"మీసాలున్నంత మాత్రాన, అందరూ రాజులైపోతారా ? మన దశుమంతు నాయుడు గారికి లేవేంటీ! రొయ్యలకీ ఉంటాయ్ తెగ బారెడూ! "--నవ్వుతూ అన్నాడు నారాయణమూర్తి.
" పోలిక బాగుంది గానీ, మధ్యలో నా పేరు లేకుండా రొయ్యలతో సరిపెట్టేసుంటే, నాకు గౌరవంగా ఉండేది"-- నాయుడు కూడా జోక్ గానే లైట్ తీసుకుని నవ్వులకు తోడయ్యాడు.
" రొయ్యలకే సీజన్ బాగోలేదు. చిత్తూరు తోతాపురి మామిడి పళ్లలా అయిపోయింది ఆటి బతుకు. ఆటి మీద జోకులొద్దండీ.. పరామర్శలు తప్ప బేరాల్లేవు మరి!-- బుస్సీ నాయుడు జాలిపడ్డాడు.
" అది కాదండి.. మనం ఒక వెంచరేశామనుకోండి.. పేదా, సాద ను బాధ పెట్టకూడదు. ఏదో ఒకటిచ్చి, ఖుషీ చేసీ, పని చేయించుకోవాలి. ఎస్సీల దేవత గుడి కొట్టించేసి, ఎంత మనకు పవరున్నా, రామాలయం కడతామనడం కరెక్ట్ కాదు గదా!"-- నారాయణమూర్తి డిప్యూటీ స్పీకర్ రాజు గారి వ్యవహారం గుర్తు చేశారు.
" మసీదుని కూల్చేసి, రాముడి గుడి వొయిభవంగా కట్టారు. ఏటయింది? దొంగల ఎకౌంటు బంగారమైంది! ఒకటి కూల్చీసి మరొకటి కట్టకూడదండి!"-- పరదేశి ముక్తాయించాడు.
కొంతసేపటికి, గుడివాడ అనే బోర్డు దగ్గర కార్లు ఆగాయి. కారుమబ్బులు రోడ్డు మీదకు దిగినట్టయింది గ్రామస్తులకు.. మూడూ, ఓడల్లాంటి నల్లటి కార్లు. నారాయణమూర్తి, నాయుడు, బుస్సీ, పరదేశి ముందు కార్లో నుంచి దిగారు. రోడ్డు మీద ఉన్న గ్రామస్తులు ఆసక్తిగా కార్లు చుట్టూ మూగారు.
పరదేశి చొరవ తీసుకొని-- " ఏమయ్యా! ఇక్కడ ఏదైనా గుడి ఉందేటి? " ఊరు పేరును బట్టి ఊహించాడు.
"ఒకటేటి బాబూ! మూడున్నాయి.. సూస్తారేటీ? "-- దక్షిణం వైపు ఉన్న ఒక పెద్ద దిబ్బను చూపిస్తూ, అడిగాడొక వృద్ధుడు.
"వచ్చింది అందుకే! మా పెద్ద సార్లకు గుడీ గోపురాలంటే చాలా భక్తి. అమ్మవార్లు అంటే మరీ ఎంతో భక్తి! "
" ఆ దిబ్బ మీద ఉన్నది అమ్మవారి గుడేనయ్యా! అదృష్టవంతులు మీరు"--అన్నాడు వృద్ధుడు.
" మాకే కాదు, సార్లు వచ్చారు గనుక, మీ ఊరికున్నూ ! "
" తమరు కాలు మోపినప్పుడే, అనుకున్నాము. మా ఊరికి ఏదో పట్టేస్తాదని!"
"ఎవరైనా వస్తారా? గుడి చూపించడానికి!"
" ఎంత మాట! పదండి బాబూ!"-- వృద్ధుడితోపాటు కొంతమంది యువకులు కూడా ముందు నడిచారు. దిబ్బ పెద్ద ఎత్తుగా లేదు. ఓ అరగంటలో గుడి దగ్గరకు చేరిపోయారు. నారాయణమూర్తి ద్వారం దగ్గరకు వెళ్లి లోపల పరిశీలించాడు. పాతబడిన గుడి.. నిత్య ధూప, దీప, నైవేద్యాలు లేవు.
" ఏమయ్యా! రోజువారీ పూజలు ఇక్కడ జరగవా? " అడిగాడు.
" వందేళ్ల క్రితం మా ఊరు నాయుడు కట్టారట! కట్టిన తర్వాత పూజార్లని తెచ్చారు గానీ, ఆళ్లకి సరైన రాబడి లేక వెళ్ళిపోయారట! మావే వర్షాధారం భూములు.. ఆళ్లనేటి పెంచగలం? "--నిట్టూర్చాడు వృద్ధుడు.
