విజయవాడ : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కోరుతూ రేపు (సోమవారం) విజయవాడలో వామపక్షాల ఆధ్వర్యంలో సభ జరుగుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రకటించారు. ఆదివారం విజయవాడలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ .... ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ .... గత 20 రోజులుగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన సాగుతోందన్నారు. ప్రముఖ విద్యావేత్త, ఇంజినీర్, పర్యావరణ ప్రముఖులైనటువంటి సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్షకు పూనుకొన్నారని, 21 వ రోజు నిన్న (శనివారం) తెల్లవారుజామున పోలీసులు వచ్చి ఆయన్ను బలవంతంగా అరెస్టు చేసి ఆసుపత్రికి తరలించడం అనేది చాలా ఘోరమైన విషయమన్నారు. లక్షలాదిమంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన ప్రధాన కారకుడికి పెద్ద పీట వేస్తూ ... ఆయన రాజీనామా చేయాలని విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని ఉద్యమం చేస్తున్న సోనమ్ వాంగ్ చుక్ పై నిరంకుశంగా ప్రవర్తించి ఆయన్ను బలవంతపు అరెస్టు చేయడాన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తున్నదన్నారు. ఆయన్ను అరెస్టు చేసినా సరే ఉద్యమం ఆగదు అని విద్యార్థి సంఘాల నేతలు, ఈ ఉద్యమానికి ప్రారంభకుడైన అభీజిత్ దీప్కే మళ్లీ నిరవధిక నిరాహారదీక్ష చేపట్టి కొనసాగించడంపై తాము తమ పూర్తి మద్దతును ప్రకటిస్తున్నామన్నారు. ఈ అక్రమ అరెస్టుకు నిరసనగా .... ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కోరుతూ రేపు (సోమవారం) విజయవాడలో వామపక్షాల ఆధ్వర్యంలో సభ జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యార్థి సంఘాలు కలిసి నేడు, రేపు నిరసనలకు పిలుపునిచ్చాయన్నారు. వారికి తమ పూర్తి మద్దతును ప్రకటించారు. సిపిఐ(యం) పార్టీ కూడా ఈ ఉద్యమానికి పూర్తి సహాయ సహకారాలను అందిస్తుందని స్పష్టం చేశారు. రేపటి నుండి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయని, ఈ సమావేశాల్లో ఎపి రాష్ట్రానికి సంబంధించిన ప్రధానమైన సమస్యలను అక్కడ ప్రస్తావించి వాటి పరిష్కారానికి కృషి చేయాల్సిన బాధ్యత పార్లమెంట్ సభ్యులపై ఉందని వి.శ్రీనివాసరావు కోరారు.
LIVE : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కోరుతూ రేపు విజయవాడలో సభ : వి.శ్రీనివాసరావు
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 19, 2026, 11:42 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)