శుక్రవారం, 09 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకులాధిపత్యం నశించాలి...

1 గంట క్రితం

equality.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 09, 2026, 05:25 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

కడప జిల్లా కమలాపురం మండలం ఎర్రగుడిపాడులో శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలోకి దళితులను రానీయకుండా మాజీ సర్పంచ్‌ బ్రహ్మానందరెడ్డి అడ్డుకున్నారనీ, ఈ విషయం తెలిసి ప్రజాసంఘాలు ఉద్యమించి, జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్ళగా...అధికారులు దళితులకు ఆలయ ప్రవేశం కల్పించారనీ వార్తలు వచ్చాయి. దాంతో ఆ గ్రామంలోని ఆధిపత్యవాదులు ఆ గుడికి తాళం వేశారనీ, ఆ గుడిని దళితులకే వదిలేస్తామని వాదించారని కూడా తెలుస్తున్నది. బ్రహ్మానందరెడ్డిని అదుపులోకి తీసుకున్నారని కూడా తెలుస్తున్నది. ఇంతవరకు ప్రభుత్వం బాధ్యతాయుతంగానే ప్రవర్తించినందుకు అభినందనలు. ఉద్యమించి ఈ అన్యాయాన్ని బహిర్గతపరిచిన ప్రజాసంఘాలకూ అభినందనలు.

భారతదేశంలో దళితులు రాష్ట్రపతులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, మంత్రులు, చట్టసభలలో సభ్యులు, జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి అధికారులూ అవుతున్నారు. భారత రాజ్యాంగ నిర్మాతగా గుర్తించి, మనం భారతరత్న బిరుదమిచ్చి గౌరవిస్తున్న డా. బి. ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో దళితులు చదువుకుంటున్నారు. ఆయన దళితులకు దేవాలయ ప్రవేశం కోసం నడిపిన ఉద్యమం ఇటీవల బాగా ప్రచారంలోకి వచ్చింది. విభిన్న సామాజిక రంగాలలోకి దళితులు ప్రవేశిస్తున్నారు. తమకు అన్యాయం జరిగినప్పుడు, తమకు అవమానం జరిగినప్పుడు దళితులు ఉద్యమిస్తున్నారు. దళితులు వివక్షకు గురైనప్పుడు, దళితుల మీద దౌర్జన్యం జరిగినప్పుడు, దళితుల ఆత్మగౌరవానికి భంగం కలిగినప్పుడు వారికి రక్షణగా ఎస్. సి, ఎస్. టి అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అమలులో ఉంది. దళితులను అవమానించిన వారికి శిక్షలు పడుతున్నాయి. అయినా ఎర్రగుడిపాడు గ్రామ పెత్తందార్లకు ఇంకా కళ్ళు మూసుకునే ఉన్నట్లుంది. ఆ గ్రామంలోని ఆధిపత్య కులాల వాళ్ళందరూ ఈ దుర్మార్గానికి మద్దతు ఇచ్చారనుకోలేం. దళితులను ఆలయంలోకి రానీయకుండా అడ్డుకున్నది ఒక మాజీ సర్పంచ్‌ బ్రహ్మానందరెడ్డి. ఆయన సర్పంచ్‌గా ఎన్నికైనప్పుడు రెడ్ల ఓట్లతోనే గెలిచారా? ఆయనను సర్పంచ్‌గా ఎన్నుకున్న వార్డు సభ్యులు దళితుల ఓట్లు లేకుండానే గెలిచారా? సర్పంచి పొలాలు దళితుల శ్రమ లేకుండానే పండుతున్నాయా? ఆయన పశువులు చనిపోతే, ఎవరు తీసివేస్తున్నారు. ఆయన ఇంట్లోవాళ్ళు కన్నుమూస్తే ఎవరు అంత్యక్రియలు చేస్తున్నారు? ఆ గ్రామంలో దేవర (జాతర) దళితులు లేకుండా జరుపుతున్నారా? అన్ని పనులూ దళితులు చేయాలి. వాళ్ళు గుళ్ళోకి మాత్రం రాకూడదా? బ్రహ్మానందరెడ్డి వంటి వారు ఇప్పుడైనా ఆలోచించాలి. ఎర్రగుడిపాడు గ్రామప్రజలు - అన్ని కులాల వాళ్ళూ ఆలోచించాలి. అక్కడ జరిగిన సంఘటన ఆ గ్రామ మర్యాదలకు భంగకరం కాదా? సమాజం ఎంత మారిందో కనిపించడం లేదా? చెన్నకేశవస్వామి దళితులను గుడిలోకి రానీయొద్దని బ్రహ్మానందరెడ్డి వంటి వారికి చెప్పాడా? గ్రామ పద్ధతి అని ఎవరో వాదిస్తున్నారు. నిజమే ఒకప్పుడు గ్రామాలలో దుర్మార్గమైన పద్ధతులు ఉండేవి. వాటికి కాలం చెల్లింది. ఇప్పుడు ఆ పద్ధతులు చెల్లవు. ఇప్పుడు మనకు రాజ్యాంగం ఉంది. అది కులపరమైన వివక్షను ఆమోదించదు.

