ఈ ప్రపంచ కప్ మనకి ఏమిచ్చింది? ట్రోఫీ వైపు పరుగెత్తే 48 జట్ల కథనా? కొన్ని గోల్సా? కొందరు కొత్త కథానాయకులా? కాదు. ఈ ప్రపంచ కప్ మనకో అద్దాన్ని ఇచ్చింది. ఆ అద్దంలో, ప్రపంచం తన రూపాన్ని తానే చూసుకుంది. భౌగోళిక-ఆర్థిక పటం, ఫుట్‌బాల్ పటం ఒక్కటి కావని అది గ్రహించింది. సరిహద్దులు, వలసలు, పాస్‌పోర్టులు, కార్పొరేట్ సంస్థలు, అప్పులు, చరిత్ర, జ్ఞాపకాలు – అన్నీ ఏదోలా ఒక బంతిలోనే జీవిస్తున్నాయని అది ఎరుక పరిచింది. అన్నింటికంటే ముఖ్యంగా, పేద దేశాలు ఇంకా సజీవంగానే వున్నాయని, పైగా అవి మునుపటి కంటే ఇప్పుడు మరింత వేగంగా పరిగెత్తగలవని ఈ ప్రపంచ కప్ మనకు గుర్తుచేసింది.
చాలా ఏళ్లుగా ప్రపంచ కప్ యూరప్, దక్షిణ అమెరికాల సొత్తుగా ఉండేది. మిగిలిన వారంతా కేవలం అతిథులే. అయితే, ఈ ప్రపంచ కప్ ఆ నిఘంటువులోని కొన్ని పేజీలను చించేసింది. 48 జట్లు పాల్గొంటున్న 2026 ప్రపంచ కప్‌లో తొమ్మిది ఆఫ్రికన్ జట్లు మొదటిసారిగా నేరుగా అర్హత సాధించాయి. దీనివల్ల ప్రపంచ కప్ నాణ్యత తగ్గిపోతుందని చాలామంది అన్నారు. కానీ మైదానంలోనే దానికి సమాధానం దొరికింది. వారు కేవలం కథలోని పాత్రలు మాత్రమే కాదు, ఆ కథను రాసే రచయితలుగా వచ్చారు.
ఒకప్పుడు చిన్న దేశాలు సూపర్ పవర్స్‌తో ఆడుతున్నప్పుడు, కెమెరా వారి కళ్లలో భయాన్ని వెతికేది. ఇప్పుడు కెమెరా అవతలి వైపున్న వారి కళ్లలో భయాన్ని వెతుకుతోంది. ఎందుకంటే ఫుట్‌బాల్ కొన్నిసార్లు చరిత్ర కంటే చాలా న్యాయమైనది. చరిత్రలో తరచూ సామ్రాజ్యవాదులే గెలిచారు. కానీ ఫుట్‌బాల్‌లో, కొన్నిసార్లు వలస పాలనకు గురైనవారు కూడా గెలుస్తారు.
ఆఫ్రికా ఎదుగుదల కేవలం ఫుట్‌బాల్ ఎదుగుదల మాత్రమే కాదు. ఇది చరిత్ర తీర్చుకుంటున్న పగ కూడా! ఒకప్పుడు ఆఫ్రికా నుండి బంగారాన్ని దోచుకెళ్లారు. వజ్రాలను తవ్వితీశారు. రబ్బరు, కోబాల్ట్, యురేనియంలను పట్టుకెళ్లారు. మనుషులను బానిసలుగా తీసుకెళ్లారు. ఈరోజు, వారి పిల్లలు యూరప్ మైదానాల్లో ఫుట్‌బాల్ ఆటగాళ్లుగా తిరిగి వచ్చారు. వారు చరిత్ర పుస్తకాల్లోకి తిరిగి రాలేదు, స్కోర్‌బోర్డ్‌పైకి తిరిగి వచ్చారు. ఏ ఖండం సంపదతోనైతే యూరప్ పారిశ్రామిక విప్లవాన్ని నిర్మించిందో, అదే ఖండానికి చెందిన బిడ్డలు ఈరోజు యూరోపియన్ ఫుట్‌బాల్‌కి అత్యంత విలువైన ఆస్తులుగా మారారు.
