‘‘దిమాగీ నక్సల్స్ అంటే ఏమిటండీ?’’ ఉదయాన్నే పేపర్ హెడ్‌లైన్స్ చూస్తున్న సతీమణి అడిగింది.
‘‘దిమాగ్ అంటే తెలివి. నక్సల్స్ అంటే నక్సలైట్లు.’’ అని అలవాటు ప్రకారం అనువాదం చేసి చెప్పేను.
‘‘ఆ పాటి నాకూ అనువాదం వచ్చులెండి. మోడీ గారు దిమాగీ నక్సల్స్ అని అనడం వెనుక భావం ఏమిటా అని?’’ రెట్టించిందావిడ.
‘‘తెలివిగల నక్సలైట్లు అని అనుకోవచ్చు. ’’ అన్నాను.
‘‘అంటే, తెలివి లేని నక్సలైట్లు అంటూ వేరే ఉన్నారని మోడీ భావిస్తున్నారా?’’ మళ్ళీ ప్రశ్న.
ఎందుకైనా మంచిదని వ్యూహాత్మక మౌనం (మోడీ మాదిరిగానే) పాటించేను. కాని ఆవిడ ఊరుకుంటేనా?
‘‘ఇంతకీ తెలివితేటలు ఉండడం మంచిదే కదా? అలా తెలివితేటలు ఉన్నవాళ్ళు ఎక్కువైపోతున్నారని మోడీ అనుకుంటున్నారా?’’
‘‘తెలివితేటలు ఉన్నవాళ్ళు ఎక్కువైతే అది మంచిదే కదా?’’ అని ఎస్కేప్ అవడానికి ట్రై చేశాను.
‘‘మరి అలా తెలివితేటలు ఉన్నవాళ్ళు ఎక్కువైపోతున్నారని, అదే దేశానికి పెద్ద సవాలుగా తయారైందని మోడీ ఎందుకు అనుకున్నారు?’’
మళ్ళీ వ్యూహాత్మక మౌనం పాటించేను.
‘‘అది కాదండీ, దేశం అభివృద్ధి చెందాలంటే మేధావులు, తెలివైనవాళ్ళు ఎక్కువమంది కావాలని కదా మనం అనుకుంటున్నాం? మరి తెలివితేటలు ఉన్నవాళ్ళు పెరిగిపోయారని ఇప్పుడు ఎందుకు వాపోతున్నట్టు?’’
‘‘అంటే, నక్సలైట్లలో తెలివితేటలు పెరిగిపోతున్నాయని అనుకుంటున్నాడేమో మరి’’ అని నసిగేను.
‘‘మరి ఈ మధ్యనే కదా, మార్చి 31 నాటికి దేశంలో నక్సల్ ప్రమాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టేశాం అని హోంమంత్రి ప్రకటించేడు? దాని ప్రకారం నక్సలైట్లు ఉనికిలో లేనట్టే కదా? ఉనికిలో లేనివారికి తెలివితేటలు పెరగడం ఏమిటండీ? ఇదేం లాజిక్ చెప్పండి?’’
ప్రశ్నకి సమాధానం చెప్పడం ఇష్టం లేనప్పుడు రివర్స్‌లో ప్రశ్న సంధించడమే కదా మోడీ నుంచి నేర్చుకున్న విధానం. అందుకే ‘‘ మరి మోడీ ఎందుకలా అన్నారో నువ్వే చెప్పు చూద్దాం’’ అన్నాను.
‘‘మన బుర్ర పని చేస్తున్నప్పుడే ప్రశ్నలు పుట్టుకొస్తాయి. ప్రజాస్వామ్యం సజీవంగా ఉన్నప్పడే ప్రజలు ప్రశ్నలు అడుగుతారు. పాలకులు వాటికి సమాధానాలు చెప్పితీరాలి. జవాబుదారీతనంతో ఉండాలి. మొన్న జంతర్ మంతర్ ఆందోళనలో దేవేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించింది కూడా ఆ జవాబుదారీతనం కోసమే. ఈ ట్రెండ్ కొనసాగితే ఇంకా ఎందరెందరు మంత్రులు రాజీనామా చేయాల్సి వస్తుందోనని కేంద్ర ప్రభుత్వంలో, ఎన్డీయే రాష్ట్ర ప్రభుత్వాల్లో గుబులు బయలుదేరింది. అందుకే మోడీ ఇలా మాట్లాడేరు’’ అంది శ్రీమతిగారు.