ఎర్రగుడిపాడు గ్రామం పేరు ఇప్పుడిప్పుడే ప్రచారంలోకి వస్తున్నది. అక్కడ తొలి తెలుగు శాసనం ఉందని ఆ గ్రామానికి ప్రత్యేక గుర్తింపు వస్తున్నది. తాళ్ళపాక అన్నమయ్య, యోగి వేమన, పోతులూరి వీరబ్రహ్మం వంటి సామాజిక విప్లవ కవులు నడయాడిన ప్రాంతంలోనే ఎర్రగుడిపాడు గ్రామం ఉండేది. బ్రహ్మానందరెడ్డి వంటి వాళ్ళు చరిత్రను చదువుకోవాలి. గ్రామానికి చెడ్డ పేరు తేవద్దు. గ్రామం మారాలి. ఇంకెంత కాలం పంజరం పాలన చేస్తారు? గ్రామ సర్పంచిగా పని చేసిన వ్యక్తి ఇంత వెనుకబడి ఉండవచ్చునా? ఎప్పుడో ఎవడో ఏర్పాటు చేసిన పద్ధతులు అలాగే కొనసాగాలంటే బ్రహ్మానందరెడ్డి వారసులెవరూ చదువుకోవడానికి హక్కు లేదు. ఆయన సంతానం చదువుకోలేదా? ఆ హక్కు ఎలా వచ్చింది? పద్ధతులు మారడం వలన వచ్చింది. మీకు పద్ధతులు మారాలి, దళితులకు పద్ధతులు మారకూడదా?

క్రీ.శ. 15వ శతాబ్దంలోనే కడప జిల్లా నుండే పద కవితా పితామహుడు తాళ్ళపాక అన్నమాచార్యులు కుల సమానత్వ నినాదం చేశారు. అన్నమయ్య కన్నా ఎక్కువ భక్తుడా బ్రహ్మానందరెడ్డి? దేవుడు అందరివాడని అన్నమయ్య చాటి చెప్పాడు. "కులమెంత గలిగెనది కూడించు గర్వంబు" అని ఆనాడే కులాధిపత్యాన్ని ఆయన గర్హించారు. "జాతులన్నిట నాత్మ సర్వేశ్వరుడు" అని బోధించారు." ఏ కులజుడేమి? యెవ్వడైననేమి ఆకడ నాతడే హరి నెరిగినవాడు" అని భక్తులంతా ఒక్కటే అని బుద్ధి చెప్పారు. బ్రహ్మమొక్కటే" అని నినదించారు. "మెండైన బ్రాహ్మణుడు మెట్టుభూమియొకటే చండాలుడుండేటి సరిభూమియొకటే" అని తీర్పునిచ్చాడు.