చరిత్రకు ఒక విచిత్రమైన అలవాటుంది. అది కొన్నిసార్లు తన అప్పులను వడ్డీతో సహా చెల్లిస్తుంది. ఒకప్పుడు ఆఫ్రికాను దోచుకోవడానికి యూరప్ నౌకలను పంపింది. ఈరోజు, ఆఫ్రికా పిల్లలు ప్రపంచ కప్‌లో యూరప్ కోసం గోల్స్ చేస్తున్నారు. ఎవరి బంగారంతో ఐరోపా బ్యాంకులు నిర్మించబడ్డాయో, ఆ ఖండపు పిల్లల కాళ్లపైనే ఈరోజు ట్రోఫీల కలలు నిర్మించబడుతున్నాయి. కొందరు దీనిని ప్రపంచీకరణ అంటారు. కొందరు వలసలు అంటారు. కొందరు శ్రామిక విపణి అంటారు. చరిత్ర నిఘంటువులో దానికి ఇంకో పేరు కూడా ఉంది – అదే ‘పునరాగమనం’.
అయితే ఈ ప్రపంచ కప్ కేవలం తిరుగుబాటు కథ మాత్రమే కాదు. ఇది డాలర్ల కథ కూడా. ఒకప్పుడు ఫుట్‌బాల్ పేదలకు గొప్ప విలాసంగా ఉండేది. ఒక గుడ్డ బంతి, రెండు ఇటుకలు, కాస్త ఖాళీ స్థలం... అంతే, ఆట మొదలయ్యేది. బంతి చవకైందే, కానీ కలలు మాత్రం చాలా విలువైనవి.
ఈ రోజు ఆ ఆట చుట్టూ బిలియన్ డాలర్ల గోడ నిర్మించబడింది. ఫిఫా నాలుగు సంవత్సరాల వాణిజ్య ఆదాయం ఇప్పుడు కొన్ని బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రపంచ కప్ బ్రాడ్‌కాస్ట్ హక్కులు, స్పాన్సర్‌షిప్, స్ట్రీమింగ్, డిజిటల్ కంటెంట్, లైసెన్సింగ్ – ఇవన్నీ కలిసి ఫుట్‌బాల్‌ను ప్రపంచంలోనే అతి పెద్ద వినోద పరిశ్రమలలో ఒకటిగా మార్చేశాయి. ఇప్పుడు ఒక గోల్ అనేది కేవలం గోల్ మాత్రమే కాదు, అదొక ప్రకటన, ఒక బ్రాండ్. దాని విలువను మార్కెట్ విలువతో కొలుస్తారు. ఒక వాటాదారు నవ్వు, ఒక బెట్టింగ్ క్లబ్‌లోని మద్యం చిమ్మే ఫౌంటెన్!
ఒకప్పుడు ఫుట్‌బాల్ క్రీడాకారులు నగరానికి కథానాయకులుగా ఉండేవారు. ఈరోజు వారు బహుళజాతి బ్రాండ్ల రాయబారులు. ఫుట్‌బాల్ ఇప్పటికీ పేదవాడి కలే, కానీ దాని యాజమాన్యం మెల్లగా సంపన్న వర్గాల చేతుల్లోకి వెళ్తోంది. రేవు పట్టణాలు, గనుల ప్రాంతాలు, ఫ్యాక్టరీ సెలవుల మధ్యాహ్నాలలో పుట్టిన ఈ ఆట, ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులు, డేటా అనలిటిక్స్, కార్పొరేట్ కన్సల్టింగ్ సంస్థల భాష మాట్లాడటం నేర్చుకుంటోంది.
ఈ ప్రపంచ కప్ మనకు మరొక సత్యాన్ని కూడా గుర్తుచేసింది. ఫుట్‌బాల్, రాజకీయం వేర్వేరు ఖండాలు కావు. రాజకీయాలను మైదానానికి దూరంగా ఉంచాలని ఫిఫా చాలా కాలంగా చెబుతోంది. కానీ ఫుట్‌బాల్ ఎప్పుడూ మైదానానికే పరిమితం కాలేదని చరిత్రకు తెలుసు. ముస్సోలినీకి ఆ సంగతి తెలుసు. ఫ్రాంకోకు తెలుసు. పినోచేకు తెలుసు. మిలిటరీ జుంటాలకు తెలుసు. కార్పొరేట్లకు తెలుసు. వారి దేశాలకు తెలుసు. ఫిఫాకు తెలుసు. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన భాషను రాజకీయం నుండి దూరంగా ఉంచడానికి ఎవరూ ఇష్టపడరు.
