బుధవారం, 15 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionహర్మూజ్ కీలకం!

2 గంటల క్రితం

harmooj
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 15, 2026, 05:15 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

ఇరాన్ అణుబాంబులు తయారు చేస్తోంది గనుక నిరోధించేందుకు తాము దాడులకు దిగినట్లు అమెరికా అధినేత డోనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది మార్చిలో ప్రపంచాన్ని నమ్మించేందుకు చూశాడు. అంతకు ముందు 2025లో కూడా దాడులు చేసి అణు స్థావరాలను ధ్వంసం చేసినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ మరోసారి ఎనిమిది నెలలకే దాడులకు దిగాడు. ఫిబ్రవరి 28న పశ్చిమాసియాలో ఇరాన్‌పై దాడులతో ట్రంప్ రేపిన చిచ్చును ఆరనివ్వకుండా కొనసాగిస్తూనే ఉన్నాడు. జులై 11న మరోసారి ప్రారంభమైన దాడులు-ప్రతి దాడులు మంగళవారం నాడు ఇది రాసిన సమయానికి కొనసాగుతూనే ఉన్నట్లు వార్తలు. సంక్షోభాలు, యుద్ధాలు కొనసాగితే అమెరికా కార్పొరేట్లకు కాసుల పంట పండుతుంది. అందుకే అవి నిత్యం ఎక్కడో ఒక చోట చిచ్చు పెట్టేందుకు చూస్తుంటాయి.

అమెరికా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం హర్మూజ్ జలసంధిలో సురక్షిత నౌకా ప్రయాణానికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ఇరాన్‌కు అప్పగించారు. జూన్ 17న కుదిరిన ఒప్పందం ప్రకారం 60 రోజుల పాటు వాణిజ్య నౌకల రవాణా మీద ఎలాంటి సుంకాలు విధించకూడదు. దానిలో భాగంగా ఏ నౌక అయినా తమకు వివరాలు తెలిపి, తాము సూచించిన మార్గంలో ప్రయాణించాలని ఇరాన్ ప్రకటించింది. అయితే కొన్ని నౌకలు దీనికి భిన్నంగా ఎటువైపు వెళ్లేదీ తెలియనివ్వకుండా సంకేతాలను పంపే వ్యవస్థలను కట్టివేసి ప్రయాణిస్తుండటంతో అలాంటి నౌకలు హెచ్చరికలను ఖాతరు చేయకపోవటంతో ఇప్పటికి మూడు సార్లు కొన్ని నౌకల మీద ఇరాన్ డ్రోన్లతో దాడులు చేసింది. వాటిని సాకుగా చూపి అమెరికా పెద్ద ఎత్తున ఇరాన్‌పై బాంబుల వర్షం కురిపిస్తున్నది. దానికి ప్రతిగా గల్ఫ్‌లోని అమెరికా మిలిటరీ స్థావరాల మీద ఇరాన్ కూడా ధీటుగా ప్రతి దాడులు చేస్తున్నది. ఈ క్రమంలో ఇరాన్‌తో ఇంక చర్చలేవీ లేవన్న ట్రంప్ వెంటనే మాట మార్చి సాంకేతిక అంశాలపై ఉంటాయని చెప్పాడు. పాకిస్తాన్, కతార్, ఈజిప్టు రంగంలోకి దిగి మరోసారి చర్చల కోసం రావాలని ఇరు పక్షాలనూ కోరుతున్నాయి. అదేమీ తేలకుండానే అమెరికా రెచ్చగొట్టుడు కారణంగా హర్మూజ్ జలసంధిని మరోసారి మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. తాము కూడా దిగ్బంధనాన్ని తిరిగి కానసాగించి ఇరాన్‌కు నౌకల రాకపోకలను అడ్డుకుంటామని ట్రంప్ ప్రకటించాడు. అంతే కాదు, హర్మూజ్ జలసంధిలో ప్రయాణించే నౌకల మీద వాటిలోని సరకు విలువలో 20 శాతం పన్ను విధిస్తానని కూడా ప్రకటించాడు. అంతకు ముందు ఇరాన్ పన్ను వసూలు చేస్తానని చెబితే వ్యతిరేకించిన పెద్ద మనిషి ఇప్పుడు తానే ఆ పని చేస్తానని చెప్పాడు.

