బుధవారం, 05 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసోషలిజం దిశగా అమెరికన్‌ యువత, కార్మికవర్గం!

21 గంటల క్రితం

usa youth -socialism
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 05, 2026, 05:20 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

దేశభక్తి యుతంగా పెట్టుబడిదారీ విధానం పని చేస్తున్నదని సగం మంది కంటే తక్కువ మంది అమెరికన్లు అనుకుంటున్నారు, ప్రజాస్వామ్యానికి మద్దతు పడిపోయింది. న్యూయార్క్‌ పోస్ట్‌. ‘హౌస్‌ ప్రైమరీస్‌’ (పార్లమెంటు ప్రజాప్రతినిధుల సభ కాంగ్రెస్‌ అభ్యర్ధిత్వం కోసం పార్టీలో జరిగే పోటీ)లో ఆకస్మికంగా డెమోక్రటిక్‌ సోషలిస్టులు ఎందుకు దూసుకుపోతున్నారు-న్యూస్‌ వీక్‌. అంకెలు అబద్ధాలు చెప్పవు. యువ అమెరికన్లు సోషలిజం ప్రేమలో పడుతున్నారు- ఫాక్స్‌ న్యూస్‌. సోషలిజానికి పెరుగుతున్న యువత మద్దతు తొలి రోజుల అమెరికా పాఠాలను గుర్తుకు తెస్తున్నది- కరోలినా జర్నల్‌. అమెరికాలో పెట్టుబడిదారీ విధానపు ప్రతిష్ట 54 శాతానికి పడిపోయింది-గాలప్‌ న్యూస్‌.

పైన పేర్కొన్నవి అమెరికన్‌ మీడియాలో గత ఏడాది కాలంలో, ఇటీవల వచ్చిన కొన్ని వార్తా వ్యాఖ్యల శీర్షికలు. అక్కడి సమాజంలో వస్తున్న ఆలోచనా ధోరణులను ఇవి ప్రతిబింబిస్తున్నాయి. వీటిని చూసి డోనాల్డ్‌ ట్రంప్‌ వంటి నయా ఫాసిస్టులు తమ ఆందోళన, అక్కసులను బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. దీన్ని బట్టి వెంటనే అమెరికాలో సోషలిస్టు వ్యవస్థ ఏర్పాటు కానుందని ఎవరూ నిర్థారణకు రానవసరం లేదు. అక్కడి పాలకవర్గం అంత తేలికగా తన అధికారాన్ని వదులుకోదు.

