- వి. రాంభూపాల్
ఎన్నికల రూపంలో ప్రజాస్వామ్య స్ఫూర్తి వ్యక్తమవుతుంది. రాజరిక వారసత్వ పాలన రద్దయి ఎన్నికల ద్వారా పాలకులను ఎన్నుకోవడమనేది ఆధునిక సమాజం సాధించిన పురోగతి. ప్రస్తుత ఎన్నికల వ్యవస్థలో ఉన్న అనేక లోపాలను సరిదిద్దుకుంటూనే దానిని కాపాడుకోవడం అవసరం. భారత రాజ్యాంగం ఎన్నికల కమిషన్‌కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి దాని విధివిధానాలను రూపొందించింది. పాలక పార్టీలు అన్ని వ్యవస్థలను తమ ప్రయోజనాలకు ఉపయోగించుకున్నట్లే ఎన్నికల వ్యవస్థను కూడా అనేక సందర్భాల్లో దుర్వినియోగం చేశాయి. రాజ్యాంగబద్ధంగా స్వతంత్రంగా వ్యవహరించాల్సిన భారత ఎన్నికల సంఘం 2014 తర్వాత వరుస వివాదాల్లో కూరుకుపోయింది. తాజాగా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పై వచ్చిన ఆరోపణలు భారత ఎన్నికల సంఘం (ఇసిఐ) విశ్వసనీయతనే ప్రశ్నార్థకంగా మార్చాయి. మెజారిటీ నిర్ణయానికి భిన్నంగా, కేంద్ర పాలకుల రాజకీయ, మతతత్వ ప్రయోజనాల కోసం జ్ఞానేష్ కుమార్ వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యానికి తీవ్ర ప్రమాదంగా మారింది. ముగ్గురు సభ్యుల కమిషన్‌గా వున్న ఎన్నికల సంఘానికి ప్రధాన కమిషనర్ (సిఇసి)గా జ్ఞానేష్ కుమార్, కమిషనర్లుగా సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి ఉన్నారు. అస్సాంలో మొదలై బీహార్, పశ్చిమ బెంగాల్‌తో ఉధృతమై ప్రస్తుతం దేశవ్యాప్తంగా సాగుతున్న ప్రత్యేక ఓటర్ల సవరణ (సర్) సుమారు 13 కోట్ల మంది పౌరుల ఓటు హక్కును ప్రమాదంలో పడవేసింది. ఈ ‘సర్’ తో పాటు, కొత్త ఓటర్లను నమోదు చేసే విధానంలో మార్పులు, ఓటర్ల జాబితాల భద్రత వంటి విషయాలపై జ్ఞానేష్ కుమార్ కమిషన్ సభ్యుల అభిప్రాయాలకు భిన్నంగా ఏకపక్షంగా వ్యవహరించాడని ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ఆధారాలతో బయటపెట్టింది. గత 10 నెలల్లో కనీసం 14 సార్లు కమిషనర్లు సంధు, జోషిలు వివిధ అంశాలపై అభ్యంతరాలు చెప్పినా వారికి తెలియకుండానే జ్ఞానేష్ కుమార్ పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నియంతృత్వ చర్యలను సహించలేని ఆ ఇద్దరు కమిషనర్లు భారత ప్రభుత్వంలోని అత్యున్నత అధికారి అయిన ప్రధాన కార్యదర్శికి విడివిడిగా ఫిర్యాదు చేసారంటే ప్రమాదం ఎంత స్థాయికి చేరిందో స్పష్టమవుతుంది.
ఎవరీ జ్ఞానేష్ కుమార్ గుప్తా ?
బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ కోర్ ఎజెండా ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామమందిర నిర్మాణంతో పాటు, సహకార వ్యవస్థను గుజరాత్ తరహాలో కేంద్రీకృతం చేయడంలో జ్ఞానేష్ కుమార్ గుప్తా కీలక పాత్ర పోషించారు. బిజెపి కేంద్రంలో అధికారం చేపట్టిన నాటి నుండి మోడీ, షా లతో అత్యంత సన్నిహితంగా మెలుగుతూ, ఎదుగుతూ ప్రధాన ఎన్నికల కమిషనర్ స్థాయికి చేరారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన ఈయన 1988 బ్యాచ్‌కు చెందిన కేరళ క్యాడర్ ఐఎఎస్ అధికారి. 2014కు ముందు వరకు కేరళంలో పనిచేసిన ఈయన మోడీ ప్రధాని అయిన తర్వాత కేంద్ర సర్వీసుల్లోకి వచ్చారు. రక్షణ మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో సెక్రటరీగా పనిచేశారు. కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 తొలగింపునకు అవసరమైన చర్యలను రూపొందించిన కమిటీలో ఈయన ఉన్నారు. అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఆలయ నిర్మాణం కోసం ఏర్పడిన రామ మందిర్ ట్రస్ట్ ప్రారంభ కమిటీలో కేంద్రం ఎంపిక చేసిన ఎక్స్-అఫీషియో సభ్యుడిగా, దాని ఏర్పాటులో ఆయన భాగస్వామిగా ఉన్నారు. వ్యవసాయ శాఖ కింద ఉన్న సహకార వ్యవస్థను హోంశాఖ కిందకు బిజెపి ప్రభుత్వం తీసుకవచ్చింది. అమిత్ షా నాయకత్వంలో దేశంలోని సహకార సంఘాలను కేంద్రం ఆధీనంలోకి తీసుకురావడానికి ‘బహుళ రాష్ట్ర సహకార సంఘాల (సవరణ) చట్టం, 2023-ను జ్ఞానేష్ కుమార్ రూపొందించారు.
పాలకుల అండదండలతో 2025 ఫిబ్రవరి 19న జ్ఞానేష్ కుమార్ 26వ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ అయ్యారు. ఈయన ఈ బాధ్యతలు చేపట్టడానికి కొద్ది రోజుల ముందే ప్రధాన కమిషనర్ ఎన్నికకు సంబంధించిన కీలక చట్ట సవరణలు జరిగాయి. న్యాయ నిపుణులు అందించిన నివేదిక ఆధారంగా దేశ ప్రధాని, ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన కమిటీ కమిషనర్‌ను ఎంపిక చేసే విధానం ఉండేది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించి కేంద్ర క్యాబినెట్ మంత్రిని ఈ కమిటీలో చేర్చారు. దీని ప్రకారం ప్రస్తుతం మోడీ, అమిత్ షా, రాహుల్ గాంధీ ఎంపిక కమిటీలో ఉన్నారు. ఎన్నికల కమిషనర్‌ను మెజారిటీ నిర్ణయం ప్రకారమే ఎంపిక చేసామనే మాటకు అర్థం ఏముంది? ఈ సవరణ చేసిన కొద్ది రోజులకే అప్పటి వరకు ఎన్నికల కమిషనర్‌గా ఉన్న అరుణ్ గోయల్ 2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు కొన్ని గంటల ముందు ఆకస్మికంగా రాజీనామా చేయడం, రాష్ట్రపతి ఆమోదించడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఈ రాజీనామా వెనుక బలమైన కారణాలున్నట్లు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు రుజువు చేస్తున్నాయి. అరుణ్ గోయల్ స్థానంలో జ్ఞానేష్ కుమార్ నియమించబడ్డారు. దీనిపై ఎంపిక కమిటీ సభ్యుడుగా ఉన్న రాహుల్ గాంధీ తీవ్రమైన అభ్యంతరాలను రాతపూర్వకంగా ఇచ్చినా ఖాతరు చేయలేదు. ఆ తర్వాత కొద్ది నెలలకు ప్రధాన కమిషనర్ గడువు ముగియడం ఆ స్థానంలో జ్ఞానేష్ కుమార్ కూర్చోవడం చకచకా జరిగిపోయాయి.