రోజువారీ దాడులు, ప్రతి దాడులు ఎదుటి పక్షాన్ని ఏ విధంగా దెబ్బతీసిందీ ఆయా దేశాలు చేస్తున్న ప్రకటనల వార్తలు తెలిసిందే. ఇరాన్ అణు, మిలిటరీ సామర్ధ్యాన్ని పూర్తిగా నాశనం చేసినట్లు ట్రంప్ ఇప్పటి వరకు నలభై నుంచి యాభైసార్ల వరకు చెప్పి ఉంటాడు. అయినా అమెరికా స్థావరాల మీద ఇరాన్ దాడులు ఎలా చేయగలుగుతున్నదన్న అంశం అనేక మందికి అంతుబట్టటం లేదు. మానవ పరిణామ క్రమంలో అవసరాలే అనేక నూతన ఆవిష్కరణలకు దోహదం చేశాయి. ఇది ఇరాన్‌కూ వర్తిస్తుంది. వియత్నాంపై రెండున్నర దశాబ్దాల పాటు జపాన్, ఫ్రాన్సు, అమెరికా సామ్రాజ్యవాదులు భీకర దాడులు చేశారు. వారి మిలిటరీ, ఆయుధ సామర్థ్యాన్ని గెరిల్లా పోరాట పద్ధతులను అనుసరించి కమ్యూనిస్టులు ఎదిరించి నిలవటమే కాదు, 1975లో అమెరికన్లు దొరికిన విమానాలు, హెలికాప్టర్లను పట్టుకొని పారిపోయేట్లు చేశారు. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల చేతిలోనూ అమెరికాకు అదే పరాభవం ఎదురైంది. ఇప్పుడు ఇరాన్‌లో కూడా అమెరికాకు అదే జరుగుతోంది. అడవులు, కొండలు గుట్టల్లో గెరిల్లా పద్ధతి వేరు. సముద్రంలో కూడా ఇరాన్ ఆ విధానాన్ని అనుసరిస్తున్నది. ఆత్మరక్షణ-ప్రతిఘటన దాడి పద్ధతులను అభివృద్ధి చేసుకొన్నది. దీనికి ఇతర దేశాల అనుభవాలు నేర్పిన పాఠాలతో పాటు చైనా, రష్యా అందచేస్తున్న సహకారం కూడా తోడు కావటం, ఈ పరిణామాలను అమెరికా, ఇజ్రాయిల్ పసిగట్టలేకపోవటం కనిపిస్తున్నది. గూఢచర్యంలో ఈ రెండు దేశాల తరువాతే మిగతావి అన్నట్లు అనేక మంది కీర్తించటం తెలిసిందే. అలాంటి తోపులనే ఇరాన్ తప్పుదారి పట్టించి తనను తాను కాపాడుకుంటున్నది, ప్రతి దాడులు చేయగలుకుతున్నది. తన డ్రోన్లు, క్షిపణులు ఎక్కడ ఉన్నదీ తెలియకుండా కాపాడుకోవటమే కాదు, ప్రయోగ కేంద్రాలను కూడా ఎప్పటికప్పుడు మారుస్తూ శత్రువుల నిఘాను ఏమారుస్తున్నది.

ఇరాన్ నౌకా దళాన్ని రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు ఒకసారి నాశనం చేశారు. తరువాత మరోసారి విధ్వంసం కావించారు. తాజాగా మూడవసారి అమెరికా మరికొంత నష్టం కలిగించింది. అయినా స్వల్ప ఖర్చుతో చిన్న పడవలతో హర్మూజ్ జలసంధిలో అమెరికాను ముప్పుతిప్పలు పెట్టటంలో ఇప్పటి వరకు ఇరాన్ జయప్రదమైంది.

