విశాఖ : విశాఖలో దశాబ్దాలుగా పనిచేసిన అంతర్జాతీయ విమానాశ్రయం స్ధానంలో పొరుగున ఉన్న భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ ఎయిర్ పోర్టును తాజాగా అందుబాటులోకి తెచ్చారు. దీంతో పాత వైజాగ్ ఎయిర్ పోర్టులో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉపాధి లేకుండా పోతోంది. ఈ ఎయిర్ పోర్టు మూతపడటంతో ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు రోడ్డున పడుతున్నారు. అలాగని కొత్తగా నిర్మించిన భోగాపురం ఎయిర్ పోర్టులోనూ వారిని తీసుకోవడం లేదు. దీంతో ఆయా ఉద్యోగులు ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు. అయినా ఫలితం లేదు..!
విశాఖపట్నం విమానాశ్రయంలో దాదాపు 15 ఏళ్లుగా పనిచేస్తూ.. తాజాగా ఎయిర్ పోర్టు భోగాపురానికి మారడంతో ఉపాధి కోల్పోతున్న హౌస్‌కీపింగ్ ఉద్యోగి ఒకరు మీడియాతో మాట్లాడుతూ తన గోడు వెళ్లబోసుకున్నారు. తాను విశాఖ ఎయిర్ పోర్టులో 15 ఏళ్లుగా పనిచేస్తున్నానని, ఇక్కడి విమానాశ్రయ కార్యకలాపాలు నిలిపివేస్తున్నారని, ఇప్పుడు తమకు అండగా నిలిచేవారు ఎవరూ లేరని తెలిపారు. దీనిపై అధికారులను, తమ కంపెనీ యాజమాన్యాన్ని సంప్రదించినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను వ్యక్తిగతంగా రాష్ట్ర మంత్రి లోకేష్ ను, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని వేడుకున్నానని తెలిపారు. వారు 'చూద్దాం' అని చెప్పి వెళ్లిపోయారన్నారు. తమ సమస్యలను పరిశీలించి సహాయం చేయాలని ప్రధాని మోడి ని ఆయన కోరారు. ఈ సమస్యపై విమానాశ్రయ విభాగం కూడా స్పందించడం లేదన్నారు. అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్నారు. యాజమాన్యం తమ సమస్యలపై స్పందించడం లేదని, అలాగే మంత్రి లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు లేదా పౌర విమానయాన శాఖ మంత్రి కూడా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.







కామెంట్‌లు (0)