గత గురువారం నాడు వాషింగ్టన్‌ పోస్టు పత్రిక - ఐసోస్‌ వెల్లడించిన సర్వే వివరాల ప్రకారం వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో సోషలిస్టు అభ్యర్ధి రంగంలో ఉంటే ఓటు వేయటం గురించి ఆలోచిస్తామని నమోదైన ఓటర్లలో 40 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇలాంటి వారు మూడు పదుల వయస్సులోపు వారు 46 శాతం మంది, డెమోక్రటిక్‌ పార్టీ మద్దతుదార్లలో 64 శాతం ఉన్నట్లు కూడా సర్వే పేర్కొన్నది. ఈ పత్రిక అమెజాన్‌ కంపెనీ అధిపతి జెఫ్‌ బెజోస్‌ యాజమాన్యంలో నడుస్తున్నది. అలాంటి కార్పొరేట్ల పత్రిక ఎవరి ప్రయోజనాల కోసం పని చేస్తుందో తెలిసిందే. అయితే సర్వేలను తిమ్మిని బమ్మిని చేస్తే కుదరదు గనుక ఇష్టం ఉన్నా లేకున్నా వివరాలను వెల్లడించక తప్పటం లేదు. అయితే ఈ సర్వే వార్తలోనే ఎక్కువ మంది అమెరికన్లు డెమోక్రటిక్‌ సోషలిస్టు పార్టీ (డిఎస్‌పి) అభ్యర్ధికి మద్దతు ఇవ్వటం లేదని కూడా రాసింది. సిఎన్‌ఎన్‌ మీడియా సంస్థ కోసం ఎస్‌ఎస్‌ఆర్‌ఎస్‌ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో డెమోక్రాట్లు, ప్రజాస్వామిక భావాలకు మద్దతు ఇచ్చే వారిలో మూడో వంతు మంది తాము డెమోక్రటిక్‌ సోషలిస్టులమని చెప్పుకున్నారని, వారిలో 45 ఏళ్ల లోపు వారు 59 శాతం మంది ఉన్నట్లు తేలింది. మూడింట రెండు వంతుల మంది నవంబరు మూడున జరిగే ఎన్నికల్లో కచ్చితంగా ఓటు వేస్తామని కూడా చెప్పారు. డెమోక్రటిక్‌ పార్టీలో తెల్లవారితో పోల్చితే ఆఫ్రో-అమెరికన్లు బాహాటంగా తాము డెమోక్రటిక్‌ సోషలిస్టుకే ఓటు వేస్తామని చెప్పారు. డెమోక్రటిక్‌ సోషలిస్టులుగా చెప్పుకున్న వారిలో 66 నుంచి 54 శాతం మందికి డిగ్రీలు లేవు, వారి వార్షిక ఆదాయం 76 నుంచి 65 శాతం మందికి లక్ష డాలర్ల లోపే ఉంది. దీన్ని మరో విధంగా చెప్పాలంటే మన దేశంలో చెప్పుకొనే బడుగు బలహీన వర్గాలు అమెరికాలో సోషలిజానికి అనుకూలంగా ఉన్నాయి. డెమోక్రటిక్‌ సోషలిస్టుల్లో 48 శాతం మంది గాజాలో మారణకాండకు పాల్పడిన ఇజ్రాయిల్‌కు అమెరికా సాయం నిలిపివేయాలనే అభ్యర్ధికే మద్దతు ఇస్తామని చెప్పటం కూడా గమనించాల్సిన అంశం. అమెరికా సమాజం మొత్తంగానే ఇరాన్‌పై జరుపుతున్న యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నది. శ్వేత జాతీయుల్లో ఎగువ మధ్య తరగతి మాత్రమే సోషలిజానికి అనుకూలంగా ఉన్నట్లు మీడియాలో వచ్చే విశ్లేషణలు వాస్తవం కాదని కూడా సిఎన్‌ఎన్‌ సర్వే తేల్చింది. జీవిత అనుభవాల నుంచే జనాలు సోషలిజానికి మద్దతు ఇస్తారని ప్రపంచ వ్యాపితంగా వెల్లడైన సత్యం. దీనికి అమెరికన్లు మినహాయింపు ఎలా అవుతారు! దోపిడీ స్వభావం కలిగిన పెట్టుబడిదారీ వ్యవస్థ వైఫల్యం ఎంత ఎక్కువగా కనిపిస్తే అంతగా ప్రత్యామ్నాయ విధానాలవైపు జనాలు చూస్తారు.