ఈ ప్రపంచ కప్‌లో ఇరాన్ ఆ సత్యానికి ఒక అసౌకర్యకరమైన జ్ఞాపకంగా నిలిచింది. ఇరాన్ ఆడింది. కానీ ఇరాన్ కేవలం ప్రత్యర్థులతో మాత్రమే ఆడలేదు. వారు సరిహద్దులతో, వీసాలతో, భద్రతా విధానాలతో, రాజకీయాలతో పోరాడవలసి వచ్చింది. మైదానంలో పదకొండు మంది ప్రత్యర్థులు ఉంటే, మైదానం బయట అంతకంటే ఎక్కువ మంది ప్రత్యర్థులు ఉన్నారు. అమెరికా వలస, భద్రతా విధానాలు ఇరాన్ అభిమానులు, విలేకరులు, ప్రతినిధుల ప్రయాణంపై, ఉనికిపై పరిమితులను సృష్టించాయి. ఇరాన్‌పై కఠినమైన వైఖరి తీసుకోవడానికి ఫిఫా తొందరపడింది. కానీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఫిఫా నిర్ణయాన్ని బహిరంగంగా వ్యతిరేకించినప్పుడు, ఆ కఠినత్వం చాలావరకు సడలిపోయింది. ఒకప్పటి విధానానికి చిహ్నంగా కనిపించిన రెడ్ కార్డ్...అధికార కారిడార్లలో వెలవెలబోయింది. నిబంధనల భాష ఇక అందరికీ ఒక్కటిగా లేదు. ఫుట్‌బాల్ నిబంధనల పుస్తకం కూడా కొన్నిసార్లు భౌగోళిక రాజకీయం నిఘంటువు నుండి సూచనలను అప్పుగా తీసుకుంటుందని మరోసారి నిరూపితమైంది.
ఇక్కడ సహజంగానే ఒక ప్రశ్న తలెత్తుతుంది: ప్రపంచ కప్ నిజంగా అందరి కోసమే అయితే, ప్రపంచంలోని పాస్‌పోర్టులన్నీ సమానమేనా? ఇది నిజంగా ఫుట్‌బాల్ ప్రపంచ కప్ అయితే, ప్రపంచ పౌరులందరూ ఈ పండుగలో సమానంగా పాల్గొనగలరా?
కానీ ఫుట్‌బాల్ ఇప్పటికీ కొన్ని గంటల పాటు ఈ అసమాన ప్రపంచాన్ని సమానం చేస్తుంది. బహుశా అందుకే ప్రజలు దాన్ని ఇప్పటికీ ప్రేమిస్తారు. ఈ ప్రపంచ కప్ మరొక విషయాన్ని కూడా చూపించింది. ఫుట్‌బాల్ ఆట పూర్తిగా ఆర్థిక సూత్రాల ప్రకారమే నడిస్తే, ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేశమే ఎల్లప్పుడూ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచేది. అప్పుడు స్టేడియంలతో పనే ఉండేది కాదు, ఒక బ్యాంకు ఖాతా సరిపోయేది! కానీ ఫుట్‌బాల్ అందం ఏమిటంటే అది ఆర్థిక సూత్రాలను పాటించదు. అది జిడిపి ని అనుసరించదు, మార్కెట్ విలువను పాటించదు, చరిత్రను అనుసరించదు. ఈ కారణాలన్నింటి వల్లే, ఫుట్‌బాల్ ఇప్పటికీ అగ్ర రాజ్యాలకు ప్రమాదకరమైనదిగా మారింది. ఎందుకంటే ఫుట్‌బాల్ మనుషులను సమానత్వం అనే కల కనేలా చేస్తుంది. చిన్నవారు కూడా గెలవగలరనే నమ్మకాన్ని ఇస్తుంది. అధికారం ఎల్లప్పుడూ గెలవదని ఫుట్‌బాల్ ప్రజలకు నేర్పుతుంది.
