మంగళవారం, 22 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చప్పట్ల మాయాజాలం

45 నిమిషాల క్రితం

katha.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 04:14 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

ఒక రోజు తాతయ్య అర్జున్‌ని హైదరాబాద్‌లోని గోల్కొండ కోటకు తీసుకెళ్లాడు. కోటలోకి వెళ్లే పెద్ద దర్వాజా దగ్గరకు రాగానే, అక్కడ ఉన్న గైడ్ అందరితో ‘ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి’ అన్నాడు. అర్జున్ కొట్టాడు. అందరూ నవ్వుతుండగా, కొండ పైన దాదాపు ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న బాలా హిస్సార్ భవనం పైకి ఆ శబ్దం అలాగే వెళ్లి వినిపించింది! ‘తాతయ్యా! నా చప్పట్లు అక్కడికెలా వెళ్లాయి? ఇక్కడ ఏమైనా సూపర్ పవర్ ఉందా?’ అని అడిగాడు అర్జున్. ‘కాదురా.. ఈ కోటను కట్టిన వారు సూపర్ ఇంజినీర్లు’ అని చెప్పాడు తాతయ్య. ‘అర్థం కాలేదు తాతయ్య’ అన్నాడు అర్జున్.

ఈలోగా గైడ్ వచ్చి చప్పట్లు తిరిగి వినిపించడానికి గల కారణాన్ని వివరించాడు. ‘అలా వినిపించడానికి కారణం ప్రతిధ్వని. శబ్దం కూడా బంతి లాంటిది. బంతి గోడకేసి కొడితే వెనక్కి తిరిగి వస్తుంది. శబ్దం కూడా అలాంటిదే.. దీన్ని ప్రతిధ్వని అంటారు. చెవికి అసలు శబ్దం, తిరిగి వచ్చిన శబ్దం విడివిడిగా వినాలంటే కనీసం 0.1 సెకన్ గ్యాప్ ఉండాలి. అంటే గోడ కనీసం 17 మీటర్ల దూరంలో ఉండాలి. ఇక్కడ దూరం ఒక కిలోమీటరు. అయినా శబ్దం వినిపిస్తుందంటే.. ఫతే దర్వాజా పైకప్పును వంపు తిరిగిన డోమ్‌లా కట్టారు. మనం కొట్టిన చప్పట్ల శబ్ద తరంగాలు అన్ని వైపులా చెదిరిపోకుండా, ఆ డోమ్ వాటిని పోగుచేసి, కోట రాతి గోడల మీదుగా పైకి నెట్టుతుంది. ఆ గోడలు మళ్లీ మళ్లీ శబ్దాన్ని ముందుకు పంపుతాయి. పూర్వం కరెంటు లేదు, ఫోన్ లేదు కదా. శత్రువు వస్తే కింద కాపలాదారు చప్పట్లు కొడితే చాలు, కిలోమీటర్ పైన ఉన్న రాజుకి ‘ప్రమాదం వచ్చింది’ అని తెలిసిపోయేది. అంటే ఇది ఆ రోజుల్లో వైర్లెస్ అలారం సిస్టం అన్నమాట’ అని గైడ్ వివరంగా చెప్పాడు. అర్జున్ ఆశ్చర్యంగా మళ్లీ చప్పట్లు కొట్టాడు. ఈసారి అతనికి అది శబ్దంలా కాదు, 400 ఏళ్ల నాటి సైన్స్ పాఠంలా వినిపించింది.

నీతి : ప్రకృతిలో జరిగే ప్రతి ఘటన వెనుక ఒక సైన్స్ సూత్రం ఉంటుంది. దాని గురించి తెలుసుకుంటే మనకు సైన్స్ పరిశోధనల పట్ల ఆసక్తి పెరుగుతుంది.

- యం. రాం ప్రదీప్,

జెవివి రాష్ట్ర కమిటీ సభ్యులు,

94927 12836.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్