- 10 కొత్త మార్గాలకు కేంద్రం ప్రతిపాదన
న్యూఢిల్లీ : భారతదేశంలోకి ఔషధాలు, వైద్య పరికరాలు, సౌందర్య సాధనాల దిగుమతి కోసం అధీకృత ప్రవేశ మార్గాల నెట్‌వర్క్‌ను విస్తరించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ఇప్పటికే ఉన్న అధీకృత ప్రదేశాల జాబితాకు 10 దేశీయ కంటైనర్ డిపోలు (ఐసిడిలు), ఒక ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్‌ఇజెడ్), ఒక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేర్చనుంది. 1945 నాటి ఔషధ నిబంధనలలోని రూల్ 43Aకు ప్రతిపాదించిన ఈ సవరణ, దిగుమతి కార్యకలాపాలను సులభతరం చేయడం, దేశీయ రవాణా దూరాలను తగ్గించడం, దేశవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల కదలికను మెరుగుపరచడం లక్ష్యమని కేంద్రం పేర్కొంది. డ్రగ్స్ రూల్స్, 1945 ప్రకారం, పరీక్ష, పరిశీలన లేదా విశ్లేషణ కోసం డ్రగ్స్ దిగుమతి చేసుకునే విధానాన్ని సరళీకృతం చేయాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది.
ప్రతిపాదిత అదనపు ప్రదేశాలలో హర్యానాలోని ఐసిడి సోనిపత్, పియాల, హర్సారు, ఉత్తర ప్రదేశ్‌లోని ఐసిడి దాద్రి, గుజరాత్‌లోని ఐసిడి గాంధీధామ్/ముంద్రా, తెలంగాణలోని హైదరాబాద్‌లో ఐసిడి సనత్ నగర్, తిమ్మాపూర్, కర్ణాటకలోని బెంగళూరులో ఐసిడి వైట్‌ఫీల్డ్ ఉన్నాయి. విమాన మార్గం ద్వారా డ్రగ్స్ దిగుమతి కోసం కర్ణాటకలోని ఎస్‌ఇజెడ్ బొమ్మసంద్ర, ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా చేర్చాలని మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదిత చేర్పులు, ఇప్పటికే డ్రగ్స్ దిగుమతుల కోసం నోటిఫై చేయబడిన విమానాశ్రయాలతోపాటు, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఉన్న ధన్నద్, తిహిలోని ఐసిడిలతో కూడిన అధీకృత దిగుమతి గేట్‌వేల ప్రస్తుత నెట్‌వర్క్‌కు అదనంగా ఉంటాయి. అందిన అభ్యంతరాలు, సూచనలను పరిశీలించిన తర్వాత ఈ సవరణను ముందుకు తీసుకువెళ్తామని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.








కామెంట్‌లు (0)