‘దాచాలంటే దాగదులే’ అన్నట్టుగా సనాతన వాదులు, రాజకీయ శక్తులు వర్ణాశ్రమ వ్యవస్థకు పెద్ద మద్దతుదారులన్న సత్యం దాచినా దాగదు. అసలు సనాతన భావాలకు పునాది స్తంభాలలో కుల పరమైన దొంతర కీలకం. దాన్ని ప్రశ్నించే ఎలాంటి విషయాలైనా వారు వెంటనే విరుచుకుపడతారు. ఈ మధ్యన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మనుధర్మంపై కొన్ని విమర్శలు చేశారు. కేరళ, తెలంగాణ వంటి చోట్ల ఆ పార్టీ సర్కార్లు సనాతనం పట్ల మెతక వైఖరితో పరోక్ష మద్దతునిస్తున్నాయని విమర్శలున్నా రాహుల్ హఠాత్తుగా తీవ్ర ధోరణిలో మాట్లాడుతుంటారు గనక అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్య మహిళలపై మనుధర్మ వివక్ష గురించి మాట్లాడితే కంగనా రనౌత్ వంటి వారు దాడి చేశారు. తాజాగా ఆయన కుల వివక్ష గురించి మాట్లాడుతూ ప్లాస్టిక్ పేపర్ గ్లాసులు కూడా వివక్షకు సాధనాలుగా చేశారని వ్యాఖ్యానించారు. ఇది నిజమే, ఒకప్పుడు ఉమ్మడి ఎ.పిలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కెవిపిఎస్) నిర్వహించిన సర్వేలోనే అది తేలింది. ప్రజాశక్తి ప్రచురించిన పుస్తకంలో ఉదాహరణలతో సహా ఉన్నాయి. అప్పటికింకా మోడీ సర్కారు లేదు. అదొచ్చాక మతవాద సనాతన శక్తులు ఇంకా చెలరేగాయి కదా. ఇదీ పెరిగింది, పోరాటమూ పెరిగింది. కనుక రాహుల్ మాటలో తప్పేం లేదు. కానీ ఆయనపై వెంటనే విరుచుకుపడిపోయారు సంఘ పరివార్ ప్రతినిధులు. నాగరికతలో భాగంగా వచ్చిన ప్లాస్టిక్ గ్లాసులను వివక్షతో ముడిపెడతారా అని రెచ్చిపోయి ట్రోల్స్ చేస్తున్నారు. ఎవరెంత గింజుకున్నా సత్యం సత్యమే కదా? కుల వివక్ష పోర్టళ్లు, వెబ్‌సైట్లు రాగాలేంది ఇదో లెక్కా?
మౌనమె నీ భాష ఓ సిఎం విజయ్!
చెప్పాల్సింది చాలా వున్నా చెప్పకుండా దాటేయడం ఓ అవస్థ, పాలకులకు ఓ కళ. మీడియాకు మొహం చాటేయడం అందులో ఒక భాగం. విశ్వగురు మోడీ చూడండి.. పుష్కరకాలంలో ఒక్క టంటే ఒక్క మీడియా గోష్టి జరిపారా? మాజీ ముఖ్యమంత్రి జగన్ గంటల తరబడి ఎంపిక చేసినవారితో మీడియా కాన్ఫరెన్సులు పెడుతున్నారు గానీ పదవిలో వుండగా కనీసం పలకరించారా? అదే కెసిఆర్ సరే అనుకున్నప్పుడు పిలిచి భారీ లెక్చర్లు గుమ్మరించేవారు. ఇప్పుడు ఆయన ఓడిపోయాక పెద్దగా మీడియాను కలవడం లేదు. ఇలా మాట మౌనంలో ఎవరి స్టయిల్ వారిదన్నమాట. ఇప్పుడు ఈ జాబితాలో చేరిపోయారు తమిళనాడు సిఎం విజయ్. అసెంబ్లీలో వివాదాలు మండిస్తుంటారు. కానీ మీడియాతో మాత్రం మాట్లాడితే ఒట్టు. ఈ విషయంలో ఆయన మాజీ స్టార్ సిఎంలు ఎంజిఆర్, జయలలితలను ఆదర్శంగా పెట్టుకున్నారా అని పరిశీలకులు అంటుంటారు. మీరు మా ముందు నోరెప్పుడు తెరుస్తారా అని నిరీక్షిస్తూ ఉండిపోతున్నదట మీడియా.
హాలివుడ్ తాకిన రీమేక్ జోరు
సినిమాల డబ్బింగ్, రీమేక్ మనకేం కొత్త కాదు. ఈ కోవలోనే అనేక సూపర్ డూపర్ హిట్లు అయినవి బాగా దెబ్బతిన్నవి లేవా అంటే అవీ ఉన్నాయి. ఉదాహరణకు తెలుగువారికి ఎంతో ఇష్టమైన ‘మూగమనసులు’ సినిమాను దాంట్లో నాయికగా నటించిన ప్రియతమ నటీమణి సావిత్రి ‘ప్రాప్తం’ పేరిట తమిళంలో తీసి చితికిపోయారు. గోదావరి తరహా వాతవరణం అక్కడ లేకపోవడమే కారణమైంది. మరోవైపున హిందీ సినిమాలు ‘జంజీర్, దీవార్, రోటీ’ వంటివన్నీ రీమేక్ చేసిన నటరత్న ఘన విజయాలందుకున్నారు. కాకుంటే పదేళ్ల కిందట ‘బాహుబలి’తో పాన్ ఇండియా ట్రెండ్ వచ్చాక నేరుగా అన్ని భాషల్లో విడుదల చేస్తున్నారు. డబ్బింగ్ సులభతరం కావడం, దీనికో ముఖ్యకారణం. అలాగే ‘బాషా, నరసింహ’ వంటి సినిమాలు చైనా, జపాన్‌లలో వందల కోట్లు వసూలు చేసి పెట్డడంతో భారతీయ చిత్రాలకు గిరాకీ పెరిగింది. ఇక ఇప్పుడు ఏకంగా హాలివుడ్ మేమే రీమేక్ చేస్తామంటున్నది. అందుకోసం తొలి ఆఫర్ వచ్చింది ఎవరికో కాదు..తమిళ సినిమా ‘మహారాజా’కే. సేతుపతి విజయ్ దీంట్లో హీరోగా నటించారు. తెలుగులోనూ విడుదలైంది. ఇలా హాలివుడ్ తాకిన తొలి మహారాజాలో ఎవరు నటిస్తారనేది ఇంకా సస్పెన్స్. ‘ఇంట గెలిచి రచ్చ గెలిచినట్టు’ ఇక్కడ హిట్టయి బయిటకు కూడా విస్తరిస్తే వెరీ గుడ్డే కదా.
- పీపీ








కామెంట్‌లు (0)