గురువారం, 06 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

విద్యా వ్యాపారమే 'వికసిత్‌ భారత్‌ శిక్షా అధిష్ఠాన్‌' లక్ష్యం!

21 గంటల క్రితం

VBSA
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 06, 2026, 05:14 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

​భారతదేశాన్ని విద్యా రంగంలో ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వికసిత్‌ భారత్‌ శిక్షా అధిష్ఠాన్‌ (వి.బి.ఎస్‌.ఎ.) బిల్లును తీసుకువచ్చింది. గతంలో చర్చకు వచ్చిన భారత ఉన్నత విద్యా కమిషన్‌ బిల్లు స్థానంలో దీనిని ప్రవేశపెట్టారు. జాతీయ విద్యా విధానం 2020 ఆశయాలకు చట్టబద్ధమైన రూపాన్ని కల్పిస్తూ రూపొందించిన ఈ బిల్లు పార్లమెంట్‌ పరిశీలనలో ఉంది. ప్రస్తుతం భారతదేశంలో ఉన్నత విద్యను నియంత్రించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌, ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌, నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ వంటి వేర్వేరు విభాగాలు ఉన్నాయి. ఈ మూడింటిని విలీనం చేసి, ఒకే ఒక సుప్రీం నియంత్రణ సంస్థగా 'వికసిత్‌ భారత్‌ శిక్షా అధిష్ఠాన్‌'ను ఏర్పాటు చేయడం ద్వారా ఉన్నత విద్యా రంగాన్ని సమూలంగా సంస్కరించాలని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. ఉన్నత విద్యా రంగంలో ఈ బిల్లు కింద మూడు ప్రత్యేక మండళ్లను ఏర్పాటు చేయనున్నారు. విశ్వవిద్యాలయాల స్థాపన, లైసెన్సులు, మూసివేత వంటి వ్యవహారాలను రెగ్యులేటరీ కౌన్సిల్‌ చూసుకుంటుంది. విద్యా ప్రమాణాలు, పాఠ్య ప్రణాళికలు, అభ్యసన ఫలితాలను స్టాండర్డ్స్‌ కౌన్సిల్‌ నిర్దేశిస్తుంది. విద్యాసంస్థల నాణ్యతను అంచనా వేసి వాటికి రేటింగ్స్‌, అక్రిడిటేషన్‌ కౌన్సిల్‌ ఇస్తుంది.

ఈ బిల్లులో ఐదు ప్రధాన అంశాలున్నాయి. ఒకటి ప్రభుత్వ విద్యా సంస్థలకు ఇచ్చే నిధులలో 30 శాతం నిధులను వాటి పనితీరు, విద్యార్థుల ఉద్యోగాల రేటు, పరిశోధనా ఫలితాల ఆధారంగా కేటాయిస్తారు. రెండోది ప్రపంచంలో టాప్‌ ర్యాంకుల్లో ఉన్న విదేశీ విశ్వవిద్యాలయాలు భారతదేశంలో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేసుకోవడానికి అనుమతిస్తారు. మూడోది పి.హెచ్‌.డి. లేకపోయినా, సంబంధిత రంగంలో అనుభవం ఉన్న నిపుణులను ప్రొఫెసర్లుగా నియమించుకోవచ్చు. నాల్గోది డిగ్రీ విద్యార్థులందరికీ కనీసం ఆరు నెలల ఇంటర్న్‌షిప్‌ లేదా అప్రెంటిస్‌షిప్‌ తప్పనిసరి. ఐదోది, కేంద్ర ప్రభుత్వ నిర్ణయమే సర్వాధికారాలతో అంతిమమవుతుంది. ఈ బిల్లు ఉన్నత విద్యను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తుందని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ, అందులోని అంశాలు మాత్రం ఆందోళనకరంగా ఉన్నాయి.

​సెక్షన్‌ 15(3) ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సకల అధికారాలు సంక్రమించడంతో సమాఖ్యవాదం, విద్యాసంస్థల స్వయంప్రతిపత్తి దెబ్బతింటుంది. విద్య అనేది భారత రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో ఉంది. ఈ బిల్లు ద్వారా కేంద్రం రాష్ట్రాల అధికారాలను లాగేసుకుంటుందని, తద్వారా రాష్ట్ర విశ్వవిద్యాలయాలపై స్థానిక ప్రభుత్వాల పట్టు తప్పుతుందని ఆంధ్రప్రదేశ్‌, కేరళ, మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. బెనారస్‌ హిందూ యూనివర్సిటీ, ఐఐఎంలు, ఐఐటీల వంటి ప్రతిష్ఠాత్మక అత్యున్నత విద్యాసంస్థలు తమ అడ్మినిస్ట్రేటివ్‌, అకడమిక్‌ స్వేచ్ఛను కోల్పోతామని ఆందోళన చెందుతున్నాయి. ఎన్‌.డి.ఎ. పాలిత రాష్ట్రాలతో సహా తీవ్ర వ్యతిరేకత, ఆందోళనల నేపథ్యంలో ఈ బిల్లును లోతైన పరిశీలన కోసం జాయింట్‌ పార్లమెంటరీ కమిటీకి పంపారు. సవరించిన ఈ బిల్లును పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

