అక్టోబర్ 3, శనివారం. అదే తమ జీవితాల్లో చివరిదవుతుందని ఆ ఐదుగురు కార్మికులకు తెలియదు. రాత్రి షిఫ్టు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో శ్రీసిటీ లోని టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ బాంబులా పేలింది. నలుగురు కార్మికులు అక్కడికక్కడే మరణించగా, తీవ్రంగా గాయపడిన మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరికొందరు కార్మికులు కూడా గాయపడ్డారు.
భద్రత ప్రతి ఒక్క కార్మికుడి హక్కు
పేలుడు ధాటికి పరిశ్రమ భవన భాగాలు దెబ్బతిన్నాయి. సమీపంలోని మరో పరిశ్రమలో అద్దాలు పగిలాయి. చెరివి గ్రామంలో ఇళ్ల తలుపులు, అద్దాలు, వస్తువులు కిందపడి విరిగాయని స్థానికులు చెబుతున్నారు.
ప్రమాదానికి ముందు బాయిలర్ నిర్వహణ లేదా శుభ్రపరిచే పనులు జరిగినట్లు, ఆవిరి బయటకు వెళ్లే పైపులు, వాల్వుల స్థితిపై అనుమానాలు ఉన్నట్లు కార్మిక వర్గాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. తగినంత నీరు లేకపోవడం ప్రమాదానికి కారణమై ఉండవచ్చన్న ఆందోళన కూడా ఉంది. ఇవి విచారణలో నిర్ధారించాల్సిన అంశాలు. నిర్వహణ పత్రాలు, తనిఖీ రికార్డులు, బాయిలర్ పీడన వివరాలు, కార్మికుల వాంగ్మూలాలను సేకరించి నిజానిజాలు బహిర్గతం చేయాలి.
బాయిలర్స్ చట్టం, దాని కింద రూపొందించిన నిబంధనల ప్రకారం బాయిలర్ భద్రత, తనిఖీ, ధ్రువీకరణకు నిర్దిష్ట ప్రక్రియ ఉంది. బాయిలర్ కాల పరిమితి ముగిసినప్పుడు దాని పునరుద్ధరణ కోసం తనిఖీ చేయాలి. భద్రతా వాల్వులు, పీడన సూచికలు, నీటి మట్టం చూపే సూచికలు సహా పరికరాల పని తీరును సాంకేతికంగా పరిశీలించడం అత్యవసరం. మరమ్మతుల తర్వాత అర్హతగల సాంకేతిక నిపుణుల పర్యవేక్షణ లేకుండా బాయిలర్‌ను ప్రారంభించడం కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడటమే.
2023 జనవిశ్వాస్ చట్టం బాయిలర్స్ చట్టంలోని కొన్ని ఉల్లంఘనలకు వర్తించే శిక్షలను జరిమానాలుగా మార్చింది. 2025లో వచ్చిన కొత్త బాయిలర్స్ చట్టం తనిఖీ, సర్టిఫికెట్, ప్రమాద విచారణ నిబంధనలను కొనసాగిస్తూనే ప్రమాదాలు జరిగితే ఆ ప్రమాదాలకు కారకులను నేర పరిధి నుంచి తప్పించారు. పైగా బాయిలర్ పేలుడు బాధ్యత అమాయకులైన కార్మికులదే. ఈ చట్టాన్ని ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ పేరిట తీసుకొచ్చింది. కానీ భద్రతా నిబంధనల ఉల్లంఘనలను ప్రధానంగా ఆర్థిక జరిమానాలతోనే ఎదుర్కోవడం, నిరోధక ప్రభావాన్ని బలహీనపరుస్తుంది. నిర్లక్ష్యం వల్ల ప్రాణ నష్టం జరిగితే, ఆర్థిక జరిమానాతో సరిపెట్టకుండా బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకునేలా చట్టాన్ని బలపరచాలి.
ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్టరీల తనిఖీ విభాగంలో 2023లో మంజూరైన పోస్టులు 53 కాగా, పనిచేస్తున్న సిబ్బంది 42 మంది మాత్రమేనని డైరెక్టరేట్ జనరల్ ఫ్యాక్టరీ అడ్వైజ్ సర్వీస్ అండ్ లేబర్ ఇన్ స్టిట్యూట్స్ (డి.జి.ఎఫ్.ఎ.ఎస్.ఎల్.ఐ) గణాంకాలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఫ్యాక్టరీల ఇన్‌స్పెక్టర్ పోస్టులు 22 ఉండగా, ఏడు ఖాళీగా ఉన్నాయి. కేవలం 15 మంది మాత్రమే పనిచేస్తున్నారు. రాష్ట్రంలో 24,642 ఫ్యాక్టరీలు ఉన్నాయని ప్రస్తుతమున్న ఒక్కో ఇన్‌స్పెక్టర్‌పై సుమారు 1,643 ఫ్యాక్టరీల భారం పడుతుంది. డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ల 14 పోస్టుల్లో 12 మంది, జాయింట్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ల మూడు పోస్టుల్లో ఇద్దరే ఉన్నారు. డైరెక్టర్ పోస్టు ఒక్కటే ఉంది.
తిరుపతి జిల్లాలో అధికారికంగా సుమారు 1,800 పరిశ్రమలుండగా, వాటిలో దాదాపు 1,400 పరిశ్రమలు పని చేస్తున్నాయని చెబుతున్నారు. వాటిని క్రమం తప్పకుండా తనిఖీ చేయడానికి కనీసం 20 మంది ఇన్‌స్పెక్టర్లు అవసరమని అంచనా. ఇలాంటి పరిస్థితుల్లో తనిఖీ వ్యవస్థకు సరిపడా సిబ్బంది, వాహనాలు, సాంకేతిక నిపుణులు, స్వతంత్రంగా పని చేసే అధికారం కల్పించకుండా భద్రతను ఎలా నిర్ధారిస్తారు?
ప్రభుత్వం అమలు చేస్తున్న ఆన్‌లైన్ తనిఖీ విధానంలో కంప్యూటర్ ఎంపిక చేసిన పరిశ్రమలకే తనిఖీ కేటాయించే పరిస్థితి ఉంది. ప్రత్యేక ఆర్థిక మండలిలోకి ప్రవేశించాలంటే డెవలప్‌మెంట్ కమిషనర్ అనుమతి అవసరం. అధికారికి చట్టబద్ధ హక్కులు ఉన్నా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (‘వ్యాపార సౌలభ్యం’) పేరిట యాజమాన్యాలకు ఇచ్చే మినహాయింపులు... కార్మికుల భద్రతను తగ్గించకూడదు.
జాతీయ మానవ హక్కుల కమిషన్ 2023లో ప్రస్తావించిన డి.జి.ఎఫ్.ఎ.ఎస్.ఎల్.ఐ గణాంకాల ప్రకారం, 2017–2022 మధ్య నమోదైన ఫ్యాక్టరీల్లో ప్రతి రోజూ సగటున ముగ్గురు మరణించగా, పదకొండు మంది గాయపడ్డారు. ఈ గణాంకాలు నమోదైన ఫ్యాక్టరీల నుంచి వచ్చినవని, అసంఘటిత రంగంలోని కార్మికుల ప్రమాదాలు పూర్తిగా ఇందులో ఉండకపోవచ్చని కమిషన్ పేర్కొంది. ప్రమాదాలు కొనసాగుతున్నప్పటికీ తనిఖీలు, శిక్షలు, భద్రతా వ్యవస్థల్లో అవసరమైన మార్పులు ఎందుకు రావడం లేదు?
కార్మికుల ప్రాణాలకు విలువ లేదా?
ఇలాంటి ప్రమాదాల్లో కాంట్రాక్టు, వలస కార్మికులే ఎక్కువగా బలవుతున్నారు. శాశ్వత ఉద్యోగుల స్థానంలో కాంట్రాక్టు కార్మికులను తీసుకోవడం, తగిన శిక్షణ ఇవ్వకపోవడం, భద్రతా సమస్యలపై మాట్లాడితే ఉద్యోగం పోతుందనే భయం-కార్మికులను ప్రమాదానికి ఎదురుగా నిలబెడుతున్నాయి. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కార్మికులు చనిపోయినప్పుడు వారి కుటుంబాలకు పరిహారం ప్రకటించడం మాత్రమే న్యాయం కాదు. భద్రతా ఏర్పాట్లు ఎందుకు విఫలమయ్యాయి? యాజమాన్యం, పర్యవేక్షణ అధికారులు ఏ బాధ్యతను నిర్వర్తించలేకపోయారు? అన్నది తేల్చాలి.
