్రయత్నిస్తోందని వారు విమర్శించారు.

ఇస్లామిక్‌ ‌చట్టాలు నిర్దేశించిన విధంగా ముస్లిం మత పరమైన దానాలను పర్యవేక్షించడం వక్ప్‌ ‌బోర్డుల ప్రధాన లక్ష్యం. కానీ గత వారాంతంలో జమ్మూ కాశ్మీర్‌ వక్ప్‌ ‌బోర్డు చైర్‌‌పర్సన్‌గా ఉన్న బిజెపి స్థానిక నేత దరక్షన్‌ ఆండ్రాబి ‌వివాదాస్పదమైన ఈ ప్రతిపాదనను ప్రకటించారు. ఇదే అంశంపై మీడియాతో మాట్లాడుతూ తన ప్రతిపాదనను సమర్ధించుకునే ప్రయత్నం కూడా చేశారు. బోర్డు ఆధ్వర్యంలో ప్రతిపాదిత కమిటీని ఏర్పాటు చేస్తే, మసీదుల్లో జరిగే ప్రసంగాల్లో (సెర్మాన్‌) ‌ప్రస్తావించాల్సిన అంశాలను ఆ కమిటీ గుర్తిస్తుందని చెప్పారు. ముస్లిం మతంలో వున్న అంశాలు ముఖ్యంగా సామాజిక రుగ్మతలను ఎదుర్కొనాల్సిన ఆవశ్యకతను ఆ ప్రసంగాల్లో చెబుతారని అన్నారు. ఈ నిర్ణయంలో ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర వుండదని అన్నారు. కానీ ఆ కమిటీలో ఎవరు ఉంటారు? వారిని నియమించేది ఎవరు అన్నదానికి ఆమె బదులివ్వకపోవడం గమనార్హం.

మత స్వేచ్ఛను కాలరాయడమే ..

వక్ఫ్‌ బోర్డు చైర్‌పర్సన్‌ ప్రతిపాదనను ముస్లిం మత పెద్దలు తీవ్రంగా నిరసించారు. మత స్వేచ్ఛకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ముందుగా ఆమోద ముద్ర పొందిన ప్రసంగాలనే చేయాలని తమకు చెబుతున్నారని, కానీ ఈ ప్రసంగాలను రూపొందించే కమిటీ వివరాలు ఏవీ ఇవ్వకుండానే వీటి గురించి చెబుతున్నారని విమర్శిస్తున్నారు. సెర్మాన్‌‌లో వుండాల్సిన అంశాల గురించి నిర్ణయించాల్సింది ఇస్లామిక్‌ ‌పండితులని, అంతేగానీ పాలనాపరమైన సంస్థ కాదని సీనియర్‌ ‌మత పెద్దలు మిర్వాయిజ్‌ ఉమర్‌ ఫరూక్‌, ముతాహిదా మజ్లిస్‌-ఇ-ఉలేమా, ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా తెలిపారు. మత పండితులను ఆదేశించడానికి బోర్డుకు గల అధికారాలేమిటని మాజీ విద్యా శాఖ మంత్రి నయీమ్‌ అక్తర్‌ ‌ప్రశ్నించారు.

​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్