నారాయణమూర్తి గుడి వెనకకు వెళ్లి చూస్తే, దిగువన మరొక దిబ్బ కనిపించింది. పెద్ద ఎత్తు లేదు గానీ, దాదాపు వెయ్యి ఎకరాలుంటాయి రెండూ కలిపి!
" ఆ దిగువ దిబ్బ మీద ఏమైనా ఉందా?"-- అడిగాడు మూర్తి.
" కాలూ, సేతులూ ఇరిగిపోయిన బుద్ధుడి బొమ్మలు, ఇటుక ముక్కలు, కుండ పెంకులు తప్ప మరేటి లేవు బాబు! "--ఒక యువకుడు చెప్పాడు. చాలా దూరంలో ఒక నది కనిపిస్తుంది. అది గమనించి--
" గోస్తనమ్మ నది బాబూ! ఈ దిబ్బల నుంచి అక్కడకు మెట్లున్నాయి."
" ఆ దిబ్బ కూడా చూద్దాం "-మూర్తి అటువైపు కదిలాడు. మిగిలిన వాళ్ళు అనుసరించారు. శిధిలమైన శిల్పాలు, స్థలం చూశారు. అది ఒకప్పుడు బౌద్ధ క్షేత్రం అని నారాయణమూర్తికి మాత్రమే అర్థమైంది. చూపులతోనే దిబ్బలను కొలతలు వేశాడు. క్షణాల్లోనే క్లౌడ్ బరస్ట్ లా, గొప్ప పథకం కదిలింది.
" మరొకసారి వస్తామయ్యా! " అనేసి వెనుతిరిగాడు మూర్తి. ఇంత వేగంగా, ఎందుకు వెనుదిరిగాడో మిగిలిన వారికి అర్థం కాలేదు. కారులో మాట్లాడుకోవచ్చు అనుకుని అనుసరించారు.
గ్రామస్తులు రోడ్డు మీద ఉండిపోయారు... కార్లు కదిలాయి. నలుగురు ఒక కారులోనే కూర్చున్నారు.
" మూర్తి గారు, ఏంటి ఇంత వేగంగా బయల్దేరీశారు?"-- పరదేశి ఆత్రుతగా అడిగాడు.
కొద్ది సేపు మౌనంగా ఉండి-- " గొప్ప వెంచర్ దొరికిపోయిందయ్యా! మనకు ఫైనాన్స్ గా బాగా వర్కౌట్ అవుతుంది " హుషారుగా అన్నాడు మూర్తి.
" అదేంటి సార్!"-- ముగ్గురూ ఒకేసారి ఆత్రుతతో అడిగారు.
" గ్రీన్ ఫీల్డ్ బుద్ధ ఆరామ.. మనం ఇక్కడ నిర్మిస్తాం.. ఇంటర్నేషనల్ డిమాండ్.. పాత గుడి జోలికి వెళ్దం.. దిగువ దిబ్బ మీద బ్రహ్మాండమైన స్థూపం, ఆరామాలు నిర్మిస్తాం. ఎటు చూసినా పచ్చదనం.. టూరిజం కాంప్లెక్స్.. రెస్టారెంట్స్.. పార్క్.. ఇండోర్ గేమ్స్.. నదీ తీరంలో బీర్ షాక్స్.. కొంచెం ముందుకు ఫైవ్ స్టార్ బార్.. భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ కు ప్రభుత్వ నిధులతోనే నాలుగు లైన్ల రోడ్డు, కరెంట్, వాటర్ సప్లై.. ఇంద్రధనస్సు లాంటి ప్రణాళికను ఆవిష్కరించారు నారాయణమూర్తి.
"మరి అంత బడ్జెట్ మనం తట్టుకోగలమా?"-- బుస్సీ అడిగాడు.
" భోగాపురం ఎయిర్ పోర్ట్ కట్టడానికి జిఎంఆర్ వేల కోట్ల రూపాయలు పెట్టాడు అనుకుంటున్నారా? ఆయన ఎలా కట్టాడో, మనం కూడా అలాగే! ఆయనకేం షరతులో, మనకు కూడా అవే!"
" ఈ స్కీము ఏంటి బాబు?"-- దశమంతు నాయుడు అమాయకంగా అడిగాడు. నారాయణమూర్తి పక పకా నవ్వుతుంటే, మిగిలిన వారికి అర్థం కాలేదు.
" అదేనయ్యా! మనలాంటి వారి కోసమే మన బాబు గారు ఏర్పాటు చేశారు."
" పేరేటి బాబూ!? "-- పరదేశి అమాయకంగా అడిగాడు.
" పీ..పీ..పీ..పీ"-- పడీ, పడీ నవ్వాడు నారాయణమూర్తి. బుస్సీకి ఆలస్యంగా అర్థమైంది. మూర్తి నవ్వులకు తోడయ్యాడు. అర్థం కాకపోయినా, నాయుడు, పరదేశి నవ్వవలసి వచ్చింది.
- ' నల్లి ' కుట్టు








కామెంట్‌లు (0)