‘‘దానికి, దిమాగీ నక్సల్స్ అనడానికి సంబంధం ఏమిటయ్యా? నువ్వు మరీ చెప్తావు’’ అని రెట్టించేను.
‘‘అదే మరి! ఇప్పుడు కూరలో ఉప్పు ఎక్కువైందనుకో, నువ్వు ఎందుకు ఎక్కువ ఉప్పు వేసేవు అని నన్ను అడుగుతావు. నేనప్పుడు జడ్డి మొహం వేసుకుని నిలబడాలి. నువ్వు అడిగేముందే నిన్న ఆలస్యంగా ఇంటికి ఎందుకు వచ్చేవనో, కూరలు కొని తెచ్చినవాటిలో పుచ్చువి ఎందుకు ఉన్నాయనో నేను నిన్ను అడిగేననుకో. అప్పుడేం చేస్తావు? నోరెత్తకుండా కూరలో ఉప్పు ఎక్కువగా ఉన్నా మాట్లాడకుండా మింగుతావు. ’’
‘‘ఇదుగో మరి! మన ప్రేమ కథ ప్రపంచానికంతా తెలియాలా ఏమిటి? మోడీ స్పీచ్ గురించి చెప్పు’’ అనడిగేను.
‘‘అదేనయ్యా బాబూ! ప్రజలు తన ప్రభుత్వ వైఫల్యాల గురించి నిలదీసి అడగక ముందే ఆ ప్రజల్ని దిమాగీ నక్సల్స్ అని బెదరగొడితే నోరు మూసుకుని పడివుంటారు కదా! అదీ మోడీ ఎత్తుగడ. అందుకే కదా, గతంలో అర్బన్ నక్సల్స్ అని చెప్పి చాలా మందిని జైళ్ళలో పెట్టేరు! ఇప్పుడు దిమాగీ నక్సల్స్ అని జైలుకు పంపుతారు.’’
‘‘మరి అర్బన్ నక్సల్స్ పేరుతో జైళ్ళలో పెట్టిన తర్వాతే కదా జంతర్ మంతర్ ఆందోళన జరిగింది? ’’
‘‘అవును. జంతర్ మంతర్ ఆందోళన జరిగింది. రైతులు, కార్మికులు కూడా లక్షలాదిమంది ఆందోళనబాట పట్టేరు. ఇంకా ఆందోళనలు పెరుగుతాయి కూడా’’ అని ప్రకటించేసింది ఆమె.
‘‘మరి మోడీ సర్కార్ ప్రచారం ప్రభావం ఏమీ ఉండదా?’’
‘‘ఎందుకు ఉండదు? జనాల్లో దిమాగ్ పెరిగిందని ఆయనే కదా ఒప్పుకున్నాడు? తెలివితేటలు పెరిగితేనే నిజాలు తెలుస్తాయి. నిజాలు తెలిస్తే ఆందోళనల బాటే సరైనదని తెలుస్తుంది. అందుచేత మోడీ ఎర్రకోట ప్రసంగం అతగాడి భయాన్ని వెల్లడి చేస్తోందే తప్ప అది జనాన్ని భయపెట్టలేదు.’’ మరో డిక్లరేషన్.
‘‘ఇన్ని తెలిసినదానివి నన్ను ఎందుకు అడిగేవు?’’
‘‘ఆ! నీకేమైనా ఈ మధ్య దిమాగ్ కాస్తంతైనా పెరిగిందో లేదో చూద్దామని’’ అనేసి లోపలికి నడిచింది నా బెటర్ హాఫ్.
- సుబ్రమణ్యం







కామెంట్‌లు (0)