1979లో తమ తొత్తు షాను గద్దె దించి అధికారానికి వచ్చిన ఇస్లామిక్ శక్తులను దెబ్బ తీసేందుకు 1980లో ఇరాక్‌ను రెచ్చగొట్టిన అమెరికన్లు ఇరాన్ మీద దాడులు చేయించారు. అవి 1988 వరకు కొనసాగాయి. ఇరాన్ చమురు ఎగుమతులను దెబ్బ తీయటం ఆ పోరు లక్ష్యాలలో ఒకటి. దానిలో భాగంగా టాంకర్ల మీద దాడులు, ప్రతి దాడులు జరగటంతో టాంకర్ల పోరుగా దాన్ని పిలిచారు. నాలుగు వందల చమురు టాంకర్ల మీద దాడులు జరగ్గా కొందరు సాధారణ పౌరులతో సహా రెండు వందల మందికి పైగా నావికులు మరణించారు. అప్పుడు కూడా హర్మూజ్ జలసంధిని దిగ్భంధనం చేసేట్లు ఇరాన్‌ను రెచ్చగొట్టినా ఆ నాడున్న పరిస్థితిలో అది జరగలేదు. ఇలా ఎన్నింటినో అధ్యయనం చేసిన ఇరాన్ హర్మూజ్ జలసంధిలో ఇప్పుడు కొరకరాని కొయ్యగా తయారైంది. ఇరాన్ రివల్యూషనరీ గార్డులకు ఒక అధినాయకత్వం ఉన్నప్పటికీ ప్రాంతీయ విభాగాలుగా వ్యవస్థలను ఏర్పాటు చేసి శత్రువులను దెబ్బ తీసేందుకు ఏ పద్ధతి వీలైతే దాన్ని అమలు చేసే స్వేచ్ఛ ఇచ్చారు. శత్రువును దెబ్బ తీయటమే అంతిమ లక్ష్యం. ప్రపంచ రవాణాలో పర్షియన్ గల్ఫ్ లేదా హర్మూజ్ జలసంధితో పాటు సూయజ్ కాలువ ద్వారా తూర్పు మధ్యధరా సముద్రంతో హిందూ మహా సముద్రాన్ని కలిపే ఎర్ర సముద్రం కీలక పాత్ర పోషిస్తున్నది. హర్మూజ్ జలసంధిని దిగ్బంధనం కావించేందుకు గతంలో ఇరాక్ ఎంతగానో రెచ్చగొట్టింది. అలా జరిగితే పశ్చిమ దేశాలన్నింటినీ రంగంలోకి దించాలన్నది అసలైన ఎత్తుగడ. అప్పటికీ ఇప్పటికీ మారిన పరిస్థితులు, మిత్ర దేశాలు అమెరికా కోసం చేతులు కాల్చుకొనేందుకు సిద్ధంగా లేవని ఉక్రెయిన్ నేర్పిన అనుభవం. అదే హర్మూజ్ విషయంలో పునరావృతం అవుతుందని వేసిన అంచనా. ఇలా ఎన్నో పరిణామాల పూర్వ రంగంలో ఇరాన్ ముందుకు వచ్చి జలసంధిని దిగ్బంధనం కావించింది. అది టెహరాన్ ముందు చూపుకు నిదర్శనమైతే వాస్తవాలను గ్రహించలేక అహంకారానికి లోనుకావటానికి అమెరికా తార్కాణంగా నిలిచింది. పశ్చిమాసియా సంక్షోభం ముగియటం అనివార్యం, అయితే ఎలా అన్నది ఊహించలేము !

mkr

ఎం. కోటేశ్వరరావు


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్