- దేశ వ్యాప్తంగా కదం తొక్కిన కార్మికులు, రైతులు
• కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్య ప్రతిఘటన
• పలు రాష్ట్రాలలో రోడ్లు, రైలు మార్గాలు దిగ్బంధం
• లక్షలాది మంది అరెస్ట్ • జైల్ భరో విజయవంతం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కార్మిక సంఘాల ఐక్యవేదిక, సంయుక్త కిసాన్ మోర్చ్ పిలుపుమేరకు సోమవారం జైల్‌భరో దేశవ్యాప్తంగా విజయవంతమైంది. రాజస్థాన్, తమిళనాడు, బీహార్, అస్సాం తదితర రాష్ట్రాల్లో రైతులు, కార్మికులు రోడ్లను, రైళ్లను దిగ్బంధించారు. కేరళలోని అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. మొత్తం 14 జిల్లాల్లో పదివేల మంది కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యకలాపాలను అడ్డుకున్నారు. అక్కడ కార్మికులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కోజికోడ్‌లో సిఐటియు అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఎలమరం కరీంను అరెస్టు చేశారు. త్రిపుర రాజధాని అగర్తలలో వేలాదిమంది కదం తొక్కారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు వీరిని ఏ మాత్రం అడ్డుకోలేకపోయాయి. వాటిని తోసివేసి విధాన సౌధ వైపు కార్మికులు, కర్షకులు దూసుకువెడుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. బెంగాల్‌లోని పలుచోట్ల నిరసనకారులపై పోలీసులు దాడి చేశారు. పోలీసులు, బిజెపి నాయకుల నుండి బెదిరింపులు ఉన్నప్పటికీ, బెంగాల్‌లోని అన్ని జిల్లాల్లో పదివేల మందికి పైగా పాల్గొని ర్యాలీలు, సమావేశాలు నిర్వ హించారు. హుగ్లీ జిల్లాలో ఆయుధాలతో బిజెపి గూండాలు శాంతియుత నిరసనకారులపై దాడి చేశారు. గౌహతిలో నిరసనకారులపై పోలీసులు దాడికి పాల్పడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో 100 కేంద్రాల్లో దిగ్బంధనాన్ని విజయవంతంగా నిర్వహించారు. వందలాది మందిని పోలీసులు అరెస్టు చేశారు. హర్యానాలోని భివానీలో కిసాన్ సభ ఆర్థిక కార్యదర్శి పి.కృష్ణ ప్రసాద్, హిసార్‌లో ఉపాధ్యక్షుడు ఇందర్‌జిత్ సింగ్‌ను, కర్నాల్‌లో సిఐటియు అధ్యక్షుడు సుదీప్ దత్తా అరెస్టు చేశారు. రాజస్థాన్‌లోని గంగానగర్‌లో రైతులు, కార్మికులు రహదారిని దిగ్బంధించారు. దీంతో పోలీసులు రైతులు, కార్మికులను అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాలో వందలాది మంది నిరసన చేపట్టారు. పంజాబ్‌లోని బఠిండాలో డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ఎర్ర జెండాలతో నిండిపోయింది. లుధియానాలో రహదారిని దిగ్బంధించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో సిఐటియు ఆధ్వర్యంలో వందలాది మంది వీధుల్లోకి వచ్చారు. తమిళనాడులో 142 కేంద్రాల్లో 31 వేల మంది కార్మికులు కార్యకలాపాలను నిలిపేశారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్ తదితర ప్రాంతాల్లో భారీ ఆందోళనలు జరిగాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళనలో సిఐటియు అఖిల భారత కార్యదర్శి ఎఆర్ సింధు, రాజ్యసభ సభ్యుడు వి. శివదాసన్ పాల్గొన్నారు. ఎస్‌కెఎం, సిఐటియు నేతలను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటకలోని మైసూర్‌లో నిరసనకారులు బారికేడ్లను బద్దలు కొట్టారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్, నాసిక్, ధూలే, పర్భానీ, బీడ్, పాల్ఘర్, షోలాపూర్, సాంగ్లీ, సంభాజీనగర్, బుల్దానా తదితర ప్రాంతాల్లో వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చారు. మహారాష్ట్రలోని దహనులో వేలాది మంది రైతులు, కార్మికులతో పాటు కిసాన్ సభ అధ్యక్షుడు అశోక్ ధవాలేను అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒరిస్సా, జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరిలో ఆందోళనలు భారీగా జరిగాయి. మధ్యప్రదేశ్‌లోని మోరెనాలో సహాయ కార్యదర్శి బాదల్ సరోజ్‌ను అరెస్టు చేశారు.
సిపిఎం అభినందనలు
సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర సమాఖ్యల సంయుక్త వేదిక ఇచ్చిన దేశవ్యాప్త పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగిన లక్షలాది మంది కార్మికులకు, రైతులకు సిపిఎం పొలిట్ బ్యూరో అభినందనలు తెలియజేసింది. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేసింది. క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా ఇచ్చిన ఈ పిలుపు ముఖ్య ఉద్దేశ్యం, ‘‘నాలుగు కఠినమైన కార్మిక కోడ్లను రద్దు చేయడం, పటిష్టమైన ఉపాధి హామిని పునరుద్ధరించడం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయడం, స్వామినాథం కమిషన్ సిఫార్సుల ఆధారంగా కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి), నెలకు రూ.42 వేల సార్వత్రిక కనీస వేతనం వంటి డిమాండ్లను అమలుకు ఒత్తిడి తేవడం’’ అని తెలిపింది. ఈ జైలు భరో విజయం కార్మిక-రైతు వ్యతిరేక విధానాలపై ఒక హెచ్చరిక అని, మోడీ ప్రభుత్వం తక్షణం వాటిని విడనాడాలని డిమాండ్ చేసింది. క్షేత్రస్థాయి నుండి వస్తున్న హెచ్చరికలను మోడీ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని, దేశ కార్మికులు, రైతులు లేవనెత్తిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిపిఎం కోరింది.







కామెంట్‌లు (0)