బీజింగ్ : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌జాంగ్ ఉన్ చైనాలో పర్యటిస్తున్నారు. ఈ ఏడాదిలో ఆయన చైనాకు వెళ్లడం ఇదే మొదటిసారి. ఉత్తరకొరియా, చైనాల మధ్య కొత్తగా ప్రారంభించిన వంతెన మీదుగా ప్రయాణించిన కిమ్ ..డాండోంగ్‌కు చేరుకున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. దశాబ్దానికి పైగా ఆలస్యం అనంతరం ఈ నెల ప్రారంభంలో తెరుచుకున్న కొత్త యాలు నది వంతెన మీదుగా కిమ్ డాండంగ్‌కు చేరుకున్నారని చైనా మీడియా జిన్హువా తెలిపింది.
ఈ వంతెన రెండు దేశాల మధ్య వాణిజ్యం మరియు ప్రజల మధ్య సంబంధాలను సులభతరం చేస్తుందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ తెలిపారు. చైనా, ఉత్తర కొరియా (డిఆర్‌పికె) ఆమోదంతో ఈ వంతెన గురువారం అధికారికంగా రాకపోకల కోసం తెరిచినట్లు పేర్కొన్నారు. ఈ వంతెన ద్వైపాక్షిక వాణిజ్యాన్ని, ప్రజల మధ్య సహకారాన్ని పెంచుతుందని, అలాగే ఇరు దేశాల ప్రజల శ్రేయస్సును మెరుగుపరచడంలో సహాయపడుతుందని ఆమె తెలిపారు.
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ జూన్‌లో ప్యోంగ్యాంగ్‌ను సందర్శించారు. కిమ్‌తో సమావేశమైన కొన్ని నెలల తర్వాత ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఈ పర్యటన చేపట్టారు. వారి శిఖరాగ్ర సమావేశంలో, వాణిజ్యం, వ్యవసాయం, నిర్మాణం, సాంకేతిక రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించేందుకు చైనా సిద్ధంగా ఉందని జిన్‌పింగ్ పేర్కొనగా, చైనాతో సంబంధాలను అత్యంత కీలకమైన వ్యూహాత్మక ప్రాధాన్యతగా కిమ్ అభివర్ణించారు.
కిమ్ చివరిసారిగా 2025 సెప్టెంబర్‌లో బీజింగ్‌ను సందర్శించారు. జిన్‌పింగ్‌తో సమావేశమవడమే కాకుండా, పుతిన్, ఇతర విదేశీ నేతలతో కలిసి సైనిక కవాతును తిలకించారు.








కామెంట్‌లు (0)