శనివారం, 01 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఒక పోరాట విజయం...యుద్ధం సశేషం...

21 గంటల క్రితం

protest
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 01, 2026, 05:00 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

ఆ పోరాట ఫలితం సంచలనాత్మకమైనది. ఒక విధంగా ఆ శక్తి, పటుత్వం, దృఢత్వం అపూర్వమైనవి. బిజెపి, ఆర్.ఎస్.ఎస్ ‌నాయకత్వంలో మోడీ సర్కారు పగ్గాలు చేపట్టిననాటి నుంచి దురహంకారం, బేఖాతరు తనం పరాకాష్టకు చేరాయి. జవాబుదారీ తనం మాటేలేని రాచరిక తరహా పాలనాశైలి కరుడుగట్టిపోయింది. వాస్తవానికి ప్రజాస్వామిక ఏర్పాటు అనే ఒక మౌలిక సూత్రమే బూటకంగా మార్చివేయబడటం ఈ ఘర్షణకు దారితీసింది. ప్రభుత్వం అనుసరించిన ఈ పోకడ ఎంతగా తలకెక్కిపోయిందంటే గడచిన పన్నెండేళ్లలో ఒక్కసారి కూడా ప్రధానమంత్రి మీడియా సమావేశం జరపనేలేదు. చాలాకాలంగా దీనిపై విదేశీ పాత్రికేయుల నుంచి కూడా విమర్శలు మొదలైన పరిస్థితి. అయినా ప్రధానమంత్రి ప్రభుత్వంలోని ఆయన సన్నిహితుల, వ్యూహకర్తల బృందం ఈ లేనిపోని పటాటోపాన్ని కొనసాగించేందుకే గట్టిగా కట్టుబడిపోయారు. తద్వారా తామేదో నిర్దాక్షిణ్యంగా తోసుకుపోతామనే భావనకు ప్రాణం పోయాలనుకున్నారు. దేశానికి బలమైన ప్రభుత్వం కావాలంటూ 2014లో ఇచ్చిన నినాదానికి ఇది వాస్తవరూపమన్నట్టు వ్యవహరించారు. అయితే ఇదంతా చివరకు వృథాప్రయాసే అయింది.

జూన్‌, ‌జులై మాసాల్లో కనీసం నూటయాభై సందర్భాల్లో విస్తృత ప్రజా పోరాటాలు కొత్త అధ్యాయాలను రచించాయి. కనీసం నూటయాభై సందర్భాల్లో కేంద్రం నిర్వహించిన పరీక్షల ప్రశ్నా ప్రతాలు లీకయ్యాయి. దాంతో ప్రభుత్వం అడ్డగోలుగా లీకేజీ జరగలేదని ఖండించేందుకు పాల్పడింది. అయితే టీనేజర్లు హుషారుగా వ్యవహరించారు. వారు చేసిన సానుకూల నైతిక హ్యాకింగ్‌ ‌ద్వారా ఎన్‌‌టిఎ వ్యవస్థను ఛేదించి రిగ్గింగ్‌ ‌మోసాలు జరిగాయని నిరూపించారు. తప్పులు చేసినందుకు బ్లాక్‌ ‌లిస్టులో పెట్టిన టెండరుదార్లు, మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఆయన నియమించిన నేషనల్‌ ‌టెస్టింగ్‌ ఏజన్సీ కన్నంలోనే దొరికిపోయారు. ఇది ఈ పోరాటానికి, జంతర్‌ ‌మంతర్‌ ‌కూ కొత్త ఊపునిచ్చింది.

పోరాట క్రమం

నిస్సందేహంగా సోనమ్‌ ‌వాంగ్‌చుక్‌ ‌నిరవధిక నిరాహారదీక్ష సమైక్య విద్యార్థి ఉద్యమానికి మరింత ఉత్తేజమిచ్చింది. సంఘటిత విద్యార్థి ఉద్యమం ప్రత్యేకించి వామపక్ష విద్యార్థి సంఘాలు దీనిపై నిరంతరం కృషి చేస్తూనే వున్నాయి. ఒక్కసారిగా ఉప్పొంగిన ఆగ్రహావేశాలు ఇందుకు తోడై రెండింటి కలయికతో యువతరాన్ని ఒక మహావేశ వెల్లువ కుదిపేసింది. తల్లిదండ్రులు, ఇతర ప్రజాస్వామిక శక్తులు కూడా బిగ్గరగా మద్దతు తెలిపారు. జులై 18న వాంగ్‌‌చుక్‌‌ను బాక్సర్ల తరహాలో అపహరించుకుపోవడంతో ఈ నిరసన మరింత తీవ్రరూపం తీసుకుంది. కుటుంబం వద్దని చెబుతున్నా ఆయన అభీష్టానికి విరుద్ధంగా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుపోయారు. భద్రతా దళాలు ఆయన ఆరోగ్య రక్షణ సాకుతో ఆసుపత్రిని దాదాపు ఒక ఖైదుగా మార్చేశాయి.