​ఈ బిల్లు అమలులోకి వస్తే ఉన్నత విద్యలో సమూల మార్పులు చోటు చేసుకుంటాయి. విద్య పౌరుల ప్రాథమిక హక్కు. కానీ ఈ బిల్లు విదేశీ విశ్వవిద్యాలయాలకు ద్వారాలు తెరవడం ద్వారా విద్యా రంగాన్ని ఒక లాభదాయకమైన మార్కెట్‌గా మారుస్తుంది. కార్పొరేట్‌, విదేశీ విద్యాసంస్థల రాకతో విద్య కేవలం డబ్బు ఉన్నవారికే దక్కే ఒక సరుకుగా మారిపోతుంది. ప్రైవేట్‌ పెట్టుబడులు పెరిగేకొద్దీ ఫీజులు భారీగా పెరుగుతాయి. దీనివల్ల సామాన్యులు, దళితులు, వెనుకబడిన వర్గాల పిల్లలు ఉన్నత విద్యకు పూర్తిగా దూరమయ్యే ప్రమాదం ఉంది. ఆరు నెలల నిర్బంధ ఇంటర్న్‌షిప్‌ లేదా అప్రెంటిస్‌షిప్‌ అనే నిబంధన విద్యార్థులకు క్షేత్రస్థాయి జ్ఞానాన్ని ఇవ్వడం కోసం కాక, కార్పొరేట్‌ కంపెనీలకు ఉచితంగా చౌక శ్రమశక్తిని సరఫరా చేయడం కోసమే. ప్రభుత్వ విద్యా సంస్థలకు ఇచ్చే నిధులను పనితీరు, ఉద్యోగాల రేటుతో ముడిపెట్టడం ద్వారా విశ్వవిద్యాలయాలు సామాజిక బాధ్యతను పక్కనపెట్టి, కేవలం ఉద్యోగాలను ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీలుగా మారే ప్రమాదం ఉంది. రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను, విశ్వవిద్యాలయాల స్వయంప్రతిపత్తిని లాగేసుకోవడం ద్వారా స్థానిక వెనుకబడిన వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా విద్యా విధానాలను రూపొందించే స్వేచ్ఛ లేకుండా పోతుంది. ప్రొఫెసర్ల నియామకానికి పి.హెచ్‌.డి. అవసరం లేదని చెప్పడం ద్వారా విద్యా రంగాన్ని విద్యావేత్తలు కాకుండా, బ్యూరోక్రాట్లు, పాలక వర్గాల ప్రతినిధులు శాసించే పరిస్థితి వస్తుంది.

​విభిన్న రాష్ట్రాలు, భిన్న సంస్కృతులు ఉన్న భారతదేశంలో విద్యా వ్యవస్థపై పూర్తి నియంత్రణను ఒకే ఒక కేంద్ర సంస్థ చేతుల్లో పెట్టడం కొన్ని కార్పొరేట్‌ వర్గాల ఆధిపత్యాన్ని సులభతరం చేయడం కోసమే. విశ్వవిద్యాలయాలు కేవలం సాంకేతిక నైపుణ్యాలను నేర్పేవి మాత్రమే కావు. అవి సమాజంలోని అసమానతలను ప్రశ్నించే, చైతన్యవంతమైన మేధావులను తయారుచేసే కేంద్రాలు. ఈ బిల్లు అటువంటి కేంద్రాలపైన, తద్వారా మేధోపరమైన సృజనాత్మకతపైన దాడిని ఎక్కుపెట్టింది. ప్రస్తుతం ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు ఒక రకమైన నిబంధనలు, ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాలకు మరో రకమైన నిబంధనలు ఉన్నాయి. కానీ ఈ బిల్లు ఈ భేదాన్ని పూర్తిగా తొలగిస్తుంది. అంటే ప్రభుత్వ నిధులు తగ్గి, ప్రైవేట్‌ సంస్థలతో పోటీ పడేలా ప్రభుత్వ సంస్థలు కూడా ఫీజులు వసూలు చేసుకోవాలన్నమాట. ఈ బిల్లు మార్కెట్‌ అవసరాలకు ఉపయోగపడే కోర్సులకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తుంది. సమాజాన్ని, పాలక వర్గాల విధానాలను ప్రశ్నించే సోషియాలజీ, హిస్టరీ, ఫిలాసఫీ వంటి సామాజిక శాస్త్రాలకు నిధులు తగ్గిపోతాయి. దీనివల్ల విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వం పోయి, వారు కేవలం పాలక వర్గానికి లొంగిపోయే నమ్మకమైన సేవకులుగా మిగిలిపోతారు. స్థూలంగా చెప్పాలంటే ''వికసిత్‌ భారత్‌ శిక్షా అధిష్ఠాన్‌'' బిల్లు ఉన్నత విద్యను ప్రజాస్వామ్యీకరించడానికి అని చెప్పిన తేనె పూసిన కత్తిలాంటిది. ఇది విద్యా రంగాన్ని కార్పొరేట్‌ శక్తులకు ధారాదత్తం చేయడానికి, సామాన్యుల పిల్లలను ఉన్నత విద్యకు దూరం చేయడానికి, పెట్టుబడిదారీ వ్యవస్థకు కావలసిన నైపుణ్యం గల జీతగాళ్లను సృష్టించడానికి పాలక వర్గాలు పన్నిన ఒక పెద్ద కుట్ర. ఇది విద్యపై రాష్ట్రాలకున్న హక్కులను, విద్యా సంస్థల స్వయంప్రతిపత్తిని హరించే రాజ్యాంగ వ్యతిరేక బిల్లు. మోదీ ప్రభుత్వ కార్పొరేట్‌ అనుకూల అనేక విధానాలలో భాగమే ఇది కూడా. దీని పర్యవసానాలను క్షుణ్ణంగా అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది.

ajasarma

- అజ శర్మ

ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్