శ్రీసిటీ లోని టిల్ హెల్త్‌కేర్ ప్రమాదంలో ఒక్కొక్క కుటుంబానికి ప్రకటించిన రూ.50 లక్షల సహాయం తక్షణ ఉపశమనమే. అది కంపెనీ, ప్రభుత్వాల బాధ్యతకు ముగింపు కాదు. ప్రతి కుటుంబానికి తగిన మొత్తం పరిహారం, కుటుంబ సభ్యుడికి ఉద్యోగం, గాయపడిన వారికి పూర్తి వైద్య ఖర్చులు, దీర్ఘకాలిక సహాయం కల్పించాలి.
ఈ ఘటన తర్వాత సిఐటియు కార్మికుల తరపున స్పందించి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. ఎంపీ, స్థానిక ఎమ్మెల్యే బాధితులను పరామర్శించినప్పటికీ, సిపిఎం మినహా ఇతర రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన కనిపించలేదు. శ్రీసిటీ ప్రతిష్టకు నష్టం కలుగుతుందనే కారణంతో ఘటన తీవ్రతను తగ్గించి చూపడం, పరిహారం ప్రకటించాం కాబట్టి అందరూ సంతృప్తి చెందాలనడం బాధితుల బాధను, ప్రజల ఆందోళనను యాజమాన్యం చిన్నచూపు చూడటమే.
ప్రమాదాల నివారణకు సమగ్ర ప్రణాళిక
ప్రమాదకర పరిశ్రమలు, భారీ ప్రమాద ముప్పు ఉన్న యూనిట్లను ముందుగానే గుర్తించి మ్యాపింగ్ చేయాలి. పరిశ్రమ లోపల, వెలుపల అమలు చేయాల్సిన అత్యవసర ప్రణాళికలు సిద్ధం చేయాలి. క్రమం తప్పకుండా నమూనా కసరత్తులు నిర్వహించాలి. అత్యవసర స్పందన కేంద్రాలు, అగ్నిమాపక సదుపాయాలు, శిక్షణ పొందిన సిబ్బంది, సమీపంలో తగిన వైద్య సదుపాయాలు కల్పించాలి. ప్రమాదం జరిగినప్పుడు పరిసర గ్రామాలకు వెంటనే హెచ్చరికలు చేరే వ్యవస్థ ఉండాలి.
నివాస ప్రాంతాలు, పాఠశాలలు, ఆసుపత్రులకు దూరంగా ప్రమాదకర పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. ఇప్పటికే జన సాంద్రత ఉన్న ప్రాంతాల్లో ఉన్న ప్రమాదకర యూనిట్లను సమీక్షించి, అవసరమైతే తరలించాలి. పరిశ్రమల పరిమితులు, అనుమతించిన ఉత్పత్తి సామర్థ్యం, భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటించేలా చూడాలి. ప్రమాద గుర్తింపు, ముప్పు అంచనా అధ్యయనాలు నిర్వహించి, లోపాలను ప్రమాదం జరగకముందే సరిదిద్దాలి.
బాయిలర్ పేలుడు సాంకేతిక లోపమా? నిర్వహణ నిర్లక్ష్యమా? అధికారుల పర్యవేక్షణ వైఫల్యమా? అన్నది ఆధారాలతో నిర్ధారించాలి. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుని, ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా స్వతంత్ర భద్రతా తనిఖీలు చేపట్టాలి. పరిశ్రమల అభివృద్ధి పేరుతో తనిఖీలను బలహీనపరచి, కార్మికుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే విధానాలకు పాలక ప్రభుత్వాలే బాధ్యత వహించాలి. పరిశ్రమల్లో లాభాలు పెరగాలి. అందుకోసం కార్మికుల ప్రాణాలు బలికావడం మాత్రం అభివృద్ధి కాదు.

వ్యాసకర్త : కందారపు మురళి
సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు, తిరుపతి,
సెల్:9490098840)







కామెంట్‌లు (0)