ఇంతటితోనే బిజెపి లక్ష్యం పూర్తి కాలేదు. జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు చెపట్టే నాటికే ప్రధాన ఎన్నికల కమిషనర్ తీసుకున్న నిర్ణయాలను, విధానాలను భవిష్యత్తులో సమీక్షించడం కానీ, పదవీ విరమణ తర్వాత ఆయనను విచారించడం కానీ, క్రిమినల్ చర్యలు తీసుకోవడం కానీ చేయరాదని చట్ట సవరణ చేశారు. ఇది ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ప్రమాదంలో వేసే అత్యంత తీవ్రమైన చర్య. ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలు వివాదాస్పదంగా మారాయి. మహారాష్ట్రతో పాటు ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అత్యంత పక్షపాతంతో ఎన్నికల కమిషన్ బిజెపి వైపు మొగ్గింది. పశ్చిమ బెంగాల్‌లో బిజెపి గెలవడంలో ఎన్నికల కమిషన్ కీలక పాత్ర పోషించిందనే విమర్శలకు కారణమైంది. ఇటీవల ఎన్నికల కమిషన్ తీసుకున్న ఓటర్ల సవరణ దేశవ్యాప్తంగా పెద్ద కలకలమే సృష్టించింది. ఓటర్లు పాలకులను ఎన్నుకోవడం కాకుండా, పాలకులే ఓటర్లను ఎన్నుకునే విధంగా ‘సర్’ ప్రక్రియ నడుస్తుంది. ఇందులో మతతత్వ ఎజెండా కూడా ఉంది. బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్‌తో పాటు అనేక కీలక రాష్ట్రాల్లో సుమారు కోటి మంది ఓటర్లను తొలగించి ఎన్నికలకు ముందే బిజెపి గెలవడానికి కావలసిన పిరిస్థితులను ఎన్నికల కమిషన్ సృష్టించింది. ఇందులో జ్ఞానేష్ కుమార్ పాత్ర కీలకమైంది.
ఎన్నికలసంఘం ప్రధాన కమిషనర్ నియామక బిల్లు-2023 పార్లమెంట్‌లో చర్చకు వచ్చినప్పుడు సిపిఎం రాజ్యసభ సభ్యుడుగా నాటి ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తీవ్రంగా ప్రతిఘటించారు. ప్రధాన కమిషనర్ ఎంపిక కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తి వుండాలనే సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్ధంగా ఈ సవరణ ఉందని, ఇది అంతిమంగా ప్రభుత్వ గుత్తాధిపత్యానికి దారితీసి, ఎన్నికల సంఘం యొక్క స్వతంత్రతను దెబ్బ తీస్తుందని ఆయన హెచ్చరించారు. ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో ఇది రుజువైంది. ఎన్నికల కమిషన్ వ్యవహారశైలి బిజెపి విజయానికి ఎలా తోడ్పడుతుందో తెలియచెప్పే అనేక ఘటనలను ప్రతిపక్షాలు వెలుగులోకి తెచ్చాయి. రాహుల్ గాంధీ, ఇసిఐ కి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ బీహార్ లో ‘ఓటర్ అధికార్ యాత్ర’ (ఓటర్ హక్కుల యాత్ర) పేరుతో పాదయాత్ర చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికలలో రిగ్గింగ్ చేయడానికి అధికార భారతీయ జనతా పార్టీ (బిజెపి)తో ఇసిఐ కుమ్మక్కైందని ఆరోపిస్తూ, దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటకలోని ఒక పార్లమెంటరీ నియోజకవర్గంలో నకిలీ ఓటర్లు, చెల్లని చిరునామాలు, ఒకే ప్రదేశంలో బల్క్ రిజిస్ట్రేషన్లతో సహా లక్షకు పైగా ఓటర్లు ఉన్నారని తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలు రుజువు చేయాలి, లేదంటే దేశానికి క్షమాపణ చెప్పాలంటూ బిజెపి నాయకుని తరహాలో జ్ఞానేష్ కుమార్ సమాధానం ఇచ్చారు. ఓటరు లిస్టుల యాక్సెస్ సహచర కమిషన్ సభ్యులకే లేనప్పుడు ఆధారాలు చూపలేరనే ధైర్యంతోనే ఆయన ఈ రకంగా స్పందించారు.
రాజ్యంగబద్ధ సంస్థలన్నీ కేంద్ర పాలకులు స్వాధీనం చేసుకుని ఇష్టారీతిన దుర్వినియోగం చేస్తున్నారు. మోడీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత సిబిఐ, ఇ.డి, ఇన్‌కంటాక్స్ డిపార్ట్‌మెంట్ల ద్వారా ప్రతిపక్ష పార్టీల నాయకులను భయపెట్టి ఫిరాయింపులను ప్రోత్సహించారు. అప్రజాస్వామిక చట్టాల ద్వారా పౌరహక్కుల కార్యకర్తలను, ఉద్యమకారులను, చివరకు విశ్వవిద్యాలయ విద్యార్థులను తప్పుడు కేసుల్లో సంవత్సరాల కొద్ది జైళ్లల్లో పెట్టారు. ఎన్నికల కమిషన్ ద్వారా ప్రజాస్వామ్యానికే ప్రమాదం తెచ్చారు. వీటిని విశాల ఐక్యతతో ప్రతిఘటించకుండా రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేము.








కామెంట్‌లు (0)