మచిలీపట్నం, విజయవాడ కలెక్టరేట్ల వద్ద ధర్నాలు
దళిత, గిరిజన కాలనీల్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
నెల రోజుల పాటు సమస్యలపై కెవిపిఎస్, వ్య.కా.స అధ్యయనం
ప్రజాశక్తి-కృష్ణా ప్రతినిధి/ ఎన్టిఆర్ జిల్లా ప్రతినిధి : దళిత, గిరిజన కాలనీల్లో నెలకొన్న మౌలిక వసతులు, భూమి, ఇళ్లు, తాగునీరు, డ్రైనేజీ, శ్మశానవాటికలు, పింఛన్లు, ఉపాధి తదితర సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం మచిలీపట్నం, విజయవాడ కలెక్టరేట్ల వద్ద 'సామాజిక శంఖారావం' ధర్నాలు నిర్వహించారు. జులై 13 నుంచి ఆగస్టు 23 వరకు ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ఆయా సంఘాలు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయగా పలు సమస్యలు వెలుగులోకి వచ్చాయి. ఎన్టీఆర్ జిల్లాలోని 16 మండలాల్లో 100 గ్రామాలు, ఐదు పట్టణాల్లోని 50 వార్డుల్లో క్షేత్రస్థాయి అధ్యయనం, సర్వే నిర్వహించారు. సర్వేలో 40 ప్రాంతాల్లో రక్షిత తాగునీటి సమస్య, 80 చోట్ల డ్రైనేజీ సమస్య, 35 చోట్ల శ్మశాన భూమి కొరత, 30 చోట్ల కమ్యూనిటీ హాళ్ల కొరత, 20 చోట్ల దళిత భూముల ఆక్రమణ సమస్యలు ఉన్నట్లు నాయకులు గుర్తించారు. అనేక దళిత, గిరిజన కాలనీల్లో అంతర్గత రహదారులు, వీధిదీపాలు, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలు సరిగా లేవని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటించినప్పటికీ వందలాది మంది పేదలకు ఇళ్లు, ఇంటి స్థలాలు అందలేదు. అర్హులైన డప్పు కళాకారులు, చర్మకారులు, వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు పెద్ద సంఖ్యలో పింఛన్లకు దూరమయ్యారు. కృష్ణాజిల్లా ఘంటసాల మండలం కొత్తపల్లిలో దళితవాడకు శ్మశానవాటిక లేకపోవడం, మొవ్వ అంబేద్కర్నగర్కు శ్మశానవాటిక కేటాయించకపోవడం వంటి సమస్యలు ఉన్నాయి. కోడూరు మండలం దింటిమెరకలో శ్మశానవాటిక ఆక్రమణకు గురైందని, గుడివాడ వలివర్తిపాడులో శ్మశానవాటిక పిచ్చిమొక్కలు, ముళ్లపొదలతో నిండిపోయింది. బందరు మండలం రుద్రవరంలో శ్మశానవాటికకు వెళ్లేందుకు సరైన రహదారి లేదని, తోట్లవల్లూరు మండలం గిరకపర్రులో శ్మశాన స్థలం నీటితో నిండిపోతోంది. కంకిపాడు మండలం గొడవర్రు ఏకలవ్య కాలనీ వాసులను గ్రామ ఉత్సవాలు, ఊరేగింపులకు దూరంగా ఉంచుతున్నారు. కృష్ణాజిల్లాలోని పలు ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ఇళ్ల స్థలాలు, మంచినీరు, డ్రైనేజీ, అంతర్గత రహదారులు, విద్యుత్, వీధిదీపాలు, రేషన్ కార్డులు, పింఛన్ల సమస్యలు ఉన్నాయి. కొత్త విద్యుత్ మీటర్లతో అధిక బిల్లులు వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, వీధిదీపాల కొరత ఉంది.







కామెంట్‌లు (0)