అయితే ప్రభుత్వ ఎత్తుగడ బెడిసికొట్టిందనేది స్పష్టం. దీనివల్ల నిరసనకారులు భయపడకపోగా జంతర్‌‌మంతర్‌ ‌దగ్గర విద్యార్థి సమూహాలు మరింత పెరిగాయి. దేశ వ్యాపితంగా ప్రభంజనంలా నిరసన వ్యాపించడానికి ఇదే ఒక తుపాకి ట్రిగ్గర్‌‌గా పనిచేసింది. జులై 20న పార్లమెంటుకు నిరనన యాత్ర సందర్భంగా అపూర్వమైన స్థాయిలో నిరసనకారులు సమీకృతం కావడానికి దారితీసింది.

బరితెగింపే కారణం

విద్యామంత్రిత్వ శాఖ, ప్రభుత్వం పచ్చిగా బరితెగించి వ్యవహరించడం వల్లనే విద్యార్థుల ఆందోళన అంత బ్రహ్మాండమైన రూపం తీసుకుంది. కొన్ని ప్రధాన మీడియాలలో ఇప్పుడు వస్తున్న నివేదికలు చూస్తే ఈ విషయం తేటతెల్లమవుతుంది. ఉదాహరణకు ఎన్‌‌టిఎ కేవలం 24 మంది పర్మినెంట్ ఉద్యోగులతో 197 మంది ఔట్‌ ‌సోర్సింగ్‌ కాంట్రాక్టు ‌సిబ్బందిపై ఆధారపడి 270 పరీక్షలు నిర్వహించింది. పనిచేసే సిసి టి.వి నిఘా వంటి కనీస భద్రతా చర్యలు కూడా లేకుండా నడుస్తున్నదనేది సుస్పష్టం. 2024 నీట్‌ ‌సంక్షోభం తరుణంలో తప్పులకు కారణాలను గుర్తించేందుకు గాను రాధాకృష్ణన్‌ ‌కమిటీ సిఫార్సు చేసిన కీలక సంస్కరణలు కూడా అమలు కాలేదని దీన్నిబట్టి మరింత బాగా తెలుస్తున్నది.

అయినా విద్యార్థులు చేస్తున్న అతి ముఖ్యమైన డిమాండ్ ఎన్‌‌టిఎ ను మొత్తంగా రద్దు చేయడమనేది ఇప్పటికీ ఆమోదం పొందలేదు. భారత్‌ ‌వంటి సువిశాల వైవిధ్య భరిత దేశంలో ఆ విధంగా ఒకే కేంద్రీకృత పరీక్ష జరపడమనే ఆలోచనే చెల్లుబాటు కానిది. కొన్ని రాష్ర్ట ప్రభుత్వాలు వద్దని అభ్యంతరం చెప్పినా ఇది కొనసాగుతున్నదంటే ఫెడరలిజం పైన దాడిగా చూడవలసి వుంటుంది. అసలు ఎన్‌ఇపి 2020 మొత్తం ఉద్దేశమే వాణిజ్యీకరణ, కేంద్రీకరణ అనే చట్రం నుంచే ఇది పుట్టుకొచ్చిందని వేరుగా చెప్పనవసరం లేదు. గత్యంతరం లేని స్థితిలో ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామా చేయడం అసలు ఎన్‌‌టిఎ పై మరింత చర్చకు, పున: పరిశీలనకూ అవకాశం కల్పిస్తున్నది.

అయితే ఇది కేవలం విద్యాశాఖ విషయమే కాదు. ఉద్యోగాల కల్పన కూడా అత్యంత అధ్వాన్నంగా వుంది. యువతకు అవకాశాలన్నీ మూసుకుపోయిన పరిస్థితి వల్ల కూడా ఇలాంటి నిరసన వెల్లువ ఎప్పుడైనా విరుచుకుపడాల్సి వుండింది. రైతులు, కార్మికులు, మహిళలు, ఇతర అనేక వర్గాలలోనూ అలజడి పెరిగిపోతున్న స్థితి ఫలితంగా కూడా ఈ వెల్లువను చూడవలసి వుంటుంది. ఈ వర్గాలన్నీ కూడా తమ కీలక కోర్కెల సాధన కోసం పోరాట పథం చేపట్టడానికి సిద్ధంగా వున్నాయి.

ఘోర నిర్బంధం

ప్రభుత్వం పూర్తిగా వెనకపట్టులో చిక్కుకుపోయింది. జులై 20న నిరసనకారులపై కనీవినీ ఎరగని నిర్బంధం సాగించడంపై వచ్చిన అనూహ్య ప్రతిస్పందన కారణంగా ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామా డిమాండుకు తలవంచక తప్పని స్థితిలో పడింది. ములుకుల బెత్తాలు, పెల్లెట్‌ ‌తుపాకుల ప్రయోగం, అంతు తెలియని భద్రతా బలగాల మోహరింపు ఈ భయానక చిత్రానికి తోడయ్యాయి. స్వతంత్ర మీడియాల లోతైన విశ్లేషణలూ, ఫ్యాక్ట్‌ ‌చెక్‌ ‌సైట్లు చూస్తే రిపబ్లిక్‌ ‌టీవీతో మొదలుపెట్టి ఎఎన్‌ఐ, ఇతర బడా ఛానళ్లు విద్యార్థుల నిరసనను పెనుభూతంలా చూపేందుకు ఎన్ని తంటాలు పడ్డాయో తెలుస్తుంది.