పార్లమెంటు మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రటిక్‌ సోషలిస్టులకు పెరుగుతున్న మద్దతు గురించి ఆ పార్టీలోని మితవాదులు కూడా ఆందోళన చెందుతున్నారు. జులైలో న్యూయార్క్‌, కొలరాడోలో అభ్యర్ధిత్వాలకు డెమోక్రటిక్‌ పార్టీలో జరిగిన ఎన్నికల్లో నాలుగు ప్రజాప్రతినిధుల స్థానాల్లో డిఎస్‌పి మద్దతు ఉన్న అభ్యర్ధులే గెలిచారు. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న వారిని ఓడించారు. ఇటీవల సిఎన్‌బిసి చేసిన సర్వేలో డోనాల్డ్‌ నినాదమైన ‘మాగా’ (అమెరికాను మరోసారి గొప్పదానిగా చేయాలి) కంటే డెమోక్రటిక్‌ సోషలిజం నినాదమే బహళ ఆదరణ కలిగి ఉందని తేలింది. డెమోక్రటిక్‌ సోషలిస్టు పార్టీ అభ్యర్ధులను చూపి భయపెట్టటాన్ని డెమోక్రటిక్‌ పార్టీ మానుకోవాలని కొందరు సలహా ఇచ్చారట. ఎందుకంటే ఎంతగా వ్యతిరేకిస్తే అంతగా ఆదరణ పొందుతున్నట్లు న్యూయార్క్‌ నగర మేయర్‌ ఎన్నికలో జోహ్రాన్‌ మందానీ విజయం వెల్లడించింది. అమెరికాలో తనను వ్యతిరేకించేవారందరికీ డోనాల్డ్‌ ట్రంప్‌ '' కమ్యూనిస్టు '' ముద్ర వేస్తున్నాడు. ఇది నష్టదాయకమని రిపబ్లికన్‌ మేధావులు వాపోతున్నారు. ప్రతివారినీ కమ్యూనిస్టులని ముద్రవేస్తే సభల్లో చప్పట్లు కొట్టవచ్చు, ఈలలు వేయవచ్చు, ఒకటి రెండు సార్లు మధ్యంతర ఎన్నికల్లో ఓట్లు కూడా పడవచ్చు గానీ పదే పదే ప్రతివారినీ కమ్యూనిస్టు అంటే అవును అయితే ఏమిటి అని యువతరం ప్రశ్నించే పరిస్థితి రావచ్చని హెచ్చరిస్తున్నారు. నిజానికి గత కొద్ది సంవత్సరాలుగా అదే జరుగుతున్నది. పెట్టుబడిదారీ విధానం విఫలమైందని ఒకవైపు దాని సమర్ధకులే చెబుతుండగా మరోవైపు సోషలిస్టు చైనా సాధిస్తున్న అద్భుత విజయాలు, అమెరికాను సవాలు చేస్తున్న తీరును చూసి యువత సోషలిజం పట్ల సానుకూల వైఖరిని పెంచుకుంటున్నది. ట్రంప్‌ సర్కార్‌ కొన్ని స్వతంత్ర వాణిజ్య సంస్థలను ప్రభుత్వ ఆధీనంలోకి తెస్తున్నదని, కమ్యూనిస్టులు అదే చేస్తారని గతంలో పెద్ద ఎత్తున ప్రచారం చేసినందున ఇప్పుడు ట్రంప్‌ చర్యలను ''మాగా మావోయిజం '' అని వర్ణిస్తున్నారని, కమ్యూనిస్టులను భూతాలుగా చూపి భయపెట్టే క్రమంలో ఉదారవాదులకు సైతం అలాంటి ముద్ర వేస్తూ ట్రంప్‌ నష్టం చేస్తున్నారని, ఎన్నికల ముందు తెలివైన అమెరికన్‌ ఓటర్లు వీటన్నింటినీ గుర్తు చేసుకుంటారని రిపబిక్లన్‌ మేధావులు హెచ్చరిస్తున్నారు.

ఇదే సమయంలో కాల చక్రాన్ని వెనక్కు తిప్పాలని చూస్తున్న పచ్చి మితవాద రిపబ్లికన్లు కూడా ఉన్నారు.1950 దశకంలో మాదిరి కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టటం తప్ప మరొక మార్గం లేదని భావిస్తున్నారు. వారి బుర్రలకు ఎక్కనిదేమంటే అప్పుడూ ఇప్పుడూ పరిస్థితి ఒకే విధంగా లేదు.నాడు సోషలిస్టు, కమ్యూనిస్టు భావనలు యావత్‌ ప్రపంచాన్ని ఊపివేశాయి. ఇప్పుడు అలా లేదు. కమ్యూనిజాన్ని అంతం చేశామని చెప్పుకున్నవారే ఇప్పుడు కమ్యూనిస్టు బొమ్మ భూతాన్ని వీధుల్లోకి తీసుకువచ్చి గుండెలు బాదుకుంటూ భయాన్ని నటిస్తే జనాలు నవ్వుతారు తప్ప నమ్మరు.

ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే అసలు సోషలిజమంటేనే ఆమడదూరం వెళ్లే వాతావరణం నుంచి సానుకూలతవైపు మళ్లటమే పెద్ద మార్పు. సంస్కరణ వాదం వరకు వచ్చిన వారు అది పని చేయదు అనుకుంటే శాస్త్రీయ సోషలిస్టు భావనకు మారటం తధ్యం, అయితే దానికి ఎంత కాలం పడుతుందన్నది ఎవరూ చెప్పలేరు. సోవియట్‌, తూర్పు ఐరోపా సోషలిస్టు వ్యవస్థలు కూలిపోయిన తరువాత ఇలాంటి మార్పు వస్తుందని ఎవరైనా ఊహించారా ? ఏదైనా అంతే, పరిస్థితులే జనాలను ఎటువైపు నడిపించాలో నిర్దేశిస్తాయి !

mkr

ఎం. కోటేశ్వరరావు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్