" ఉర్వివారికెల్ల ఒక్క కంచముబెట్టి / కులము పొలయజేసి పొత్తు గుడిపి /తలనుచెయ్యిబెట్టి తగనమ్మజెప్పరా విశ్వదాభిరామ వినురవేమ! అని ప్రజాకవి వేమన 17వ శతాబ్దంలోనే కుల నిర్మూలనకు పిలుపునిచ్చారు.

"కులము హెచ్చుతగ్గు గొడవలు పనిలేదు/ సానుజాతమయ్యె సకలకులము /హెచ్చుతగ్గు మాటలెట్లెరుంగగ వచ్చు/ విశ్వదాభిరామ వినురవేమ" అని కుల సమానత్వాన్ని ప్రచారం చేశాడు. ఆయన సంచార కవి. బహుశా ఆయన ఎర్రగుడిపాడులో కూడా తిరిగే ఉంటాడు. ఆయనే పద్ధతులు మారాలన్నాడు.

"మాలవానినేల మరిమరీ నిందింప /ఒడల రక్తమాంసమొకటిగాదె /వానిలోన మెలగువాని కులంబేది?" అని ఆనాడే మహాకవి ప్రశ్నించాడు. ఆ ప్రశ్న బ్రహ్మానందరెడ్డి వంటి వాళ్ళకు ఇంకా జీర్ణం కాలేదు. కడప జిల్లా పోరుమామిళ్ళ దగ్గర బ్రహ్మంగారి మఠం నుంచి కాలజ్ఞానాన్ని ప్రపంచమంతా ప్రచారం చేసిన భవిష్య తత్వవేత్త పోతులూరి వీరబ్రహ్మం.

" కులము గోత్రమంచు కూసెడిమలపల /కర్మ ఫలము ముందు కట్టికుడుపు /బ్రాహ్మమందగలరు వర్ణాదులను వీడ " అంటూ కులం నుంచి ప్రజలను దూరం జరగమన్నారు. అంతేకాదు" కులమ నేటి తెగులు కొంపలు కూల్చును" అని ఆనాడే హెచ్చరించారు. ఇవేవీ బ్రహ్మానందరెడ్డి వంటి వారికి వినబడలేదు. కడప జిల్లాకే చెందిన ఆధునిక కవి, అభ్యుదయ కవి గజ్జెల మల్లారెడ్డి ఎర్రగుడిపాడును తప్పకుండా ఎప్పుడో ఒకప్పుడు సందర్శించే ఉంటారు. ఆయన కడప జిల్లా లోని రామన్న పల్లిలో భూస్వాములు దళితులు గుడిసెలను తగలబెట్టినపుడు " నిప్పుతో చెలగాటం" అనే కవిత రాశారు. " నిప్పుతోడ చెలగాటమాడితే / ముప్పులు తిప్పలు తప్పవురా! /బలవంతుడ నాకెదురులేదని /పడగవిప్పి బుస కొట్టకురా!/తరతరాల దోపిడి మీదను/తిరుగుబాటు చెలరేగునురా! అని హెచ్చరించారు. కడప జిల్లా ప్రజా కవులు ప్రజల పక్షం వహించి చేసిన బోధనలను ఆధిపత్య కులవాదులు ఇప్పుడైనా తెలుసుకోవాలి. జిల్లా అధికారులు సాంఘిక వివక్షా నిర్మూలనానికి నడుం బిగించాలి. ఎర్రగుడిపాడు గ్రామంలో జరిగిన సంఘటనలు మరో చోట జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.

" మనిషి చేసిన రాయిరప్పకు /మహిమ కలదని సాగి మొక్కుతు /మనుషులంటే రాయిరప్పల కన్న కనిష్టంగ /చూస్తావేల బేలా?" " వర్ణధర్మమధర్మధర్మంబే" ( గురజాడ అప్పారావు.) "వాని గాలిసోక కసరి బుసకొట్టు నాల్గు పడగల హైందవ నాగరాజు" ( గుర్రం జాషువ)

RACHAPALEM_1.jpg

వ్యాసకర్త : రాచపాళెం చంద్రశేఖర రెడ్డి

ప్రజాశక్తి బుక్‌‌హౌస్‌ ‌గౌరవ సంపాదకులు


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్