కార్పొరేట్లు ప్రసార హక్కులను కొనుగోలు చేయవచ్చు. స్టేడియం పేర్లను కొనుగోలు చేయవచ్చు. జెర్సీ పై భాగాలను కొనుగోలు చేయవచ్చు. అల్గారిథమ్‌లను, డేటాను కొనుగోలు చేయవచ్చు. కానీ వారు ఆ కలను ఇంకా కొనుగోలు చేయలేకపోయారు! ఎందుకంటే మార్కెట్ విలువ అంటే ఏంటో తెలియని వారు దక్షిణార్థ పేద దేశాలలో ఇప్పటికీ చాలా మంది ఉన్నారు! స్పాన్సర్‌షిప్ అంటే ఏంటో వారికి తెలియదు! బ్రాడ్‌కాస్టింగ్ హక్కులు అంటే ఏంటో తెలియదు! బంతిని తంతే అది దొర్లుతుందని మాత్రమే వారికి తెలుసు. ఆ దొర్లే బంతి వెనుక పరిగెడుతూ, మనుషులు కొన్నిసార్లు తమ స్వేచ్ఛను అందుకుంటారు.
ఏ ప్రపంచ కప్ ఇచ్చే గొప్ప బహుమతి అయినా ట్రోఫీ కాదు, జ్ఞాపకాలే. పేద దేశాలు ఇంకా మాట్లాడగలవని అది మనకు గుర్తుచేస్తుంది. ఆఫ్రికా, ఆసియా, మధ్యప్రాచ్యం కేవలం ముడి సరుకుల ఖండాలు మాత్రమే కావు, అవి ఫుట్‌బాల్‌కి కొత్త కేంద్రాలు కూడా! వలసదారుల బిడ్డలు ఇప్పటికీ చరిత్ర రాయగలరు. చిన్న జెండాలు ఇప్పటికీ పెద్ద వాటి పక్కన నిలబడగలవు. కార్పొరేట్లు ఇంకా అన్నింటినీ కొనేయలేదు.
బంతి ఇప్పటికీ గోల్ అవుతుంది. ఆ గోల్‌కి ఒక పాత అలవాటు ఉంది, అది ఎల్లప్పుడూ అధికార పీఠం దగ్గరే ఆగదు. అది కొన్నిసార్లు మొరాకో వైపు దొర్లుతుంది. కొన్నిసార్లు కాంగో వైపు, కొన్నిసార్లు కేప్ వెర్డే వైపు, కొన్నిసార్లు కాళ్లతో ప్రపంచాన్ని మార్చవచ్చని ఇప్పటికీ నమ్మే ఒక చిన్నారి వైపు దొర్లుతుంది. ఎందుకంటే మసకబారని మారడోనా, మెస్సీల కాళ్లు వారికి ఒక కల. ఎందుకంటే ఫుట్‌బాల్ అనేది పేద దేశాల పాదాల చప్పుడు! ఆ చప్పుడు ఇప్పుడు చాలా గట్టిగా వినిపిస్తోంది. చరిత్ర సుదీర్ఘ కారిడార్‌లో, చివరకు ఆ శబ్దం ఎంతో దూరం చేరుకుంటోంది.
ఈ ప్రపంచ కప్ కేవలం బలానికి సంబంధించిన కథ మాత్రమే కాదు. ఇది అసమానతల కథ కూడా. ఆఫ్రికా పురోగతి ఎంత ఆశ్చర్యపరిచిందో, ఈ ప్రపంచ కప్ ఆసియాకు ఆత్మపరిశీలన అద్దంగా నిలిచింది. జపాన్, దక్షిణ కొరియా తప్ప, చాలా ఆసియా దేశాలు యూరప్, దక్షిణ అమెరికాతో పోటీ పడే నిర్మాణం, దేశవాళీ లీగ్‌లు, సుదీర్ఘ ప్రణాళికలు లేదా ఫుట్‌బాల్ సంస్కృతిని ఇంకా అభివృద్ధి చేసుకోలేదు. కేవలం డబ్బు కుమ్మరించడం వల్ల ఫుట్‌బాల్ తయారవ్వదు; అది మైదానంలో, పరిసరాల్లో, పాఠశాలలో, క్లబ్‌లో, కోచ్ ఓపికతో, అభిమానుల విశ్వాసంతో తయారవుతుంది. జపాన్, దక్షిణ కొరియా చాలా ఏళ్లుగా ఆ దారిలోనే నడుస్తున్నాయి. మిగిలిన ఆసియా ఇంకా నిర్లక్ష్యానికి గురై, ఎంతో సుదీర్ఘమైన బాటను దాటాల్సి ఉంది.