విద్యార్థుల నిరసన ప్రప్రధాన లక్షణం నిర్భీతి కావడం వల్లనే ఈ పోరాట వెల్లువ ప్రాధాన్యత అంతగా స్పష్టమైంది. ఏ మాత్రం దిగిరాకుండా నిర్దాక్షిణ్యంగా వ్యవహరించుతానన్నట్లు ప్రభుత్వం పట్టు విడుపులు లేకుండా చేయడం, మోడీ హయాంలో రాజీనామాల మాటే వుండబోదన్నట్లు బింకాలు పోయినా తర్వాత కాళ్లబేరానికి రావలసి వచ్చింది. పైగా ప్రధాని నిద్ర మానుకుని యువత భవిత గురించే ఆందోళన చెందుతున్నట్టు విజ్ఞప్తి వీడియోలు విడుదల చేయడం వినోదప్రాయంగా తోచింది.

కొత్త తరం, సరికొత్త ఆయుధాలు

ఇక్కడ తరాల మార్పు కోణం పూర్తి ప్రభావాన్ని గ్రహించవలసిన అవసరం కూడా వుంది. యువజనులు వ్యంగ్యం, ఎగతాళి, అపహాస్యం, వెక్కిరింత, మీమ్‌ ‌కార్టూన్‌ ‌తదితర ప్రక్రియలు గుప్పించి ప్రభుత్వ ఆగ్రహ ప్రకటనలను నవ్వుల పాలు చేయగలిగారు. ఇది పూర్తిగా వేరే తరం. వాట్సప్‌‌లలో ఫేక్‌ ‌మెసేజ్‌‌లు పెడితే లొంగిపోయే రకం కాదు. మళ్లీ అదే ఇన్‌స్టాగ్రామ్‌‌తో తిప్పికొట్టగలదు. సర్కారు సిద్ధాంతాలనూ గొప్పలను వెక్కిరించేయగలదు. అశోకా యూనివర్సిటీ తాజాగా చేసిన అధ్యయనం ప్రకారం 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయసులో వుండే తరం 2029 నాటికి జనాభాలో 39 శాతం వుంటుంది. జులై లో జరిగిన పరిణామాలు నిజానికి ప్రభుత్వానికి పెద్ద హెచ్చరిక వంటివి.

ఈ సంప్రదింపుల తర్వాత కేవలం కేంద్ర ప్రభుత్వమే గాక కొన్ని ప్రధానమైన బిజెపి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ చర్యలు కొన్నింటిని వెనక్కు తీసుకోక తప్పలేదు. ప్రభుత్వం ఒప్పుకోలు అంతకాకున్నా సుప్రీంకోర్టు శాంతియుత నిరసన తెల్పడం రాజ్యాంగ హక్కు అని పునరుద్ఘాటించింది. వాటిని చెదరగొట్టేందుకు అధికారులు విచక్షణా రహితమైన బలప్రయోగానికి పాల్పడటాన్ని రాజ్యాంగం అనుమతించబోదని కూడా పేర్కొంది. ఇది కూడా న్యాయమైన ప్రతిపక్షాల స్థానాన్ని బలోపేతం చేసింది.

భవిష్యత్‌ ‌కేసి...

విద్యార్థుల న్యాయమైన కోర్కెల పట్ల నిరంకుశంగా ఫాసిస్టు తరహాలో స్పందించడాన్ని ఎండగట్టడంలో పార్లమెంటులో ప్రతిపక్షాలు కూడా ఒక ముఖ్య పాత్ర నిర్వహించాయి. అది కూడా పోరాట క్రమాన్ని పటిష్టపరిచింది. ఇది సహజ పరిణామమే. వాస్తవానికి ప్రతిపక్ష మక్తభారత్‌ ‌నినాదం, ఎన్నికైన ప్రతిపక్ష శాసనసభ్యులను సంతలో పశువుల్లా పచ్చిగా బేరాలు చేయడం వల్ల వీధుల్లో పోరాటానికి న్యాయబద్దత లభించినట్టయింది. కనుకనే మనం రానున్న కాలంలో మరింత శక్తివంతమైన పోరాటలకేసి సాగిపోదాం. ఈ విధానాల వల్ల లాభపడే కార్పొరేట్ల వత్తాసుతోనే ఆర్.ఎస్.ఎస్, ‌బిజెపి సాగిస్తున్న నయా ఫాసిస్టు పాలనను వ్యతిరేకించే శక్తుల విశాల ప్రగాఢ ఐక్యతను పెంపొందిద్దాం.



(‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం, జులై 26)

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్