ఫైనల్ గురించి, జట్టు గురించి వాదనలు ఉంటాయి, ఇష్టమైన ఆటగాడి పేరుతో అరుపులు ఉంటాయి, గోల్ కొట్టినప్పుడు ప్రపంచంలో 600 కోట్ల మంది కేరింతలు ఉంటాయి, ఓడిపోతే బాధ కూడా ఉంటుంది. కానీ వీటన్నింటికంటే మించి మనం గుర్తుంచుకోవాల్సింది – ఫుట్‌బాల్ మనందరిదీ!
ఫుట్‌బాల్ ప్రపంచంలోనే అత్యంత అందమైన ఆట, ఎందుకంటే ఇది ఇంకా పూర్తిగా మార్కెట్ చేతుల్లోకి వెళ్లలేదు. ఏ అల్గారిథమ్ కూడా ముందుగా ఊహించలేని విధంగా... సరైన చెప్పులు కూడా లేని ఒక చిన్నారి కాళ్లు ఇప్పటికీ బంతిని తాకగలవు. సందుల్లో ఉండే రెండు ఇటుకల గోల్ పోస్ట్‌లు బిలియన్ డాలర్ల స్టేడియంల కంటే పెద్ద కలలను ఇప్పటికీ సృష్టిస్తాయి. గ్యాలరీలలోని ప్రజలు పాడే పాటలు కార్పొరేట్ ప్రకటనల కంటే ఇప్పటికీ నిజంగా ధ్వనిస్తాయి.
కార్పొరేట్లు బ్రాడ్‌కాస్టింగ్ హక్కులను కొనుగోలు చేయవచ్చు. స్టేడియం పేర్లను కొనుగోలు చేయవచ్చు. జెర్సీ నంబర్లను కొనుగోలు చేయవచ్చు. ఆటగాళ్ల మార్కెట్ విలువను నిర్ణయించవచ్చు. కానీ వారు ప్రజల విస్మయాన్ని ఇంకా కొనుగోలు చేయలేదు. ఒక చిన్నారి మొదటిసారి బంతిని తన్ని – ‘ప్రపంచాన్ని మార్చడం నిజంగా సాధ్యమేమో’ అని నమ్మే ఆ క్షణాన్ని వారు కొనుగోలు చేయలేదు.
అందుకే ఫుట్‌బాల్ ఇప్పటికీ సామాన్యుడి ఆట. ఇది ఇప్పటికీ కార్మికుల ఆట. రైతుల ఆట. శరణార్థుల ఆట. రేవు పట్టణాలు, కొండ గ్రామాలు, ఎడారులు, మురికివాడల నుండి కూచ్ బెహార్ - కోల్‌కతా - కాక్‌ద్వీప్ లోని చిన్న ముక్క నేల నుండి కాసాబ్లాంకా వీధుల వరకు ఉన్న బిలియన్ల మంది ప్రజల ఆట!
అందుకే, పేద దేశాల వేలిముద్రలు, అడుగు జాడలు ఆగలేదు. పైగా, అవి మరింత బిగ్గరగా వినిపిస్తున్నాయి. పేద దేశాలంటే పటంలో అడుగున వున్నాయని కాదు. ఎవరి శ్రమతో ప్రపంచం సమృద్ధిగా మారిందో, సంపద, అధికార పంపిణీలో ఎవరికి అత్యల్ప వాటా లభించిందో ఆ ప్రజల భౌగోళిక ప్రాంతాలు! చరిత్ర వారిని చాలాసార్లు ఓడిపోయినట్లు రాసింది; కానీ ఫుట్‌బాల్ కొన్నిసార్లు ఆ చరిత్రను మారుస్తుంది. చరిత్ర సుదీర్ఘ కారిడార్లలో, అధికార ప్రాసాదాల గోడలకు ఆవల, మార్కెట్ సందడికి ఆవల — ఆ గొంతు ఇప్పటికీ చెబుతోంది, ప్రపంచాన్ని కొన్నిసార్లు కాళ్లతో కూడా మార్చవచ్చు.
( ‘గణశక్తి’ సౌజన్యంతో )









కామెంట్‌లు (0)